మరాఠా రాజకీయవేత్త-మనోహర్ జోషి
- December 02, 2024మనోహర్ జోషి ...భారత దేశ రాజకీయాల్లో ఆయనది విలక్షమైన శైలి. సుదీర్ఘకాలం మహారాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై కార్పొరేటర్ నుంచి సీఎం దాక ఎదిగారు. శివసేన అధినేత బాల్ థాకరే మీదున్న అభిమానంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన జోషి, తనదైన శైలిలో రాజకీయాలను నడిపించారు. జాతీయ రాజకీయాల్లో సైతం వెలిగిన జోషి, లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు.నేడు లోక్ సభ మాజీ స్పీకర్ స్వర్గీయ మనోహర్ జోషి జయంతి.
మనోహర్ జోషి పూర్తి పేరు మనోహర్ గజానన్ జోషి. 1937,డిసెంబర్ 2న ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లా నందావి గ్రామంలో గజానన్ కృష్ణ జోషి, సరస్వతి బాయి దంపతులకు జన్మించారు. బొంబాయి(నేడు ముంబై)లోని వీర్‌మాత జిజియాబాయి టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన జోషి, బొంబాయి యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎల్.ఎల్.బి పూర్తి చేశారు.
జోషి లా పూర్తి చేసిన తర్వాత బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్లో అధికారిగా చేరారు. అయితే, కొద్దీ కాలానికే ఉద్యోగానికి రాజీనామా చేసి కోహినూర్ పాలిటెక్నీక్ విద్యాసంస్థను ప్రారంభించారు. దానితో పాటుగా కార్పొరేషన్లో సివిల్ కాంట్రాక్టర్ గా మారారు. విద్యాసంస్థలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో విజయవంతమైన వ్యాపారిగా ఎదిగారు. నేడు ఆయన స్థాపించిన కోహినూర్ విద్యాసంస్థల కింద ఇంజనీరింగ్, పాలిటెక్నీక్, మేనేజ్మెంట్, అర్చిటెక్చర్ విద్యాసంస్థలు నడుస్తున్నాయి.
ఆరెస్సెస్ మూలాలు ఉన్న జోషి ,1960వ దశకంలో బాల్ థాకరే స్థాపించిన శివసేన పార్టీలో చేరి, ఆ పార్టీలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరిగా మారారు. 1968 బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా జోషి ఎన్నికయ్యారు. కార్పొరేషన్లో థాకరే దూతగా వ్యవహరిస్తూ అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. 1972 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన టిక్కెట్ మీద దాదర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా మున్సిపల్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సహకారంతో 1976-77 వరకు బొంబాయి మేయర్ గా బాధ్యతలు చేపట్టారు జోషి.
1980 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన నుంచి దాదర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1982లో స్థానిక సంస్థల నుంచి ఎమ్యెల్సీగా ఎన్నికైన జోషి మండలిలో 1988 వరకు కొనసాగారు. 1990లో దాదర్ నుంచి తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1990-91 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షనేతగా పనిచేశారు. 1995 ఎన్నికల్లో శివసేన - భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత థాకరే ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1995-99 వరకు సీఎంగా జోషి ఉన్నా, థాకరేనే తెరవెనుక నుండి ప్రభుత్వాన్ని నడిపించారు. ఈ సమయంలోనే బొంబాయి పేరును ముంబైగా మార్చారు.
1999లో కోర్టు తీర్పు మూలంగా సీఎం పదవికి రాజీనామా చేసిన జోషి, 1999 లోక్ సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నుంచి ఎంపీగా ఎన్నికై, వాజ్ పేయ్ మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలు శాఖ మంత్రిగా 1999-02 వరకు పనిచేశారు. 2002లో అప్పటి లోక్ సభ స్పీకర్ బాలయోగి ఆకస్మిక మరణం చెందగా, ఆయన స్థానంలో 13వ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టిన తోలి మహారాష్ట్ర నేతగా జోషి చరిత్ర సృష్టించారు. 2002-04 వరకు లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు.
2004 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత 2006లో జోషి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇదే సమయంలో శివసేన వరసగా పదేళ్లు అధికారానికి దూరమవడంతో జోషి రాజకీయ జీవితం సైతం చివరి దశకు చేరుకుంది. తన రాజకీయ గురువు శివసేన అధినేత బాల్ థాకరే మరణం తర్వాత, జోషి క్రియాశీల రాజకీయ జీవితం సైతం ముగిసింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఐదు దశాబ్దాల పాటు శివసేన జెండా మోసిన జోషి , అధినేత బాల్ థాకరేకు అత్యంత ఇష్టుడైన నేతగా ఉండేవారు. ఇతర పార్టీలతో రాయబారాలకు జోషిని తన ప్రతినిధిగా థాకరే పంపేవారు. శివసేనలో, థాకరే కుటుంబంలో వచ్చిన అనేక సంక్షోభాలను పరిష్కరించడంలో జోషి అనేక సార్లు సఫలం అయ్యారు. శివసేన - భాజపా కూటమి ఏర్పాటులో సైతం జోషి పాత్ర కీలకం. జోషి ద్వారానే థాకరేను ఒప్పించి కూటమి ఏర్పాటుకు భాజపా నేత ప్రమోద్ మహాజన్ నాంది పలికారు. జాతీయ రాజకీయాల్లో థాకరే తర్వాత శివసేన పార్టీ మంచి గుర్తింపు ఉన్న నేత ఒక్క జోషి మాత్రమే అంటే అతిశయోక్తి కాదు.
జోషి ప్రస్తావన లేకుండా శివసేన చరిత్ర ముగియదు. థాకరే తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన తనయుడు ఉద్దవ్ థాకరే హయాంలో జోషికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించుకునేలా చేయడం జరిగింది. 2016 నాటికే శివసేన పార్టీకి జోషి దూరమయ్యారు. రాజకీయాల నుండి దూరమైన నాటి నుండి అనారోగ్యానికి గురై తన 86వ ఏట 2024, ఫిబ్రవరి23న తుదిశ్వాస విడిచారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!