టాలీవుడ్ హాస్య దిగ్గజం-ఏవీఎస్‌

- January 02, 2025 , by Maagulf
టాలీవుడ్ హాస్య దిగ్గజం-ఏవీఎస్‌

ఆయన్ని తలచుకోగానే మనకు తెలియకుండానే పెదాలపై చిరునవ్వులు చిందుతాయి. ఎన్ని బాధల్లో ఉన్నా చిటికలో మనసు ఉల్లాసభరితమవుతుంది. ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆయన మంచి హాస్యానికి అసలు సిసలైన చిరునామా. ఆయనే ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. బ్రహ్మానందంల్లాంటి నటుల సరసన సత్తా చాటుకున్న ప్రముఖ హాస్య నటుడు. అంతేనా? క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్రసీమలో తన ఉనికిని బలంగా నిరూపించుకున్నారు. పూర్వాశ్రమంలో ఆయన పాత్రికేయుడు కూడా. ఇంతకీ.. ఆయన ఎవరో కాదు...ఏవీఎస్‌. ఏవీఎస్‌ అనే పొడి అక్షరాల్లోనే ఆయన సుప్రసిద్ధులు. నేడు హాస్యనటుడు ఏవీఎస్‌ జయంతి. 

తెలుగు చలనచిత్ర సీమలో ఏవీఎస్‌గా ప్రసిద్ధులైన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం 1957 జనవరి 2న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో రాఘవయ్య, శివ కామేశ్వరి దంపతులకు జన్మించారు. తెనాలిలోని వీఎస్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీలో చదువుతున్నప్పుడు రంగస్థల నాటకాలను వేసేవారు. రసమయి సంస్థని స్థాపించి నవరస ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. మిమిక్రీ కళాకారుడిగా పేరు సంపాదించుకున్నారు. మంచి జర్నలిస్ట్‌గా పత్రికా రంగంలో పేరు సంపాదించుకున్నారు. తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టరుగా చేరారు. ఆ తరువాత ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఇన్‌చార్జిగా పనిచేసే దశలో చిత్ర పరిశ్రమకు వెళ్లారు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

వృత్తి రీత్యా జర్నలిస్ట్ అయిన ఏవీఎస్, తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1993లో విడుదలైన 'మిస్టర్‌ పెళ్లాం' సినిమాతో ఏవీఎస్‌ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కామెడీ స్టార్‌గా మారిపోయారు. ఈ చిత్రంలోని పాత్రకి ఏవీఎస్‌కి నంది పురస్కారం లభించింది. ఈ సినిమాలో ఏవీఎస్‌ 'నాకదో తుత్తి' అని అంటూ ఉంటారు. ఈ డైలాగ్‌ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. అసలు ఈ సినిమాతో ఏవీఎస్‌ సినిమా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.  

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన 'శుభలగ్నం' చిత్రంలో 'గాలి కనుబడుతుందా?' అంటూ అనేకానేక ప్రశ్నలు వేసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. 'ఘటోత్కచుడు' సినిమాలో 'రంగు పడుద్ది' అని చెప్పి ప్రేక్షకుల మోములో నవ్వులు పూయించారు. కొన్ని సినిమాలలో ప్రతినాయక పాత్రలలో కూడా నటించి మెప్పించారు. బుల్లితెర మీద ఎన్నో టీవీ షోస్‌లో ఏవీఎస్‌ పాల్గొన్నారు. తాను నటించిన తొలి చిత్రం 'మిస్టర్ పెళ్లాం' లో నటనకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏవీఎస్ ను నంది అవార్డుతో సత్కరించింది. ఇదే సినిమాకు ఆయన ఎన్నో ఇతర అవార్డులు అందుకున్నారు. 

సినీ రంగంలో అడుగుపెట్టిన నాటినుంచి ఏవీఎస్ ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు. యాక్టర్ గా, కమెడియన్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా... తెలుగు సినీ కళామతల్లికి ఎంతో సేవచేశారు. గత 19 ఏళ్లలో ఏవీఎస్ దాదాపు 500 చిత్రాల్లో నటించారు. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించారు. నిర్మాతగా 'అంకుల్',' ఓరి నీ ప్రేమ బంగారం కానూ' చిత్రాలను నిర్మించారు. 'సూపర్ హీరోస్','ఓరి నీ ప్రేమ బంగారం కానూ', 'రూమ్ మేట్స్', 'కోతిమూక' చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

అంతే కాకుండా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మా సెక్రటరీగా ఆయన సంస్థ పురోభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా, సినీ కార్మికుల అభ్యున్నతికి కూడా ఆయన ఎంతో పాటుపడ్డారు. చిత్రాల్లో నటిస్తూనే ఏవీఎస్ విదేశాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమాల వల్ల ఎంతో మంది చిన్న చిన్న నటీనటులకు ఉపాధి లభించేది. 

తెనాలికి రాష్ట్రానికి కళల రాజధానిగా గుర్తింపు తేవాలని ఆయన తపనపడ్డారు. ఎన్నో వేదికలపై తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్రంలో నగరాలకే పరిమితమైన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ పండుగను అత్యంత వైభవంగా తెనాలిలో జరిపేందుకు ఏవీఎస్‌ చేసిన కృషి మరువలేనిది. తెనాలి ప్రాధాన్యం తెలిసేలా వారిని గౌరవించేవారు. కళలకాణాచి పేరును సార్థకం చేసేందుకు ఆయన నిత్యం పరితపించారు. చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఉద్దండులను రప్పించి ఆంధ్రా ప్యారిస్‌ గొప్పతనాన్ని చాటారు.  కె.విశ్వనాథ్‌, నటులు మురళీ మోహన్‌ తదితరులకు బొల్లిముంత శివరామకృష్ణ స్మారక కళా పురస్కారాన్ని అందజేయడంలో భాగస్వాములయ్యారు. 

రంగస్థల నటునిగా, మిమిక్రీ కళాకారునిగా తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఏవీఎస్‌ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. వివేకా విద్యా సంస్థలు, గ్లోబల్‌ ఆసుపత్రితో కలిసి రెండుసార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందచేశారు. పట్టణంలో ఓపెన్‌ ఆడిటోరియం నిర్మించాలని కలలు కన్నారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన బాపును ప్రతివేదికపైనా గురువుగా చెప్పుకునేవారు.బాపు గీసిన బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు.చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేసిన ఏవీఎస్‌ కాలేయ వ్యాధితో బాధపడుతూ 2013, నవంబర్‌ 8న మరణించారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com