ద్రవిడ రాజకీయవేత్త-కనిమొళి
- January 05, 2025
కనిమొళి..ఈ పేరు దశాబ్దం క్రితం భారతదేశ రాజకీయాలను కుదిపేసింది. 2G స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో నిందితురాలిగా జైలుకు వెళ్లి రాజకీయంగా వివక్షను ఎదుర్కొన్న తోలి మహిళా నాయకురాలు కనిమొళి. సవాళ్లనే తన రాజకీయ ఉన్నతికి సోపానాలుగా మార్చుకొని, నేడు దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా పేరుగాంచిన డి.ఎం.కె పార్టీలో నంబర్ టూగా రాణిస్తున్నారు. రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి తనయగా రాజకీయాల్లోకి వచ్చినా తన కృషి, క్రమశిక్షణతో జాతీయ రాజకీయాల్లో రాణిస్తున్నారు. నేడు డి.ఎం.కె డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కనిమొళి కరుణానిధి జన్మదినం.
కనిమొళి 1968,జనవరి 5వ తేదీన చెన్నైలో కరుణానిధి, రాజాతి అమ్మాళ్ దంపతులకు జన్మించారు. చెన్నైలోని యెతిరాజ్ కాలేజీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డిగ్రీ, మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ విభాగంలో ఎంఏ పూర్తి చేశారు. తొలుత ది హిందూ దినపత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేసిన ఆమె, అనంతర కాలంలో సింగపూర్ కేంద్రంగా నడుస్తున్న తమిళ్ మురుసు పత్రికకు ఫీచర్స్ ఎడిటర్ గా పనిచేశారు. ఆ తర్వాత కొంత కాలం సన్ యాజమాన్యం నిర్వహణలో ఉన్న కుంగుమమ్ వార పత్రికకు ఎడిటర్ గా పనిచేశారు.
కనిమొళి తండ్రి కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా పనిచేశారు. ద్రవిడ ఉద్యమ రథ సారథిగా వ్యవహరిస్తూనే ద్రవిడ మున్నేట్ర కజగం(డి.ఎం.కె) పార్టీని అన్నాదురై తర్వాత విజయవంతంగా నడిపించారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ వాదాన్ని బలంగా వినిపించిన నేతగా కరుణానిధి దేశ ప్రజలకు అత్యంత సుపరిచితులు. ఆయన సాహితీ వారసురాలిగా కనిమొళి తొలుత తమిళ నాట అరంగేట్రం చేసినప్పటికి, కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 2007లో ఆమె డి.ఎం.కె నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
రాజ్యసభ ఎంపీగా కనిమొళి బాధ్యత తక్కువగా కనిపించినా, లోతుగా పరిశీలిస్తే నాటి యూపీఏ ప్రభుత్వానికి, కరుణానిధి ప్రభుత్వానికి రాజకీయ వారధిగా ఢిల్లీ రాజకీయాల్లో ఆమెది చాలా కీలకమైన పాత్ర. 2009లో యూపీఏ 2 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డి.ఎం.కె పార్టీకి అత్యధిక మంత్రిత్వ ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా రాజకీయాల్లో కీలకంగా మారుతున్న తరుణంలో 2G స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో నిందితుల జాబితాలో కనిమొళి పేరు ఉండటంతో ఆమె రాజకీయ జీవితం ఒక్కసారిగా తారుమారైంది. అక్రమంగా కోట్లాది రూపాయల నిధులను కలైంగర్ ఛానెల్ కు మళ్లించిన అభియోగాలతో పాటుగా నిబంధనలు ఉల్లంఘన చేసిన కారణంగా ఆమెను సీబీఐ అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టడం జరిగింది.
జైలుకు వెళ్లిన కనిమొళి మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఇదే సమయంలో ఆమెను దేశంలోనే అతిపెద్ద అవినీతిపరురాలిగా జాతీయ మీడియా పదే పదే ప్రసారాలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. తన వల్లే తన గారాల పట్టి జైలు పాలైందని కరుణానిధి కుమిలి పోతూ నిద్రలేని గడిపారు అని అంటారు. కేసు పూర్వాపరాలు ఎట్లా ఉన్నప్పటికి జైలు జీవితం ఆమెను పూర్తిగా మార్చేసింది. జైల్లో ఉన్నప్పుడే ఆమె రాజకీయ యదార్థ ముఖాన్ని అర్థం చేసుకున్నారు. తీహార్ జైల్లో 193 రోజులు గడిపిన కనిమొళి బెయిల్ పై విడుదలైన తర్వాత రాజకీయాలను చాలా సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టారు.
2013లో రెండో సారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన కనిమొళిని కేసు వివరాల పేరుతో ఢిల్లీలో మీడియా వెంటాడి వేధించేది. మొదట్లో దాట వేత ధోరణిలోనే కనపడినా, క్రమంగా వారి ప్రతి ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలిస్తూ వచ్చారు. ఆమెలో వచ్చిన మార్పును మీడియా ఏ విధంగా విశ్లేషణ చేసినప్పటికి; రాబోయే రోజుల్లో ఆమె రాజకీయ వైకుంఠపాళిని జాగ్రత్తగా ఆడబోతున్నారని మీడియా వర్గాలకు స్పష్టమైంది. ఢిల్లీలో మీడియాను ఎదుర్కునే విషయంలో ఆమె చూపిన పరిణితికి మెచ్చిన పార్టీ సీనియర్లు ఆమెను పార్టీ రాజ్యసభ పక్ష నేతగా ఎంపిక చేశారు. 2017లో కనిమొళి మీద పేర్కొనబడ్డ అభియోగాల నుంచి కోర్టు రిలీవ్ చేయడం ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు దోహదపడింది.
2018లో కరుణానిధి మృతి తర్వాత ఆమెకు రాజకీయంగా అండగా నిలిచిన వ్యక్తి స్టాలిన్. కనిమొళి పార్టీలో చేరిన నాటి నుండి స్టాలిన్ ఆమెను రాజకీయంగా ప్రోత్సహించేవారు. తమిళనాడు అసెంబ్లీ వరుస పరాజయాలు, కరుణానిధి మరణం, అళగిరి రాజకీయ వేర్పాటు వాదంతో సతమతమవుతున్న తన అన్న స్టాలిన్ కు మద్దతుగా నిలుస్తూ వచ్చారు కనిమొళి. కరుణ మరణంతో ఆయన రాజకీయ వారసుడిగా పార్టీ బాధ్యతలను చేపట్టే అన్ని అర్హతలు ఉన్న స్టాలిన్ పక్షాన నిలబడ్డ మొదటి కుటుంబ సభ్యురాలు కనిమొళి కావడం విశేషం. కరుణానిధి హయాంలో లాగే స్థాలిన్ హయాంలో సైతం ఢిల్లీ రాజకీయాల్లో స్టాలిన్ ప్రతినిధిగా కనిమొళికి బాధ్యతలు ఇచ్చారని రాజకీయ పండితులు పేర్కొన్నారు. 2022లో ఆమెను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా నియమించడం ద్వారా పార్టీలో స్టాలిన్ తర్వాత అనధికార నంబర్ టూగా ప్రమోషన్ పొందారు.
2019లో తూత్తుకుడి లోక్ సభ నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన కనిమొళి తన ప్రత్యర్థి భాజపా నాయకురాలైన తమిళ సై సౌందర్ రాజన్ మీద ఘనవిజయాన్ని సాధించి, డి.ఎం.కె పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారు. జాతీయ రాజకీయాల్లో భాజపాకు వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు జరిగే ప్రయత్నాల్లో తమ పార్టీ తరపున స్థాలిన్ అంగీకారంతో వాటికీ కనిమొళి మద్దతు తెలిపారు.
2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డి.ఎం.కె విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం మునపటి కంటే రెట్టింపు మెజారిటీతో రెండో సారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో భాజపాను గద్దె దింపే ప్రయత్నాల్లో ఏర్పాటైన ఇండియా కూటమి బలోపేతానికి కనిమొళి కృషి చేస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







