సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్

- January 18, 2025 , by Maagulf
సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్

సింగపూర్: సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగింది. సీఎం వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్, హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రోహిణ్ రెడ్డి ఉన్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడు గడప రమేశ్ బాబు అధ్యక్షత వహించారు. సొసైటీ కార్యవర్గంతో పాటు తెలంగాణకు చెందిన ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాసులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఇక్కడ కూడా కొనసాగిస్తూ అందరితో మమేకం అవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సీఎం రేవంత్ రెడ్డి ప్రవాసులతో మమేకమయ్యారు. తెలంగాణ అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై మాట్లాడారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసులు తమ సొంత రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల మోడల్స్‌ను తీసుకొని తెలంగాణను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని సీఎం చెప్పారు.

ఈ సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు తమ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు చేశారు. తెలంగాణ నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సింగపూర్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సీఎంకు వివరించారు. వీటిపై సీఎం స్పందిస్తూ, వీలైనంత త్వరగా పరిష్కారాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం సింగపూర్ ప్రవాసులతో సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజల ఏకత్వానికి, సొంత రాష్ట్ర పట్ల ఉన్న ప్రేమను గుర్తు చేస్తూ, ప్రవాసుల అభిప్రాయాలను వినడంలో ముఖ్యమంత్రి నిబద్ధతను చూపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com