మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి

- January 22, 2025 , by Maagulf
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి

మహారాష్ట్ర: మహారాష్ట్ర జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ట్రైన్ వేగంగా వచ్చి పలువురు ప్రయాణికులను ఢీకొట్టడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి ముందుగా పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో మంటలు చెలరేగాయన్న వదంతులతో ప్రయాణికులు భయంతో చైన్ లాగి ట్రైన్‌ను ఆపించారు.ఆందోళనతో ట్రైన్ నుంచి దిగిన ప్రయాణికులు పట్టాలు దాటే ప్రయత్నం చేస్తుండగా మరో ట్రాక్‌పై వేగంగా వచ్చిన కర్ణాటక ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొట్టింది.

ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టడం ప్రారంభించి, గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ ఘటన రైల్వే భద్రతపై అనేక ప్రశ్నలను రేకెత్తించింది. ట్రైన్‌లలో భద్రతా చర్యలు తగిన విధంగా అమలులో లేకపోవడం, ప్రయాణికుల జాగ్రత్తలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలు ఈ దుర్ఘటనకు కారణమై ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రైల్వే శాఖ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరముందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com