సైద్ధాంతిక రాజకీయవేత్త - జనసంఘ్ రామారావు
- December 12, 2024
రాజకీయాల్లో మెరిసే రంగురాళ్ళను, రత్నాలను కలిపి జల్లిస్తే, జల్లెడలో మిగిలే ఏకైక మేలిమి రత్నం వి.రామారావు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇచ్చే ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదనుకొని రాజకీయాల్లోకి అడుపెట్టారు. తాను పనిచేసిన పార్టీ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న అరుదైన నాయకుడు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని జనసంఘ్, భాజపాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించిన నాయకుల్లో వీరు ఒకరు. నేడు భాజపా వ్యవస్థాపక సభ్యులు, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు గారి జయంతి.
జనసంఘ్ రామారావుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుపరిచితులైన వెంట్రప్రగడ రామారావు 1935, డిసెంబర్12న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకా వెంట్రప్రగడ గ్రామంలో జన్మించారు. తండ్రి అప్పారావు హోమియో వైద్యుడు కావడంతో కొంత కాలం పాటు మండవల్లి గ్రామంలో ఉన్నారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. అనంతరం భాగ్యనగరంలోని హై కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు.
రామారావు విద్యార్థిగా ఉన్న సమయంలోనే సంఘంలో చేరారు. సంఘ్ సిద్ధాంతాలకు ప్రభావితులై సంఘ్ తరపున ప్రచారక్ బాధ్యతల్లో పనిచేశారు. సంఘ్ పెద్దల ఆదేశాల మేరకు 1956లో జనసంఘ్ పార్టీలో చేరారు. హైదరాబాద్ కేంద్రంగా తన రాజకీయ కార్యకలాపాలకు స్థానంగా చేసుకొని పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. ఇదే సమయంలో న్యాయవాదిగా పలు కార్మిక సంఘాలతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. వివిధ కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా పనిచేశారు. జనసంఘ్ పార్టీ కోసం ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవిని సైతం వద్దనుకున్నారు.
జనసంఘ్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో బలోపేతం చేసేందుకు కాలికి బలపం కట్టుకొని ఊరురా తిరిగారు. ఎమెర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయ్యి జైలుకు సైతం వెళ్లారు. 1977లో జనసంఘ్ జనతాపార్టీలో విలీనం జరిగిన ఆ పార్టీ తరపున సార్వత్రిక ఎన్నికల్లో పనిచేశారు. 1980లో జనతా పార్టీ నుంచి వేరుపడి వాజపేయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలో చేరిన తెలుగు రాజకీయ నేతల్లో రామారావు ఒకరు.
రామారావు గారి మార్గదర్శనంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు భాజపా విస్తరించడం జరిగింది. అలాగే, వెంకయ్య నాయుడు, జంగా రెడ్డి, బద్దం బాల్ రెడ్డి, విద్యాసాగర్ రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, ఆలె నరేంద్ర, కిషన్ రెడ్డి మొదలైన వారు భాజపాలో కీలకమైన నాయకులుగా ఎదిగారు. వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రామారావు గారి శిష్యరికంలో రాటుదేలడమే కాకుండా, ఆయన సైద్ధాంతిక భావజాలానికి వారసుడిగా రాజకీయాల్లో రాణిస్తున్నారు.
అద్వానీ, వాజపేయ్ కోరిక మేరకు 1993-2001 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలోనే భాజపా తెదేపా సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభలకు భాజపా సభ్యులు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా, ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ సభ్యునిగా కూడా సేవలనందించారు. 2002లో వెంకయ్య నాయుడు జాతీయ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న సమయంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2002 ఆగస్టులో వాజపేయ్ సర్కార్ రామారావు గారిని సిక్కిం గవర్నర్ గా నియమించింది. ఆ రాష్ట్ర గవర్నర్ గా 2002-05 వరకు సేవలందించారు. కేంద్రానికి ప్రతినిధిగా రాజ్ భవన్ కే పరిమితమయ్యే గవర్నర్ గా కాకుండా తనకున్న అధికార పరిధిలోనే రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి కృషి చేశారు. అప్పటి సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్ ను ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర పాలనలో ఎటువంటి జోక్యం చేసుకోకుండా పరస్పర సహకారంతో పనిచేశారు. ఇప్పటికి ఆయన్ని సిక్కం ప్రజలు స్మరిస్తూనే ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరపున జనసంఘ్, జనతాపార్టీ మరియు భాజపాల నుంచి 1966, 1972,1978,1984లలో వరసగా నాలుగు సార్లు హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో జనసంఘ్, జనతా పార్టీల తరపున ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఆనాడు శాసనమండలిలో జనసంఘ్ నుంచి ఎన్నికైన వైసి రంగారెడ్డి, దేవిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిలతో కలిసి వీరు ప్రజా సమస్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ మీద రాజీలేని పోరాటాన్ని నడిపారు. మండలిలో ఈ ముగ్గురూ మాట్లాడుతుంటే సీఎంలు, మంత్రులు సైతం ఆసక్తిగా వినేవారు.
రామారావు గారు నిస్వార్థమైన రాజకీయ నాయకుడు. ఏనాడు పదవుల కోసం అర్రులు చాచిన దాఖలాలు లేవు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చినప్పటికి సున్నితంగా తిరస్కరించారు. ఎందరో సాధారణ కుటుంబాలకు చెందిన యువకులను రాజకీయవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకి దక్కుతుంది. దాదాపు 6 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తాను నమ్మిన సిద్ధాంతానికి చివరి దాక కట్టుబడి ఉన్నారు. అజాత శత్రువుగా, వివాదరహితుడిగా నిలిచిన రామారావు అనారోగ్యం కారణంగా తన 80వ ఏట 2016, జనవరి 17వ తేదీన కన్నుమూశారు.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..







