వెండితెర లెక్కల మాస్టర్ - సుకుమార్

- January 11, 2025 , by Maagulf
వెండితెర లెక్కల మాస్టర్ - సుకుమార్

ప్రేమ.. రెండు గుండెల చప్పుడు. రెండు జీవితాల సంగమం. రెండు కుటుంబాల కలయిక. అపురూపమైన ప్రేమను, అనిర్వచనీయమైన జీవితాన్ని, చిన్ని ఎద పట్టని భావోద్వేగాల్ని తెరకెక్కించగల ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌. ఆయనకు లెక్కలు తెలుసు. లెక్కల్లో ఇమిడిపోగల బతుకులు తెలుసు. అటు గణితాన్ని, ఇటు జీవితాన్ని కలగలిపి కలర్‌ ఫుల్‌గా కళ్లాపి జల్లి తెరపై రంగురంగుల రంగవల్లికలు అద్దగల సృజనశీలి. వన్‌ సైడ్‌ ప్రేమికుల పక్షాన నిలిచి.. వారి హృదయ స్పందనను 'ఆర్య'గా మలచినా.. బావమరదళ్ల సరస సల్లాపాల్ని 100 పర్సెంట్‌ లవ్‌గా తీర్చిదిద్దినా, మనం మరిచిపోతున్న మన పల్లె సీమల రంగస్థలాన్ని మనముందుకు తెచ్చినా.. ఆ లెక్కల మాస్టారికే చెల్లు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తెలుగు సినిమా పరిశ్రమకు సేవలందించిన ఘనత ఆయన సొంతం. ఆయనే ప్రముఖ‌ దర్శకుడు సుకుమార్‌. నేడు టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం మీ కోసం.. 

బండ్రెడ్డి సుకుమార్ 1970, జనవరి 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు సమీప మట్టపర్రులో జన్మించారు. తండ్రి తిరుపతి నాయుడు బియ్యం వ్యాపారి. తల్లి వీరవేణి గృహిణి. ఈ దంపతుల ఆరుగురి సంతానంలో సుకుమార్‌ చిన్నవారు. ఆరు సంవత్సరాల వయస్సులో.. తాను ఎంతగానో ప్రేమించిన కోడి పుంజు చనిపోయిన విషయం తెలుసుకొన్న సుకుమార్‌ అప్పటి నుంచి శాకహారిగా మారారు. రాజోలు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత లెక్కల్లో మాస్టర్స్‌ డిగ్రీ పట్టా పొందారు. కాకినాడలో ఆదిత్య జూనియర్‌ కళాశాలలో మ్యాథ్స్, ఫిజిక్స్‌ లెక్చరర్‌గా పనిచేశారు. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత సృజనాత్మకంగా ఏదైనా చేయాలని తన జూనియర్‌ ప్రకాష్‌ తోలేటితో కలిసి సుకుమార్‌ నిర్ణయించుకొన్నారు.  

ప్రకాష్‌ తోలేటి, సుకుమార్‌ కలిసి కొన్ని తెలుగు సినిమాలకు రచయితలుగా పని చేయడం ప్రారంభించారు. వాటిలో చిరంజీవి, రంభ కలిసి నటించిన బావగారు బాగున్నారా సినిమా కూడా ఉంది. అయితే, డబ్బును సంపాదించాలన్న ఆలోచనతో సుకుమార్‌ మళ్లీ విద్యార్థులకు భోధన చేయడం మొదలుపెట్టారు. డబ్బును సంపాదించిన తరువాత సినిమా పరిశ్రమకు తిరిగి వచ్చారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్‌ జుంక్షన్‌ సినిమాలకు సహాయకుడిగా పని చేశారు. దర్శకుడిగా మారక ముందు వి.వి.వినాయక్‌ దిల్‌ సినిమాకు సహాయక దర్శకుడిగా పని చేశారు. 

వినాయక్‌ దిల్‌ సినిమాకు పని చేయకముందే విశాఖపట్నంలో ఆర్య స్క్రిప్ట్‌ను రాయడం మొదలుపెట్టారు సుకుమార్‌. దిల్‌ సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తే తనతో సినిమా నిర్మిస్తానని దిల్‌ రాజు చెప్పారు. డర్‌, కభీ హా కభీ నా, సినిమాలలో కథానాయికకు కథానాయకుడు తన ప్రేమను సినిమా చివరిలో చెబుతారు. ఈ ఆలోచనని పాతదని సుకుమార్‌ భావించారట. అందుకే ఆర్య సినిమాలోని తాను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమని మొదట్లోనే చెప్పేటటువంటి కథాంశాన్ని ఎంచుకొన్నారట. 

ఆ కథకు ఇంప్రెస్‌ అయిన దిల్‌ రాజు ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ముందుకొచ్చారు. రవితేజ, నితిన్, ప్రభాస్‌ పేర్లను పరిశీలించిన తరువాత అల్లు అర్జున్‌ను కథానాయకుడిగా ఎంచుకొన్నారు. అనురాధ మెహతా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శివ బాలాజీ ముఖ్య పాత్రలో కనిపించారు. 2004లో ఈ సినిమా విడుదలైంది‌. రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఆర్య.. రూ.16 కోట్లు వసూళ్లు రాబట్టి కమర్షియల్‌గా విజయం అందుకొంది. ఈ విజయంతో ఒక్కసారిగా సినీ డైరెక్టర్‌ అయిపోయారు. 

2007లో జగడం సినిమా స్క్రిప్ట్‌పై వర్క్‌ చేయడం స్టార్ట్‌ చేశారు సుకుమార్‌. క్రైమ్‌ నేపథ్యం ఉన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌ పోతినేని, ఈషా హీరోహీరోయిన్లు. ఆర్య సినిమాలాగా కాకుండా జగడం సినిమాలో ఎక్కువగా హింస ఉంటుంది. ఈ చిత్రం మిశ్రమ స్పందన అందుకుంది. వాణిజ్యపరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకుల ప్రతిస్పందన గురించి ఆలోచించకుండా అమాయకంగా సినిమా తీసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. సాంకేతిక సిబ్బంది పరంగా ప్రశంసలను అందుకొందీ చిత్రం. మంచి ప్రయత్నం అనే మెప్పు అందుకొంది. ఆ తరువాత 2009లో ఆర్య 2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అల్లు అర్జున్, కాజల్‌ అగర్వాల్, నవదీప్‌ ప్రధాన పాత్రలు పోషించారు. విమర్శలు వచ్చినప్పటికీ ఈ సినిమా విజయవంతమైంది.

2011లో సుకుమార్‌ '100 పర్సెంట్‌ లవ్'‌ సినిమా విడుదలైంది. నాగ చైతన్య, తమన్నా హీరోహీరోయిన్లు. ఇది కమర్షియల్‌గా విజయవంతం సాధించింది. ఆ తరువాత సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం '1 నేనొక్కడినే'. మహేష్‌ బాబునే దృష్టిలో పెట్టుకొని సుకుమార్‌ ఈ సినిమా కథను రాశారట. ఈ ప్రాజెక్టుపై సుకుమార్‌ రెండు నెలల పాటు శ్రమించారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావించారు. 2014 జనవరి 10న విడుదైన ఈ చిత్రం విమర్శలను, ప్రశంసలను సమానంగా అందుకుంది. కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమా ఆశించినంత ఫలితం అందుకోలేకపోవడం ఆయన అభిమానులని బాధించేదే. 

అల్లు అర్జున్‌తో సుకుమార్‌ 'ఐ యాం దట్‌ చేంజ్‌' షార్ట్‌ ఫిల్మ్‌ తీశారు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు దర్శకుడిగా, రచయితగా సుకుమార్‌ వర్క్‌ చేశారు. ఆ తరువాత కుమారి 21ఎఫ్‌ సినిమాకు కథ, స్కీన్ర్‌ ప్లే అందించారు. ఈ చిత్రానికి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించగా సుకుమార్‌ నిర్మించారు. రాజోలులో కళాశాలలో చదువుతున్నప్పుడు అదే కళాశాలలో చదువుతోన్న ఒక యువతి కొంతమంది పురుషులతో పిక్నిక్‌కు వెళ్లారట. అప్పట్లో ఒక యువతి పురుషులతో పిక్నిక్‌కి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. దాంతో, ఆమెపై కొన్ని పుకార్లు వచ్చాయట. ఇది సుకుమార్‌ మదిలో నిలిచిపోయిందట. ఆ సంఘటన నుంచి స్ఫూర్తి అందుకొని కుమారి 21ఎఫ్‌ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్‌ కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. రిలీజ్‌ అయిన ఆ ఏడాదిలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన పన్నెండో సినిమాగా నిలిచింది. ఈ సినిమాపై మంచి రివ్యూలు కూడా వచ్చాయి.

సుకుమార్ గారికి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం. తండ్రి గౌరవార్ధం నాన్నకు ప్రేమతో సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకొన్నారు. ఇందులో జూ.ఎన్టీఆర్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోహీరోయిన్లు. ఇది తారక్​కు 25వ సినిమా. తండ్రి కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాల్ని చూపించిన 'నాన్నకు ప్రేమతో'.. 2016 జనవరి 13న రిలీజ్‌ అయింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. విదేశాలలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో తెలుగు చిత్రంగా నిలిచింది.

సుకుమార్‌ దర్శకత్వం వహించిన సినిమా రంగస్థలం. రామ్​చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు. ఇందులో చెర్రీ నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. దర్శకత్వం, స్కీన్ర్‌ ప్లే పరంగా సుకుమార్‌ కూడా ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. ఇలా పలు వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుక్కు. ఆ తర్వాత అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కించిన 'పుష్ప' సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజై బంపర్ హిట్ అవ్వడమే కాకుండా హీరోగా అర్జున్‌కు, దర్శకుడిగా సుకుమార్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అంతేకాకుండా, ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఇటీవల రిలీజైన పుష్ప 2 చిత్రంతో మరో బంపర్ హిట్ సుకుమార్ అందుకున్నారు.   

ఇండస్ట్రీలో దాసరి, ఆర్జీవీ తర్వాత ఆ స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్స్ ని డైరెక్టర్స్ మార్చిన మరో దర్శకుడు సుకుమార్ మాత్రమే. లెక్కల మాస్టారుగా తనకంటూ సెపరేట్ రైటింగ్ అండ్ మేకింగ్ స్కిల్స్ మైంటైన్ చేసే సుకుమార్, ఇప్పటికే ఇండస్ట్రీకి నలుగురు సాలిడ్ డైరెక్టర్స్ ని ఇచ్చాడు. సుక్కూ క్యాంప్ నుంచి అందరికన్నా ముందుగా బయటకి వచ్చిన వాడు ‘సూర్యప్రతాప్ పల్నాటి’. కుమార్ 21F సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సూర్య ప్రతాప్. ఈ మూవీ నుంచి సుకుమార్ రైటింగ్స్ మొదలయ్యింది.  

సూర్య ప్రతాప్ పర్వాలేదు మంచి సినిమా చేశాడు అని ప్రతి ఒక్కరితో అనిపించుకున్నాడు కానీ ఆ తర్వాత వచ్చిన బుచ్చిబాబు మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉప్పెన సినిమా చేసిన బుచ్చిబాబు, బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. తెలుగులో ఇలాంటి పాయింట్ ని యాక్సెప్ట్ చెయ్యరు అనుకున్న పాయింట్ తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు సన. ఈరోజు బుచ్చిబాబు రెండో సినిమాకే రామ్ చరణ్ తేజ్ తో పాన్ ఇండియా సినిమా చేసే స్థాయికి చేరుకున్నాడు.


బుచ్చిబాబు ప్రేమకథతో వచ్చి సెన్సేషనల్ హిట్ కొడితే, సుకుమార్ మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల మాస్ సినిమాతో మరో రంగస్థలాన్ని తలపించేలా ‘దసరా’ సినిమా చేశాడు. నాని హీరోగా నటించిన ఈ మూవీ వంద కోట్లు కలెక్ట్ చేసింది. ఫ్యూచర్ సుకుమార్ అని పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెలకి గాలం వేసే పనిలో ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రేమ కథ, కమర్షియల్ కథలు కాదు నేను థ్రిల్లర్ కథతో హిట్ కొడతాను అంటూ విరుపాక్ష సినిమాతో బయటకి వచ్చాడు కార్తీక్ దండు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ 2023లో రిలీజ్ అయ్యి యునానిమస్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో డివైడ్ టాక్ అనేది లేకుండా కేవలం హిట్ టాక్ మాత్రమే వినిపించింది విరుపాక్ష సినిమాకి మాత్రమే. 

ఇలా నలుగురు శిష్యులని దర్శకులుగా మార్చిన సుకుమార్, వీరి సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా సాలిడ్ స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. ఈ  స్టూడెంట్స్ కూడా సుకుమార్ లాగే సైలెంట్ గా ఉంటారు, సాలిడ్ గా సినిమా చేస్తారు, బాక్సాఫీస్ ని షేక్ చేసే రేంజులో హిట్స్ కొడతారు. త్వరలో సుకుమార్ కాంపౌండ్ నుంచి మరో దర్శకుడు బయటకి వస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. మరి అతను ఎలాంటి సినిమాతో బయటకి వస్తాడు అనేది చూడాలి. 

సుకుమార్ వ్యక్తిగత జీవితానికి వస్తే సుకుమార్‌ భార్య పేరు తబిత. ఆర్య సినిమా స్క్రీనింగ్‌ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సుదర్శన్‌ థియేటర్‌లో జరుగుతున్నప్పుడు మొదటిసారి సుకుమార్​కు తబిత పరిచయమైంది. సుకుమార్‌ తల్లిదండ్రులు, సోదరి సమక్షంలో వీరికి వివాహమైంది. సుక్కు సినిమా రంగానికి చెందిన వారు అవడం వల్ల తబిత తల్లిదండ్రులు వీరి పెళ్లికి తొలుత అంగీకరించలేదు. అనంతరం వారు ఒప్పుకొన్నారు. వీరి పిల్లలు సుక్రాంత్, సుకృతివేణి. వెండితెరపై మ్యాజిక్ చేయడమే అలవాటుగా పెట్టుకున్న సుకుమార్ రాబోయే రోజుల్లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 

- డి.వి.అరవింద్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com