హెరిటేజ్ రథసారథి-నారా బ్రాహ్మణి
- December 21, 2024
భారత దేశం తొలి నుంచి పురుషాధిక్యత కలిగిన దేశం.పాలన,విద్య,వైద్యం,వ్యాపార, రక్షణ మొదలైనవి ఇలా రంగం ఏదైనా పురుషులే అందులో అనాదిగా రాణిస్తూ వస్తున్నారు.కానీ 21వ శతాబ్దంలో సామాజికంగా వచ్చిన మార్పులు కారణంగా వారితో సమానమైన స్త్రీలు సైతం అవకాశాలు అందిపుచ్చుకుని వ్యాపార,రాజకీయ,విద్య, వైద్య రంగాల్లో మరియు ఈరోజు రక్షణ రంగంలో సైతం తమని తాము నిరూపించుకుంటున్నారు. ఇంక మన తెలుగు రాష్ట్రాలకు వస్తే వ్యాపార రంగంలో ఎందరో నారీమణులు రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాంటి వారిలో కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం రాణిస్తున్న యువ పారిశ్రామిక వేత్త నారా బ్రాహ్మణి. నేడు హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి పుట్టినరోజు.
నారా బ్రాహ్మణి 1988, డిసెంబర్ 21 న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు నందమూరి బాలకృష్ణ, వసుంధర దేవిలు. ఆమె తాత గారైన స్వర్గీయ ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో అశేషమైన కీర్తిని పొందారు. తండ్రి బాలకృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటుల్లో ఒకరిగా కొనసాగుతూనే హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. సోదరి తేజస్విని, సోదరుడు మోక్షజ్ఞ తారక రామతేజ ఉన్నారు. తేజస్విని సినీ నిర్మాతగా, బాలకృష్ణకు వ్యక్తిగత సహయకురాలిగా ఉంటే, మోక్షజ్ఞ హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా పరిచయం అవుతున్నారు.
బ్రాహ్మణి బాల్యం తొలుత మద్రాస్ , ఆ తరువాత హైదరాబాద్ లలో సాగింది. ప్రతి వేసవి సెలవుల్లో మాత్రం కేంబ్రిడ్జ్ , అక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాలు పాఠశాల విద్యార్థులకు అందించే శిక్షణ తరగతుల కోసం ఇంగ్లండ్ వెళ్లి హాజరయ్యేవారు. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి ఇంజినీరింగ్ వరకు హైదరాబాద్ లోనే సాగింది. 10 వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో , ఇంటర్మీడియట్ చైతన్య జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలో, సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ చివరి సంవత్సరం లో ఉండగానే అమెరికా లోని ప్రముఖ శాంటా క్లారా విశ్వవిద్యాలయంలో సీటు రావడంతో బీటెక్ పూర్తి చేసిన వెంటనే అందులో చేరి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు.
మాస్టర్స్ లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఎంబీఏ కోసం ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోగా 4 ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చిన స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేశారు. యూఎస్ఏలో ఎంబీఏ చదువుతున్న సమయంలో కేవలం చదువుకే పరిమితం కాకుండా కళాశాలలో ఉన్న వివిధ బిజినెస్ అనుబంధ సంస్ధలు గురించి క్షుణ్ణంగా తెలుసుకొనేవారు. ఎంబీఏ చదువుతున్న సమయంలో నే ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వెంచర్ క్యాపిటల్ రంగం గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం ప్రారంభించి తన ఎంబీఏ ఆఖరి సంవత్సరం ప్రాజెక్టును సైతం దాని మీదే పూర్తి చేశారు.
బ్రాహ్మణి స్టాన్ఫర్డ్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే సింగపూర్ కేంద్రం గా వెంచర్ క్యాపిటల్ రంగంలో ఎదుగుతున్న ఒక ప్రముఖ సంస్థలో రెండేళ్ళ పాటు పనిచేశారు. కేవలం ఉద్యోగ విధులకు మాత్రమే పరిమితం కాకుండా ఫైనాన్స్, డీల్ సోర్సింగ్, బ్రాండ్ మేనేజ్మెంట్ వంటి పలు ముఖ్య విభాగాల మీద పూర్తి స్థాయిలో పట్టుసాధించారు.
సినీ , రాజకీయ కుటుంబానికి చెందిన బ్రాహ్మణికి వ్యాపార రంగంలో ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం ఆమె తల్లి నందమూరి వసుంధర దేవి( ప్రముఖ వ్యాపారవేత్త), తాత (తల్లి తండ్రి) దేవరపల్లి సూర్యారావు (దక్షిణ భారత దేశంలో రవాణా రంగంలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ రవాణా సంస్థ ఎస్.ఆర్.ఎం.టి వ్యవస్థాపకుడు). వీరి స్ఫూర్తితోనే చిన్నతనంలోనే వ్యాపార రంగం లో రాణించాలని నిర్ణయించుకున్నారు.
2013లో హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్ గా కంపెనీలో కీలకమైన భాద్యతలు నిర్వహిస్తున్న భర్త లోకేష్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేందుకు కంపెనీ భాద్యతలు నుంచి తప్పుకోవడంతో సింగపూర్ లో పనిచేస్తున్న బ్రాహ్మణి ఉద్యోగానికి రాజీనామా చేసి హెరిటేజ్ కంపెనీలో డైరెక్టర్ గా భాద్యతలు స్వీకరించారు. సంస్థ డైరెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన వెంటనే సంస్థ ఆధ్వర్యంలో నష్టాల్లో నడుస్తున్న రిటైల్ విభాగం మీద దృష్టి సారించి నష్టాల ఊబిలో నుంచి లాభాల్లో నడిపించారు. తమిళనాడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకె పరిమితం అయినా కంపెనీని కర్ణాటక,కేరళ మరియు ఉత్తరాదికి విస్తరించారు.
హెరిటేజ్ సంస్థ ఏర్పాటైన నాటి నుంచి మునుపెన్నడూ లేనంత గా సంస్థను అత్యంత లాభాల బాటలో నడిపిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ ఈడి గా కొనసాగుతున్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తమ సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్న బ్రహ్మణి ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.
బ్రాహ్మణి కేవలం వ్యాపార రంగానికి మాత్రమే పరిమితం కాకుండా హెరిటేజ్ ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా చిత్తూరు మరియు పలు జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్త్రీలకు సైతం వారికి నచ్చిన పలు అంశాలపై శిక్షణ ఇప్పిస్తూ వారికి హెరిటేజ్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాసిబిలిటీ (CSR) కింద సంస్థ ఇప్పటికే పలు గ్రామాలను దత్తత తీసుకోని ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా, వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని అభివృద్ధి నోచుకోని గ్రామాలను దత్తత తీసుకొనే ఆలోచనలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భాద్యతలు సైతం స్వీకరించి బ్రాహ్మణి ట్రస్ట్ కింద నడుస్తున్న విద్యాసంస్థలు మరియు పలు సేవా కార్యక్రమాలు పర్యవేక్షణ చేస్తూనే నూతనంగా ట్రస్ట్ కింద పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు . ట్రస్ట్ తరుపున వైద్య సేవలు విస్తృతం చేయడంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. విజయవంతంగా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం రూపకల్పనలో కీలకమైన పాత్ర పోషించారు. ఇక తండ్రి బాలకృష్ణ ఛైర్మన్ గా ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతల్లో పాలుపంచుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా రోగులకు అతి తక్కువ ఖర్చుతోనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చికిత్సను అందుబాటులోకి తెచ్చే దిశగా బ్రాహ్మణి కృషి చేస్తున్నారు.
వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో బిజీగా గడుపుతున్న బ్రాహ్మణి వ్యక్తిగత జీవితానికి వెళ్తే 2007లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేష్ (తన మేనబావ)తో 19 ఏటా వివాహం జరిగింది. వారిద్దరి అపురూపమైన దాంపత్య జీవితానికి గుర్తుగా బాబు దేవాన్ష్ ఉన్నాడు.లోకేష్ ప్రస్తుతం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు మరియు ఐటీ & ఎలక్ట్రానిక్స్ మంత్రిగా కొనసాగుతున్నారు.
లోకేష్ రాజకీయ జీవితం విజయవంతంగా సాగడంలో బ్రాహ్మణి పాత్ర చాలా కీలకం. 2019లో తెదేపా ఓటమి పాలైన తర్వాత లోకేష్ రాజకీయంగా, మానసికంగా డీలా పడకుండా తన భర్తకు అండగా నిలుస్తూ మానసికంగా మనోధైర్యాన్ని కల్పించారు.2024 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను భుజాన వేసుకొని విస్తృత ప్రచారం నిర్వహించారు. బ్రాహ్మణి వల్లే మంగళగిరిలో లోకేష్ బంపర్ మెజారితో విజయం సాధించారు.
చిన్న వయస్సులోనే వివాహం జరిగినా తరువాత కాలంలో ఉన్నత విద్యను అభ్యసించారు. గృహిణిగా ఒకవైపు కుటుంబ భాద్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే వ్యాపార, సామాజిక సేవా రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నారా బ్రాహ్మణి వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనుకునే యువ మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







