టీటీడీ బోర్డు సభ్యులతో కమిటీలు ఏర్పాటు: చెక్కులు అందుకున్నది వీళ్లే
- January 12, 2025
తిరుమల: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ప్రకంపనలు తగ్గట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శల ముప్పేట దాడి కొనసాగుతూనే ఉంది.
తిరుపతి బైరాగిపట్టెడ పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం ఇది.
ఈ దుర్ఘటనలో మృతి చెందిన ఆరుమంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని టీటీడీ బోర్డు ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. నేటి నుంచ చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. ఈ మేరకు తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఆరుమంది మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేయడానికి బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యులు జోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు.
తమిళనాడు, కేరళను సందర్శించే బోర్డు సభ్యుల కమిటీలో రామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేష్ కుమార్, శాంతారాం, సుచిత్ర ఎల్లా ఉన్నారు. ఈ రెండు కమిటీలు ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి, స్థానిక శాసన సభ్యులతో కలిసి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చెక్కులను అందించనున్నారు.
అదే విధంగా ఈ కమిటీలు ప్రతి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధిత కుటుంబాల ఉద్యోగ, విద్యా వివరాలను కూడా సేకరిస్తాయి. ఈ రెండు కమిటీలకు సంబంధించిన రవాణా తదితర ఖర్చులను బీఆర్ నాయుడు సొంతంగా భరించనున్నారు.
దీనితోపాటు- తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు కూడా చెక్కుల పంపణీ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్‌లో ఏడుమంది బాధితులకు బీఆర్ నాయుడు చెక్కులను అందజేశారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు షాజహాన్ (మదనపల్లి), పులివర్తి నాని (చంద్రగిరి), బొజ్జల సుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి), గాలి భాను ప్రకాష్ (నగరి), టీటీడీ జేఈవో వీ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఇందులో పాల్గొన్నారు.
అన్నమయ్య రాయచోటి జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఎస్.తిమ్మక్క, విశాఖపట్నం జిల్లా గోపాలపట్నానికి చెందిన పీ ఈశ్వరమ్మకు రూ.5 లక్షలు చొప్పున పరిహారాన్ని బీఆర్ నాయుడు అందజేశారు. మరో అయిదుమంది క్షతగాత్రులు.. కే నరసమ్మ, పీ.రఘు, కే.గణేష్, పీ వెంకటేష్, చిన్నఅప్పయ్యకు రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందించారు.

తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







