భారత సైనిక దిగ్గజం-ఫీల్డ్ మార్షల్ కె.యం.కరియప్ప

- January 28, 2025 , by Maagulf
భారత సైనిక దిగ్గజం-ఫీల్డ్ మార్షల్ కె.యం.కరియప్ప

ఫీల్డ్ మార్షల్ కె.యం.కరియప్ప... స్వాతంత్ర్య భారత తోలి రోజుల్లో ఈ పేరును సామాన్య ప్రజల నుండి దేశ ప్రధాని వరకు స్మరిస్తూనే ఉండేవారు. భారత దేశ సైనిక శక్తిని అంతర్జాతీయ సమాజానికి తెలిసేలా చేసిన వ్యక్తి ఆయన. దేశ విభజన వల్ల ఏర్పడ్డ మానసిక గాయం మానక ముందే వచ్చి పడిన యుద్ధంలో విజయ దుందుభి మోగించి రణక్షేత్రంలో దేశానికి తిరుగులేదని నిరూపించారు. ఆర్మీ జనరల్‌గా ఉన్న సమయంలో ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యాల్లో ఒకటిగా ఇండియన్ ఆర్మీని తీర్చిదిద్దెందుకు బాటలు పరిచారు. నేడు ఇండియన్ ఆర్మీ మొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కె.యం.కరియప్ప జయంతి.        

కె.యం.కరియప్ప పూర్తి పేరు కొండెదర మాడప్ప కరియప్ప. 1899, జనవరి 28న ఒకప్పటి కూర్గ్ ప్రావిన్స్ లో భాగమైన కొడుగు తాలూకా శనివారసంత గ్రామంలో మాడప్ప, అమ్మయ్య దంపతులకు జన్మించారు. చిన్నతనంలో ఆయన్ని చిమ్మ అని ముద్దుపేరుతో పిలిచేవారు. కరియప్ప కుటుంబం కొడుగు ప్రాంతంలో సంపన్న రైతు కుటుంబాల్లో ఒకటి, పైగా కరియప్ప తండ్రి బ్రిటిష్ రెవెన్యూ శాఖలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసేవారు. కరియప్ప మడకేరీలో స్కూల్ చదువును పూర్తి చేసిన అనంతరం మద్రాస్ ప్రసిడెన్సీ కాలేజీలో చేరారు. 

కాలేజీలో ఉన్న సమయంలోనే బ్రిటిష్ ఆర్మీ నిర్వహిస్తున్న కమిషన్డ్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడం జరిగింది. అందులో పాల్గొన్న 70 మందిలో 42 మంది ఎంపిక అవ్వగా అందులో కరియప్ప ఒకరు. అనంతరం ఇండోర్ పట్టణంలోని డేలీ క్యాడెట్ కాలేజీలో చేరారు. అక్కడ నిర్వహించిన అన్ని పరీక్షల్లో ప్రథమ శ్రేణి  ఉత్తీర్ణత సాధించి 88th Carnatic Infantry (2nd Battalion)లో చేరారు. అక్కడ నుంచి 2/125 Napier Riflesకు బదిలీ చేయబడ్డారు. Napier Rifles తరపున మెసొపొటేమియా(నేటి ఇరాన్ దేశం)లో రెండేళ్లు పనిచేశారు. ఆ తర్వాత ఆఫ్గనిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న 37th (Prince of Wales's Own) Dogras Regimentలో లెఫ్టనెంట్ అయ్యారు. 

1923లో కాబుల్ కేంద్రంగా 1/7 Rajputs Regimentకి బదిలీ చేయబడ్డారు. ఈ Regimentలోనే ఆయన చివరి వరకు ఉన్నారు. 1925లో బ్రిటిష్ ఆర్మీ తరపున 
ప్రపంచ పర్యటనకు ఎంపికైన కరియప్ప అమెరికా, జపాన్, చైనా మరియు పలు యూరోప్ దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశాల్లో అమలు చేస్తున్న సైనిక శిక్షణ పద్ధతులు, రక్షణ చట్టాలు గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ పర్యటనలో ఆ దేశాలకు చెందిన ఆర్మీ అధికారులు, సైనికులు మరియు సామాన్య ప్రజలతో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. 

1927లోనే ఆర్మీలో కెప్టెన్‌గా పదోన్నతి పొందినప్పటికి 1931 వరకు అధికారికంగా ఆయనకు పదోన్నతి సౌకర్యాలు లభించలేదు.1931లో వాయువ్య భారత దేశంలోని పెషావర్ జిల్లా (ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో భాగం)deputy assistant quarter master general (DAQMG)గా నియమితులయ్యారు. 1932లో ఉన్నత ఆర్మీ శిక్షణ కోసం లండన్ వెళ్లి అక్కడ ప్రతిష్టాత్మక క్వెట్టా ఆర్మీ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేశారు.ఈ శిక్షణ పూర్తి చేసిన తోలి భారతీయుడిగా కరియప్ప చరిత్రలో నిలిచిపోయారు.1936లో డెక్కన్ ప్రాంత కెప్టెన్‌గా పదోన్నతి పొందారు. 

1938లో ఆర్మీ మేజర్‌గా పదోన్నతి పొందారు.రెండో ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత 1939-42 వరకు ఆర్మీ బ్రిగేడ్ మేజర్‌గా మధ్య ఆసియా దేశాలతో  పాటుగా బర్మాలో సేవలందించారు. 1945లో యుద్ధం ముగిసేనాటికి ఆర్మీలో బ్రిగేడియర్ అయ్యారు. వాయువ్య భారతంలోని వజీరిస్థాన్ కేంద్రంగా ఉన్న బన్ను సరిహద్దు దళానికి నాయకత్వం వహించారు. అక్కడ స్థానిక తెగల ఆగడాలను నియంత్రించడంలో కరియప్ప విజయం సాధించారు. 1947లో ఇంగ్లాండ్‌లోని కేంబర్లి పట్టణంలో ఉన్న ఇంపీరియల్ డిఫెన్స్ కాలేజీలో సైనిక అధికారుల ఉన్నత శిక్షణ కోసం ఎంపికైన ఇద్దరు భారతీయ అధికారుల్లో కరియప్ప ఒకరు. 

భారతదేశం విభజన అనివార్యమైన తరుణంలో ఆర్మీ ఆస్తులు, సైనిక రెజిమెంట్ల పంపకంలో కరియప్ప కీలకంగా వ్యవహరించారు. మెజారిటీ ఆర్మీ ఆస్తులు మన దేశానికి దక్కేలా చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఇదే సమయంలో మేజర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. బ్రిటిష్ ఆర్మీలో ఈ హోదా ఇద్దరు వ్యక్తుల్లో వీరు ఒకరు కాగా, మరొకరు జామ్‌నగర్ మహారాజు రాజేంద్ర సింగ్‌జీ జడేజా ( స్వతంత్ర భారత దేశ తోలి ఆర్మీ చీఫ్ జనరల్). 

దేశ విభజన జరిగిన తర్వాత కరియప్ప డెప్యూటీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ హోదాలో కరియప్ప నియమితులయ్యారు. ఇదే సమయంలో 1947లో నూతనంగా ఏర్పడ్డ పాకిస్తాన్ దేశ ఆర్మీ ఆటవిక తెగల ముసుగులో కాశ్మీర్ మీద దాడి చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్న తరుణంలోనే అప్పటి దేశ హోం మంత్రి సర్దార్ పటేల్ ఆదేశాల మేరకు యుద్ధ రంగంలోకి దిగి పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి కాశ్మీర్ రాష్ట్రాన్ని ముఖ్యంగా లడఖ్ ప్రాంతాన్ని ఇండియా కోల్పోకుండా చేయడంలో కరియప్ప పాత్ర మరువలేనిది. ఈ యుద్ధ విజయం ద్వారా భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటారు. 

భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించిన చివరి బ్రిటిష్ సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి 1949, జనవరి 15వ తేదీన కమాండర్-ఇన్-చీఫ్‌గా కరియప్ప బాధ్యతలు చేపట్టారు. ఈ రోజును పురస్కరించుకొని జనవరి 15న ప్రతి సంవత్సరం ‘జాతీయ సైనిక దినోత్సవం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన సైన్యాన్ని శక్తివంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సైన్యంలో టెరిటోరియల్ ఆర్మీని ఆయన హయాంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదమైన "జైహింద్"ను భారత సైన్యం యొక్క అధికారిక నినాదాల్లో ఒకటిగా చేర్చిన ఘనత సైతం ఆయనకే దక్కుతుంది. నాలుగేళ్ళ పాటు కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన కరియప్ప 1953, జనవరి14న పదవి విరమణ పొందారు.

సైన్యం నుంచి విరమణ పొందిన తరవాత 1953లోనే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలకు భారత విదేశాంగ హై కమిషనర్‌గా నియమించింది. 1956లో ఆ బాధ్యతల నుంచి విరమణ పొందిన తర్వాత మాజీ సైనికుల సంక్షేమం కోసం కృషి చేశారు. సైన్యంలో పనిచేసి చిన్నవయస్సులోనే రిటైర్ అయ్యే వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఇవ్వాలని భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన కృషి ఫలితంగానే మాజీ సైనికులకు ప్రభుత్వం రావాల్సిన ప్రయోజనాలు తొందరగా రావడం మొదలు అయ్యాయి. 

కరియప్ప నిర్భీతికి, ధైర్య సాహసాలకు మారు పేరు. కెరీర్ తొలిరోజుల్లోనే ఆఫ్గనిస్థాన్ లాంటి యుద్ధ తెగలు ఉన్న ప్రదేశంలో పనిచేయడం ద్వారా అక్కడి యుద్ధ విద్యల్లో రాటుదేలారు. ముఖ్యంగా గొరిల్లా యుద్ధ విద్యలో కరియప్ప నైపుణ్యవంతుడైన యోధుడు. బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే భారతీయ అధికారులకు సకాలంలో రావాల్సిన పదోన్నతలను నిలుపుదల చేయడం భారతీయుల పట్ల వివక్షకు తార్కాణం అని మీద బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ముందు ధైర్యంగా తన వాదన వినిపించారు. వాయువ్య భారతంలో పఠాన్ జాతి యోధులను అదుపులో తేవడానికి ఆర్మీ అధికారులు భయపడుతున్న రోజుల్లో వారితో స్నేహంగా మెలిగి వారిని చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. 


ఆయన ఎంతటి నియమబద్ధుడైన దేశ సైనికుడో అన్నది తెలిపే ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటన : 

కరియప్ప కుమారుడు కె.సి.నందా కరియప్ప 1965 ఇండో-పాక్ యుద్ధం నాటికి భారత వైమానిక దళంలో (ఎయిర్‌ఫోర్స్) పనిచేస్తూ ఉండేవారు. పాకిస్తాన్‌పై వైమానిక దాడులు చేస్తూండగా కాల్పుల్లో ఆయన విమానం పాక్ భూభాగంలో పడిపోయింది. ఆయన్ను బయటకు తీసి యుద్ధ ఖైదీగా బంధిస్తూ పేరేమిటో  కనుక్కున్నారు. పాకిస్తాన్ రేడియో ప్రసారాల్లో ఫలానా నందా కరియప్ప యుద్ధ ఖైదీగా దొరికాడని అప్పటి పాక్ అధ్యక్షుడు మరియు ఆ దేశ సైనిక నియంతగా ఉన్న ఆయూబ్ ఖాన్ విన్నాడు. బ్రిటీష్‌ ఇండియా సైన్యంలో భావి భారత పాకిస్తాన్ సైన్యాధికారులందరూ కలిసి పనిచేస్తున్న రోజుల్లో కె.ఎం.కరియప్ప కమాండ్‌లో ఆయన సబార్డినేట్‌గా ఆయూబ్ ఖాన్ పనిచేసేవాడు.

తన పాత బాస్ పట్ల ఎంతో గౌరవాభిమానాలు కలిగిన ఆయూబ్ ఖాన్ ఆయన కుమారుడిని చాలా మర్యాదగా చూడమని ఆదేశించి, వెంటనే మడికేరి (కర్ణాటక)లో విశ్రాంత జీవితం గడుపుతున్న కరియప్పకు స్వయంగా ఫోన్ చేశాడు. కరియప్ప కుమారుడికి ఏ అపాయమూ లేదని చెప్పాడు. యుద్ధ ఖైదీగా ఉన్న అతనిని తక్షణమూ విడుదల చేసే ఏర్పాట్లు చేస్తానని ఆఫర్ చేశాడు. కరియప్ప అతనిని ప్రత్యేకించి విడుదల చేయవద్దన్నారు. తోటి యుద్ధ ఖైదీలకు ఇచ్చే ట్రీట్‌మెంటే అతనికీ ఇమ్మని కోరారు. తన కుమారుడితో పాటుగా మిగిలిన వారందరినీ కూడా మెరుగ్గా చూడమని సూచించారు. 

"అతను ఇప్పుడు నా కొడుకు కాదు.భారత దేశపు బిడ్డ, తన మాతృభూమి కోసం పోరాడుతున్న నిజమైన దేశభక్తుడు. నీ అభిమానానికి చాలా ధన్యవాదాలు, కానీ ఒక్కటే కోరుతున్నాను - వీలైతే అందరినీ విడుదల చెయ్యి, లేదంటే ఎవరినీ వద్దు. అతనికి ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ చెయ్యకు అన్నారు". కన్న కొడుకు పట్ల ప్రేమాభిమానాలను కూడా పక్కన పెట్టి ఇలా మాట్లాడాలంటే ఆ మనిషికి ఎంతటి కర్తవ్య నిష్ట, ధర్మ నిరతి, ఆత్మగౌరవం ఉండాలి.ఈ విధంగా ఆయన సర్వీసులో ఉన్నత స్థాయిలో పనిచేయడమే కాకుండా రిటైర్ అయ్యాకా కూడా ఆర్మీ గౌరవాన్ని ఉన్నతంగా నిలబెట్టిన వ్యక్తి కరియప్ప.

సైన్యంలో సుదీర్ఘ కాలం సేవలందించిన ఆయన పలు ప్రతిష్టాత్మక పతకాలను అందుకున్నారు.1986లో భారత రాష్ట్రపతి చేతుల మీదగా ఫీల్డ్ మార్షల్ హోదాను అందుకున్నారు.ఈ హోదాను అందుకున్న ఇద్దరు భారత సైనికాధికారుల్లో కరియప్ప ఒకరు. చివరి రోజుల్లో తన స్వస్థలంలోనే వ్యవసాయ చేస్తూ గడిపిన ఆయన 94 ఏళ్ల వయసులో 1993 మే 15 న బెంగళూరులోని కమాండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com