తమిళ రాజకీయ పేరాసిరియర్-అన్బళగన్

- December 19, 2024 , by Maagulf
తమిళ రాజకీయ పేరాసిరియర్-అన్బళగన్

​ ఆయన కరడు గట్టిన సిద్ధాంతవాది... నమ్మిన ద్రావిడ సిద్ధాంతానికి కట్టుబడి జీవితాంతం సమాజంలో ఉన్న అసమానతలను రూపు మాపేందుకు కృషి చేశారు.కాలానికి తగ్గట్లు తమిళ రాజకీయాల్లో వచ్చే మార్పులు చేర్పులకు అనుగుణంగా డీఎంకే పార్టీ సిద్ధాంత భావజాలాన్ని పునర్నిర్మిస్తూ వచ్చారు అన్బళగన్​.పెరియార్, అన్నాదురై, కరుణానిధిలకు సన్నిహితుడిగా మెలుగుతూనే తమిళనాడు రాజకీయాల్లో ప్రభల శక్తిగా మారారు.నేడు తమిళనాడు రాజకీయ దిగ్గజం,పేరాసిరియర్ స్వర్గీయ కె.అన్బళగన్ జయంతి. 

కె. అన్బళగన్ గారి పూర్తి పేరు కల్యాణసుందరం అన్బళగన్. 1922,డిసెంబర్ 19న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని ఉమ్మడి తంజావూరు జిల్లా తిరువారూర్ తాలూకా కట్టూర్ గ్రామంలో కళ్యాణసుందరనార్, స్వర్ణంబల్ దంపతులకు జన్మించారు. విద్యార్థిగా అత్యుత్తమ ప్రతిభను కనబర్చేవారు. తమిళ భాష మీద మక్కువతో తమిళం ప్రధానంగా డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసి మద్రాస్(చెన్నై) పట్టణంలోని పచ్చయప్ప కళాశాలలో తమిళ భాష ఆచార్యుడిగా పనిచేశారు.     

తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు కళ్యాణసుందరం రామయ్య, కానీ చిన్నతనంలోనే తమిళ శుద్ధి ఉద్యమ పితామహుడు మరైమలై అడిగళ్ స్పూర్తితో తన పేరును కల్యాణసుందరం అన్బళగన్ గా మార్చుకున్నారు. ఆనాడు మద్రాస్ రాష్ట్రంలో బ్రాహ్మణ అధిపత్యానికి వ్యతిరేకంగా రాజకీయాల్లో ప్రభల శక్తిగా ఉన్న జస్టిస్ పార్టీ తంజావూరు శాఖలో క్రియాశీలక విద్యార్ధి కార్యకర్తగా చేరారు. జస్టిస్ పార్టీ తరపున తంజావూరు పట్టణ సభలో ప్రసంగించి ప్రముఖ కవి, సామాజిక సంస్కర్త అన్నాదురైని ఆకర్షించారు. 

అన్నాదురై ఆహ్వానం మేరకు ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్ రామస్వామి నాయకర్ స్థాపించిన ద్రావిడ కళగం (డీకే)లో చేరారు.పెరియార్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల్లో అన్నాదురై, కరుణానిధిలతో కలిసి పాల్గొన్నారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పెరియార్ విధానాలతో విభేదించి అన్నాదురై, కరుణానిధి, నెడుంజెళియన్ మరియు సినీనటుడు ఎంజీఆర్ ద్రావిడ కళగం నుండి బయటకు వచ్చి 1949లో అన్నాదురై నాయకత్వంలో స్థాపించిన ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే) పార్టీలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. డీఎంకే స్థాపించిన నాటి నుంచి తుదిశ్వాస విడిచేవరకు ఆ పార్టీలోనే కొనసాగారు. డీఎంకే తరపున పనిచేస్తూనే పచ్చయప్ప కళాశాలలో తమిళ భాష ఆచార్యుడిగా పనిచేసేవారు. కళాశాలలో ఆయన ప్రభావంతో అనేక మంది విద్యార్థులు డీఎంకే పార్టీ తరపున పనిచేయడం ప్రారంభించారు.  

1957లో డీఎంకే తరపున తమిళనాడు శాసనమండలికి పోటీ చేసేందుకు అన్బళగన్ తన ఆచార్య పదవికి రాజీనామా చేశారు. 1957-67 వరకు మద్రాస్ శాసనమండలిలో డీఎంకే తరపున ప్రాతినిధ్యం వహించారు. మండలిలో నానాటికి డీఎంకే సభ్యుల పెరుగుదల చూసి జడిసిన నాటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రధాని ఇందిరా సహాయంతో 1967లోనే ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లగా, ఆ ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించింది. డీఎంకే విజయం వెనుక కరుణానిధి, అన్బళగన్ తెరవెనుక ఎన్నికల వ్యూహా రచనలు కీలక పాత్ర పోషించాయి. 1967 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తిరుచెంగోడ్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తమిళ భాషకు ప్రతీకగా మద్రాస్ రాష్ట్ర పేరును తమిళనాడుగా మార్చడంలో వీరు కీలకంగా వ్యవహరించారు. 

1969లో అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి తమిళనాడు సీఎం అవ్వడం వెనుక అన్బళగన్ ముఖ్యపాత్ర వహించారు. 1971లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పురశ్వాలకం నుంచి విజయం సాధించి కరుణానిధి మంత్రివర్గంలో ఆరోగ్య మరియు సాంఘిక, సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వచ్చారు. డీఎంకే నుంచి ఎంజీఆర్ వేరుపడి సొంతంగా పార్టీ పెట్టుకున్న సమయంలో పార్టీకి భారీ నష్టం జరగకుండా ఆయన చూసుకున్నారు. అయితే 1977-89 వరకు డీఎంకే ప్రతిపక్షానికే పరిమితమైనా పార్టీని నడపడంలో కరుణానిధికి  పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సిద్ధాంతకర్తగా సహాయపడ్డారు. డీఎంకేను 1977లో జనతాపార్టీ, 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాల్లో భాగస్వామిని చేయడంలో అన్బళగన్ కృషి చేశారు. 

తమిళనాడు అసెంబ్లీకి 8 సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైన అన్బళగన్, డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో 1989-91 వరకు విద్యాశాఖ మంత్రిగా, 1996-01వరకు విద్యా శాఖకు మంత్రిగా, 2001-06 వరకు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా , 2006-11 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. విద్యాశాఖ మంత్రిగా తమిళనాడు విద్యారంగంలో విపలవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో విద్యావేత్తల మన్ననలు అందుకున్నారు. 

తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే పార్టీ పలు ఆటుపోట్లను తట్టుకొని ఇన్నేళ్లు స్థిరంగా కొనసాగడానికి కారణం అన్బళగన్. 1977-2020 వరకు ఆ పార్టీ సెక్రెటరీ జనరల్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతమే లక్ష్యంగా పనిచేశారు. డీఎంకే పార్టీ భావజాలాన్ని తర్వాతి తరాలకు వ్యాప్తి చేసేలా పార్టీ సాహిత్యాన్ని రచించారు. కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించి రాజకీయంగా  సుశిక్షితులైన కార్యకర్తలుగా తయారు చేశారు. ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం తన తండ్రి కరుణానిధి వద్ద కంటే అన్బళగన్ వద్దే రాజకీయ పాఠాలను నేర్చుకున్నారు. ఎన్నికల వ్యూహా రచనలో అన్బళగన్ మించిన వ్యూహకర్త ఇప్పటి వరకు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన తుది శ్వాస విడిచే వరకు డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టో తయారీ బాధ్యతలు సైతం చూసేవారు. 

ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, డీఎంకే పార్టీలో నంబర్ 2గా ఎదిగారు. కరుణానిధికి ఆయన ఐదు దశాబ్దాలకు పైగా కుడిభుజంగా ఉన్నారు. తన ఆప్త మిత్రుడైన ముత్తువేల్ కరుణానిధి ఐదు సార్లు సీఎంగా ఎన్నికవ్వడంలో తెరవెనుక తనవంతు పాత్ర పోషించారు. పార్టీలో కరుణానిధితో సమానంగా గౌరవ మర్యాదలు అందుకున్న వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. తమిళనాడు రాజకీయాల్లో ఆయన్ని అందరూ "పేరాసిరియర్"(ఆచార్యుడు)గా వ్యవహరిస్తారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన సొంత జిల్లా తంజావూరుకే చెందిన కాంగ్రెస్ దిగ్గజం మూపనార్ గారితో సైతం ఆత్మీయంగా మెలిగేవారు. తన చివరి దశలో సైతం డీఎంకే పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తూనే అనారోగ్యం కారణంగా 97వ ఏట 2020, మార్చి 7వ తేదీన కన్నుమూశారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com