జాతీయ బాలికల దినోత్సవం...!
- January 24, 2025
ఆడపిల్ల పుట్టిందంటే తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని పూర్వం భావించేవారు.ఇప్పుడు ఆడపిల్ల పుడితే.. భారంగా భావిస్తున్నారు. భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు.పుట్టిన నిమిషాల్లోనే ఆడ బిడ్డలను అమ్మేస్తున్నారు. చెట్ల పొదల్లో..మురికికాల్వల్లో ఆడ శిశువులు దర్శనమిస్తున్నారు. పుట్టిన క్షణం నుంచే ఆడబిడ్డలకు ఆంక్షలు విధిస్తున్నారు.ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో గతంలో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించింది.
అందులో భాగంగానే కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 2008 నుంచి ప్రతి ఏడాది జనవరి 24న భారత జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్యా, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భాజపా ప్రభుత్వంలో బేటీ బచావో బేటి పడావో పథకాన్ని ప్రవేశపెట్టారు.
2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతీ వెయ్యి మంది పురుషులకు 940 మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు తేలింది. అలాగే 6 సంవత్సరాల లోపు ఆడ పిల్లలైతే ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నట్లు జనాభా లెక్కల్లో వెలుగు చూసింది. అక్షరాస్యత శాతంను చూస్తే మహిళల అక్షరాస్యత శాతం 68.4 శాతంగా ఉంది. బాల్య వివాహాలు భారత్‌లో అధికంగా అవుతున్నాయి. 26.8 శాతం మంది బాలికలకు బలవంతంగా వివాహాలు చేస్తున్నారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 40 శాతం బాల్య వివాహాలు అవుతున్నాయి.
బాలికలు అన్ని రంగాల్లో పైచేయి సాధిస్తున్నా, ఇంకా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కొందరు తల్లిదండ్రులు బాలురను బడికి పంపించి, బాలికలను పనికి పంపిస్తున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఇంకా ఉన్నాయి.ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ దాడుల్లో పనిలో మగ్గుతున్న వారిలో 5 శాతం బాలికలే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. నేషనల్ క్రైమ్ గణాంకాల ప్రకారం పోక్సో చట్టం కింద నమోదవుతున్న నేరాల్లో 99 శాతానికి పైగా బాలికలే బాధితులు ఉంటున్నారు.
పలువురు భారతీయ మహిళలు ప్రపంచ నాయకులుగా విభిన్న రంగాలలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ దేశంలోని చాలామంది మహిళలు, బాలికలు లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య అభిప్రాయాలు, నిబంధనలు, సంప్రదాయాల నుంచి విముక్తి కాలేకపోతున్నారని యునెస్కో స్పష్టం చేసింది. తద్వారా తమ హక్కులను పూర్తిగా అనుభవించలేకపోతున్నారని పేర్కొన్నది.
బాలబాలికల సాధికారతకు సమానంగా మద్దతు ఇస్తే తప్ప భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బాలికల హక్కులను కాపాడటంలో మొదట వారి విద్యను ప్రోత్సహించాలి. జాతీయ విద్యా విధానం-2020లో బాలిక అభివృద్ధికి లింగ సమ్మిళిత నిధి( జెండర్ ఇంక్లూసివ్ ఫండ్)ని ప్రవేశపెట్టింది. ఇది నాణ్యమైన, సమానత్వంతో కూడిన విద్యను అందించడంలో ఎంతో తోడ్పడుతుంది. బాలికా సంక్షేమం నిధులతో ముడిపడి ఉంది. ఇప్పటివరకు వారికోసం పలు పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ అమలుకు నిధుల సమస్య వెంటాడుతోంది.
జాతీయ బాలికా దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం ఓ కొత్త వినూత్న థీమ్‌తో వస్తారు. అలాగే ఈ ఏడాది కూడా "Empowering Girls, Empowering India" అంటూ కొత్త థీమ్‌ని తీసుకువచ్చారు. అందరికీ సమానమై ప్రాథమిక హక్కులు కల్పించడాన్ని ఈరోజు హైలైట్ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బేటీ బచావో బేటీ పఢావో పథకం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో జనవరి 22, 2025 నుంచి.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 మార్చి 8వ తేదీన ఈ కార్యక్రమాలు ముగిస్తారు.
బాలికలకు సరైన విద్య అందించడం ద్వారానే మహిళల పురోభివృద్ధి సాధ్యమవుతుంది. బాలికల విద్యా ప్రమాణాలు ఎక్కడైతే పెరుగుతాయో ఆయా నవ నాగరిక సమాజాల్లో మహిళల హోదా, గౌరవం మెరుగుపడుతుంది. స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాధాన్యత ఇచ్చి వారి భద్రతకు భరోసా ఇవ్వాలి. సమాజంలో బాలికలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. లింగ వివక్ష, విద్యలో అసమానత, పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలు, బాల్య వివాహాల నివారణ, అక్రమ రవాణా మొదలైన అంశాల మీద అవగాహనా కార్యక్రమాలు ఏర్పరచాలి.
సమాజంలో మహిళల పట్ల గౌరవం, హోదా పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలి. వారి సాధారణ జీవితంలో ఎదుర్కొనే రకరకాలైన వివక్షలను, దోపిడీని తొలగించాలి. శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక, రాజకీయ, క్రీడారంగాల్లో కీలకపాత్ర పోషించేలా స్త్రీలకు మరిన్ని అవకాశాలు కల్గించాలి. ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన కోసం బాలికల నైపుణ్యాలను మెరుగుపరచాలి. బాలికలకు సమాజంలో రక్షణ ఉందనే నమ్మకాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వం, పౌర సమాజం తీసుకోవాలి. అందుకే, ఆడపిల్లల ఉన్నతికి సహకరిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలి. అప్పుడే ఆడపిల్లల పట్ల వివక్ష తొలగిపోయి రాజ్యాంగం సూచించిన లింగ సమానత్వం సాధ్యమవుతుంది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







