CCL2025: బోణీ కొట్టిన తెలుగు వారియ‌ర్స్‌..

- February 15, 2025 , by Maagulf
CCL2025: బోణీ కొట్టిన తెలుగు వారియ‌ర్స్‌..

హైదరాబాద్: సెల‌బ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ )2025 సీజ‌న్‌లో తెలుగు వారియ‌ర్స్ బోణీ కొట్టింది. శ‌నివారం ఉప్ప‌ల్ వేదిక‌గా భోజ్‌పురి ద‌బాంగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో విజ‌యాన్ని అందుకుంది. అక్కినేని అఖిల్ నేతృత్వంలో బ‌రిలోకి దిగిన‌ తెలుగు వారియర్స్ ఏడు ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

సీసీఎల్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తున్నారు. అయితే.. ప్ర‌తి జ‌ట్టు 10 ఓవ‌ర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. రెండు ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక స్కోరు చేసిన జ‌ట్టును విజేత‌గా నిలుస్తుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తెలుగు వారియ‌ర్స్ కెప్టెన్ అఖిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన తెలుగు వారియ‌ర్స్‌ నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 80 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆద‌ర్శ్‌, స‌చిన్‌, అశ్విన్ బాబులు డ‌కౌట్లు అయ్యారు. అఖిల్ (41), సాంబ (18) లు రాణించారు. భోజ్‌పురి బౌల‌ర్లో మ‌నోజ్ తివారి, మ‌న్మోహ‌న్‌, ఆదిత్య‌లు త‌లా రెండు వికెట్లు తీశారు. అనంత‌రం భోజ్‌పురి దబాంగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. దీంతో 46 ప‌రుగుల ఆధిక్యం భోజ్‌పురికి ల‌భించింది. భోజ్‌పురి బ్యాట‌ర్ల‌లో ఆదిత్య (61 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీ బాదాడు. అన్షుమన్ (42) రాణించాడు. తెలుగు వారియ‌ర్స్ బౌల‌ర్ల‌లో స‌చిన్ 4 వికెట్లు తీశాడు.

అనంత‌రం రెండో ఇన్నింగ్స్ లో తెలుగు వారియ‌ర్స్ బ్యాట‌ర్లు రాణించారు. నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 132 ప‌రుగులు చేశారు. తెలుగు వారియ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో అశ్విన్ బాబు (36), త‌మ‌న్ (21), అఖిల్ (22), సాంబ (26)లు రాణించారు. భోజ్‌పురి బౌల‌ర్ల‌లో ఖాన్ రెండు వికెట్లు తీశాడు. మ‌నోజ్‌, ఆదిత్య‌, మ‌న్మోహ‌న్‌లు త‌లా ఓవికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన‌ 46 ప‌రుగుల ఆధిక్యం తీసి వేస్తే భోజ్‌పురి ముందు 87 ప‌రుగుల ల‌క్ష్యం మాత్ర‌మే నిలిచింది. అయితే.. తెలుగు వారియ‌ర్స్ బౌల‌ర్లు అద్భుతంగా రాణించ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో భోజ్‌పురి జ‌ట్టు 9.5 ఓవ‌ర్ల‌లో 79 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో తెలుగు వారియ‌ర్స్ జ‌ట్టు ఏడు ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. తెలుగు వారియ‌ర్స్ బౌల‌ర్లో స‌చిన్ మూడు, సాంబ రెండు వికెట్లు తీశారు.

ఈ విజ‌యంతో తెలుగు వారియ‌ర్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన తెలుగు వారియ‌ర్స్ ఓ మ్యాచ్‌లో గెలిచి మ‌రో మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్ర‌స్తుతం తెలుగు వారియ‌ర్స్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. అటు భోజ్‌పురి ద‌బాంగ్స్ ఖాతాలో రెండు పాయింట్లే ఉన్న‌ప్ప‌టికి మెరుగైన ర‌న్‌రేట్ కార‌ణంగా మూడో స్థానంలో కొన‌సాగుతోంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన క‌ర్ణాట‌క బుల్డోజ‌ర్స్‌, బెంగాల్ టైగ‌ర్స్ జ‌ట్లు వ‌రుస‌గా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com