యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!

- December 06, 2024 , by Maagulf
యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!

యూఏఈ: యూఏఈలో బహిరంగ ప్రదేశాల్లో కార్లు కడగడం చట్టబద్ధమైనదేనా? ఎమిరేట్స్‌లోని కొన్ని నగరాల్లో, మూసివేయబడిన కమ్యూనిటీలలోని ఇళ్ల వెలుపల లేదా భవనాల ముందు ప్రదేశాలలో కార్లను కడగడం చట్టబద్ధం కాదు. వీధులు, పార్కింగ్ స్థలాలు, ఉద్యానవనాలు మరియు ఏదైనా ఇతర సామూహిక ప్రాంతాలతో సహా అన్ని బహిరంగ ప్రదేశాలకు ఇది వర్తిస్తుంది. యూఏఈలోని పౌర అధికారులు ఎమిరేట్ పరిశుభ్రత కోసం నివాసితులను కూడా తమ వంతుగా చేయమని కోరుతున్నారు. పట్టణ ప్రాంతాల పరిశుభ్రతను కాపాడుతూ నీటి వృథాను తగ్గించడం,  పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కూడా ఈ పాలసీ లక్ష్యమని తెలిపారు.  నిర్దేశించిన కార్ వాష్ సౌకర్యాలతోపాటు పెట్రోల్ స్టేషన్లలో మాత్రమే కార్ వాషింగ్ అనుమతించినట్టు తెలిపారు. 

ఎందుకు జరిమానా?

బహిరంగ ప్రదేశాల్లో మీ కారును కడగడం చట్టవిరుద్ధం. జరిమానాలు విధించవచ్చు. దుబాయ్, అబుదాబి నివాసితులు తమ వాహనాలను వీధులు, పార్కింగ్ స్థలాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో కడిగితే 500 దిర్హామ్‌ల జరిమానా విధిస్తారు.అయితే, కొన్ని షరతులు పాటిస్తే మీరు మీ విల్లాలో వాహనాలను కడగవచ్చు. వాషింగ్ కోసం ఉపయోగించే నీరు బహిరంగ ప్రదేశాల్లోకి చేరకుంటే కారును కడగడానికి అనుమతిస్తారు.  కమ్యూనిటీ విల్లాలో, మీ కారును కడగడం వల్ల వీధుల్లోకి లేదా సాధారణ ప్రాంతాల్లోకి నీరు ప్రవహిస్తే మీరు జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రోడ్లపైకి వచ్చే నీటి కారణంగా డ్రైనేజీ వ్యవస్థలు ఫెయిల్ అవుతాయి. ఇది కాలుష్యానికి దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో, నివాసితులు అనుకోకుండా క్లీనింగ్ మెటీరియల్స్ లేదా రసాయనాలను ఉపయోగించడం ద్వారా సమస్య మరింత పెరుగుతుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన నివాసితులు ఉల్లంఘన నోటీసు (NOV) తోపాటు Dh500 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

'డర్టీ కార్' పెనాల్టీ

దుబాయ్‌లో  మురికి లేదా డర్టీగా ఉన్న కార్లను బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన వాహన యజమానులకు Dh500 జరిమానాను అధికారులు విధిస్తారు. ఎక్కువసేపు వాష్ చేయని వాహనాలను పబ్లిక్ పార్కింగ్‌లో ఉంచడం వల్ల పరిశుభ్రతపై ప్రభావం చూపుతుందని, దాంతోపాటు నగర సుందరీకరణకు కూడా ఆటంకం కలుగుతుందన్నారు.

అబుదాబిలో మురికి వాహనాలను రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుంది. నగర అధికారులు అటువంటి చర్యలకు కఠినమైన జరిమానాలను విధిస్తారు. వాహనదారులు Dh3,000 భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి నేరాలకు వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవచ్చు.

లైసెన్స్ ఉంటేనే కార్ వాష్

లైసెన్స్ ఉన్న కార్ వాష్ సదుపాయాలను మాత్రమే వినియోగించాలి.  షార్జాలో పబ్లిక్ వీధులు లేదా నివాస ప్రాంతాలలో తమ వాహనాలను శుభ్రం చేయడానికి అక్రమ కార్ వాషర్‌లను వినియోగిస్తే..కార్ల యజమానులు 250 దిర్హామ్‌ల జరిమానా, అనధికార కార్ వాషర్లకు 500 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుంది. బహిరంగ ప్రదేశాలు లేదా నివాస ప్రాంతాలలో నివాసితుల వాహనాలను శుభ్రపరిచేటప్పుడు పర్యావరణాన్ని కలుషితం చేసే అక్రమ కార్ వాషర్‌లపై నగర మునిసిపాలిటీ కఠినంగా వ్యవహరిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com