ఎక్స్పీరియం పార్క్ ప్రారంభం...

- January 28, 2025 , by Maagulf
ఎక్స్పీరియం పార్క్ ప్రారంభం...

హైదరాబాద్: ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈ పార్కును ప్రారంభించారు.ఈ సందర్భంగా చిరంజీవి ఈ పార్క్‌ను అద్భుతమైన కళాఖండంగా అభివర్ణించారు. విశాలమైన విస్తీర్ణంలో ప్రకృతి అందాలను అలరించుకునేలా రూపొందించిన ఈ పార్కు అనేక ప్రత్యేకతలు కలిగి ఉందని చిరు అన్నారు.

పార్క్ సందర్శన సందర్భంగా చిరంజీవి ఆహ్లాదకరమైన అభిప్రాయాలను పంచుకున్నారు. షూటింగ్‌లకు ఈ పార్కును అందుబాటులో ఉంచుతారా అని సరదాగా అడిగారు. దీనికి రాం దేవ్ ఫస్ట్ షూటింగ్ చిరంజీవిదే అయితే అనుమతిస్తానని జవాబిచ్చారని చిరు తెలిపారు. అయితే ఎండల కాలంలో షూటింగ్ కష్టమని, చలికాలంలో ఇక్కడ చిత్రీకరణ చేయడం అనుకూలమైందని , వర్షాకాలంలో ఈ పార్కు మరింత పచ్చదనంతో కళకళలాడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ పార్కు పెళ్లిళ్లు, రిసెప్షన్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్లకు సరిగ్గా సరిపోతుందని చిరంజీవి అన్నారు. ఇటువంటి పార్కులు పర్యావరణానికి మేలు చేస్తాయని, ప్రకృతితో మమేకమయ్యే అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు. కొన్నేళ్లలో ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన ఇంట్లో మొక్కల పెంపకంపై చిరంజీవి వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. 2002 నుండి మొక్కలను పెంచుతానని, రాం దేవ్ అందించే కొత్త మొక్కల గురించి ప్రతిసారి ఆసక్తిగా వినుతుంటానని తెలిపారు. ప్రస్తుతం మొక్కల ధరలు కోటల్లో ఉంటున్నాయని, అవి కొనడం తనకు సాధ్యం కాకపోవచ్చని సరదాగా చెప్పిన చిరంజీవి, రాం దేవ్ చూపిన ప్రేరణకు కృతజ్ఞతలు తెలిపారు.

రాం దేవ్ 24 ఏళ్లుగా ఈ పార్క్‌ను రూపొందించడంలో చేసిన కృషిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. డబ్బులు, ల్యాండ్ ఉండడంతో వ్యాపారంగానే చూడకుండా ప్రకృతిపై ప్రేమతో ఈ కళాఖండాన్ని సృష్టించారని ఆయన ప్రశంసించారు. ప్రకృతి రక్షణకు అంకితమై ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడం మనకు ఒక పాఠమని చిరంజీవి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com