అభివృద్ధి భగీరథుడు-అనగాని

- January 10, 2025 , by Maagulf
అభివృద్ధి భగీరథుడు-అనగాని

అనగాని సత్య ప్రసాద్ అంటే గుర్తుకు వచ్చేది కల్మషం లేని వ్యక్తిత్వానికి ప్రతిబింబం. తన పెదనాన్న అయిన భగవంతరావు వలె ప్రజల హితం కోరే మంచి మనిషిగా రేపల్లె ప్రాంత వాసుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రజల సంక్షేమం,   అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాలు నెరపుతున్న ఆదర్శవంతమైన నాయకుడు అనగాని. ఘనమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినప్పటికి తన స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ సమకాలీన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు అనగాని. నేడు ప్రజానేత, ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి జన్మదినం. ఈ సందర్భంగా సత్యప్రసాద్ గారి ప్రజా ప్రస్థానం గురించి ప్రత్యేక కథనం.

అనగాని సత్యప్రసాద్ 1972, జనవరి10న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామానికి అనుబంధమైన అనగానివారిపాలెం గ్రామంలో అనగాని రంగారావు, నాగమణి దంపతులకు జన్మించారు.సత్యప్రసాద్ సోదరిమణులు డాక్టర్ అనగాని మంజుల, డాక్టర్ కమల అనగాని హైదరాబాద్ నగరంలో ప్రముఖ వైద్యలుగా పనిచేస్తున్నారు. తండ్రి రంగారావు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ప్రసాద్ విద్యాభ్యాసమంతా హైదరాబాద్ నగరంలోనే జరిగింది.హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ అన్వర్ ఉలూం కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశారు. 

సత్యప్రసాద్ రాజకీయాల్లో రాకముందు హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఒకనొక సమయంలో ఉమ్మడి ఏపీ  రాష్ట్రంలో అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపబడ్డారు. రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా హాస్పిటల్ మరియు ఇతరత్రా వ్యాపారాల్లో ఉన్నారు.
 
సత్యప్రసాద్ కుటుంబ నేపథ్యం లోకి వెళితే వీరి పెదనాన్న అనగాని భగవతరావు గారి రాజకీయ దిగ్గజం మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో దేవాదాయ & ధర్మాదాయ, సహకార మరియు ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేశారు.పెదనాన్న స్పూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. 2008లో కూచినపూడి నియోజకవర్గం రద్దు కావడం, రేపల్లె మాజీ ఎమ్యెల్యే, తెదేపా సీనియర్ నేత ముమ్మనేని వెంకట సుబ్బయ్య గారు క్రియాశీలక రాజకీయ విరమణతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

2009-14 వరకు రేపల్లె నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ బాధ్యతలు చేపట్టిన అనగాని, నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పనిచేసేందుకు తన రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాలను సైతం పక్కన పెట్టి క్షేత్ర స్థాయిలో తిరుగుతూ వచ్చారు. రేపల్లె  ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ వారి మనసులను గెలుచుకొని 2014,2019,2024లో వరుసగా మూడు సార్లు రేపల్లె అసెంబ్లీ స్థానం  నుంచే విజయకేతనాన్ని ఎగుర వేశారు. 2024లో చంద్రబాబు మంత్రి వర్గంలో రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.        

సత్యప్రసాద్ రేపల్లె శాసనసభ్యులుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. 2014-19 వరకు తెదేపా ప్రభుత్వ హయాంలో మునుపెన్నడూ లేని విధంగా వందల కోట్ల రూపాయల నిధులను రాబట్టిన అనగాని త్రాగు & సాగు నీటి వనరుల అభివృద్ధి, 
నియోకవర్గవ్యాప్తంగా రోడ్లు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణం, రేపల్లె, నగరం, చెరుకుపల్లి ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశారు. అందువల్లే 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ హవా కొనసాగిన రేపల్లెలో మాత్రం సత్యప్రసాద్ గారు గెలవడం జరిగింది.

సత్యప్రసాద్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత కాలంలో వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, 2019లో వైసీపీ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన తర్వాత తెదేపా శాసనసభ్యులను ఇబ్బందులకు గురి చేసింది. వారిలో అనగాని ఒకరు. నాటి జగన్ సర్కార్ పై రాజీ లేని పోరాటాన్ని చేసిన వ్యక్తుల్లో అనగాని సైతం ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్యెల్యేగా అనగాని చేసిన ప్రజా పోరాటాల వల్ల ఆయనకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.  

2 దశాబ్దాల రాజకీయ జీవితంలో అనగాని సత్యప్రసాద్ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించారు. ఎల్లప్పుడూ నిరంతరం చిరు నవ్వులు చిందిస్తూ తనతో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను వినడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తారని పేరు తెచ్చుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఆయనకు రాజకీయాల్లోకి వచ్చి కొద్దీ కాలంలోనే అందరివాడిగా జనహృదయ నేతగా నిలిచిపోయారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రాజకీయాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ అనగాని సత్యప్రసాద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.         

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com