భారత పర్యావరణవేత్త - బహుగుణ

- January 09, 2025 , by Maagulf
భారత పర్యావరణవేత్త -  బహుగుణ

సుందర్‌లాల్ బహుగుణ ప్రముఖ గాంధేయవాద ఉద్యమకారుడు, పర్యావరణవేత్త. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించారు. 70వ దశకంలో హిమాయలయాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం చిప్కో ఉద్యమాన్ని నడిపిన ఆయన చరిత్రలో నిలిచిపోయారు. నేడు ఆయన జయంతి  

ఉత్త‌రాఖండ్‌లోని గ‌ర్వాల్ ప్రాంతంలో ఉన్న “మ‌రోడా” సుందర్ లాల్ బహుగుణ స్వ‌గ్రామం. సుందర్‌లాల్ బహుగుణకు పచ్చని చెట్లు.. పర్యావరణం అంటే ఎంతో ప్రేమ. హిమాలయాల్లో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. పర్యావరణ గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో 1974లో చిప్కో(హత్తుకోవడం అని అర్థం) ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. 1970 ల్లో నిర్లక్ష్యంగా చెట్లను నరికివేయడం ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేయడం ప్రారంభించినప్పుడు, ఉత్తరాఖండ్ లోని చమోలి ప్రాంతంలోని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు.

కర్ణ ప్రయాగ దగ్గర అడవుల్లో చెట్లను కొట్టివేసి 'పైన్‌' చెట్లను పెంచుదామని ప్రభుత్వ అధికారులు ప్రయత్నించినపుడు అక్కడి ప్రజలతో కలిపి విజయవంతంగా నిరోధించాడు. ఇలా బహుగుణ నేతృత్వంలో చిప్కో ఉద్యమం ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అంతటా వ్యాపించింది. గాంధేయ సత్యాగ్రహ విధానాల్లోనే నడిపినందున ఈ ఉద్యమాన్ని 'అడవి సత్యాగ్రహం' అని పిలిచేవారు. గిరిజనులు అడవులను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం మొదలైంది. మొదట చెట్లను రక్షించే ఉద్యమంగా, తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.

1974 జనవరిలో అలకానంద నదికి ఎదురుగా ఉన్న 2,500 చెట్లను వేలం వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఈ చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. చాలా శాంతియుతంగా సుందర్ లాల్ బహుగుణ ఆ ఉద్య‌మాన్ని సాగించారు. చెట్లను హత్తుకుంటూ..వాటి గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ ఉద్యమాన్ని నడిపించారు. ఈ చిప్కో ఉద్యమం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి ఆయన చేసిన విజ్ఞప్తి ఫలితంగా 1980 లో… పచ్చని చెట్లను నరికివేయడంపై ప్రభుత్వం 15 సంవత్సరాల నిషేధం విధించింది. 

ఆ తర్వాత భాగీరథి నదిపై ఉత్తరాఖండ్‌లో తెహ్రీ ఆనకట్ట నిర్మించడాన్ని నిరసిస్తూ సత్యాగ్రహ, నిరాహార దీక్షలు వంటి గాంధేయ వాద పద్ధతులను ఉపయోగించారు సుందర్‌లాల్ బహుగుణ. చిప్కో ఉద్యమం తరువాత కర్ణాటకలోని అప్పీకో ఉద్యమానికి ప్రేరణనిచ్చింది. చిప్కో ఉద్యమం, పర్యావరణ పరిరక్షణకు అతడు చేసిన కృషిలో ఒకటిగా నిలిచింది. ఈ ఉద్యమ సమయంలో అతను "పర్యావరణ శాస్త్రం శాశ్వత ఆర్థిక వ్యవస్థ" అనే నినాదాన్ని సృష్టించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1981లో పద్మశ్రీ, 2009లో పద్మ విభూషణ్‌ అవార్డులతో సత్కరించింది. కరోనా కారణంగా  94 ఏళ్ళ వయసులో 2021 మే 21న బహుగుణ కన్నుమూశారు. హిమాలయ ప్రాంత ప్రజల రక్షణ కోసం జీవితాంతం ఉద్యమించారు. కొండ ప్రజల దుస్థితిపై (ముఖ్యంగా శ్రామిక మహిళల దుస్థితిపై) పోరాడారు. 


- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com