ప్రజల మనిష -బొమ్మగాని ధర్మబిక్షం
- February 15, 2025
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఆర్యసమాజ్ సారథి, కార్మిక సంఘాల నేత, కమ్యూనిస్టు, జర్నలిస్ట్, హాకీ టీమ్ కెప్టెన్, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజా జీవితమే పరమార్థంగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆదర్శ నాయకుడు.. ఇన్ని లక్షణాలు కలబోసిన వ్యక్తి భిక్షం. ఒక చేత్తో దానం తీసుకుంటూ మరో చేత్తో ధర్మం చేస్తున్న భిక్షం పేరు ధర్మభిక్షం అని హైదరాబాద్ కొత్వాల్ రాజ్ బహద్దూర్ వెంకటరామారెడ్డి ప్రశంసించారు. నాటి నుంచి ధర్మభిక్షంగా ప్రాముఖ్యత సంతరించుకున్నారు. నేడు ప్రముఖ కార్మిక నాయకుడు బొమ్మగాని ధర్మబిక్షం జయంతి.
బొమ్మగాని ధర్మబిక్షం 1922,ఫిబ్రవరి 15న నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యంలో భాగమైన మునుగోడు తాలూకా వూకొండి గ్రామంలో మధ్యతరగతి గీత కార్మికుల కుటుంబానికి చెందిన బొమ్మగాని ముత్తి లింగయ్య, గోపమ్మ దంపతులకు జన్మించారు. విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాలకు పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాటానికి తన సహ విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. ఆంధ్రమహాసభతో మమేకమయ్యారు.
1946లో హాస్టల్ వార్షికోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి హైదరాబాద్ కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కొత్వాల్ అప్పటికే సూర్యాపేట హాస్టల్ కార్యక్రమాలను గురించి విని ఉండడం వల్ల అక్కడికి రావడానికి అంగీకరించాడు. హాస్టల్‌ను చూసి, హాస్టల్ నిర్వహణ తీరుతెన్నులను గురించి తెలుసుకుని వెంకటరామిరెడ్డి ఎంతో సంతోషించాడు. సభలో భిక్షంను ప్రశంసిస్తూ ‘ఏక్ హాత్ సే భిక్షామాంగ్కర్ దూస్రే హాత్ సే దాన్ కర్నేవాలా భిక్షం నహీ... ధర్మభిక్షం’ అన్నాడు. ఆనాటి నుండి భిక్షం, ధర్మభిక్షంగా పేరు గడించాడు. సేవాదృక్పథంతో ప్రజాసేవకు జీవితం అంకితం చేశారు.
క్రమంగా సూర్యాపేట హాస్టల్ రాజకీయ కేంద్రంగా మారింది. భువనగిరి మరియు హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభలకు హాజరైన సూర్యాపేట విద్యార్థులు ఖమ్మంలో జరిగిన 12వ మహాసభకు ధర్మభిక్షం నాయకత్వంలో పాదయాత్రతో బయల్దేరారు. గ్రామ గ్రామాన పాటలు పాడుతూ, ఆంధ్రమహాసభ గురించి వివరిస్తూ 40 మైళ్ళు ప్రయాణం చేసి ఖమ్మం చేరారు. మహాసభ రాజకీయవేదికగా మారింది. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు ‘సంఘం’, లేదా ‘సంగం’గా పిలిచేవారు. ధర్మభిక్షం కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
నైజాం నవాబు ఏలుబడిలో రాజ్యమేలుతున్న అన్యాయాన్ని, అరాచకాలను, శ్రమదోపిడిని, బానిసత్వాన్ని ఆయన గమనించారు, సమస్యకు మూలం ఎక్కడుందో ఆలోచించి నిరక్ష్యరాస్యత, భయం, అనైక్యత కారణంగానే ప్రజలు దోపిడీకి గురవుతున్నారని అర్థం చేసుకున్న ధర్మబిక్షం, పరిష్కారంగా రెండు మార్గాలను ఎంచుకున్నారు. ఒకవైపు సన్న, చిన్నకారు రైతాంగానికి, కూలీలకు మరియు వయోజనులకు మోట బావుల కాడ రాత్రివేళల్లో లాంతరు వెలుగులో చదువు చెప్పేవారు. వాళ్ళ జీవితాలు అలా మ్రగ్గిపోవటానికి కారణమైన నిజాం రాజరిక వ్యవస్థకు, రజాకారులకు వ్యతిరేకంగా నిలబడాలనీ, తిరగబడాలనే ధైర్యాన్ని నూరిపోసేవారు.
ఇదే సమయంలో గోల్కొండ పత్రిక, ఆంధ్రపత్రిక, విజ్ఞాన్, ఉర్దూ పత్రికలకు విలేకరిగా పనిచేశారు. నిజాంపై సాయుధపోరాటం మొదలు కావడంతో తుపాకి చేతబట్టి కదనరంగంలో అడుగు పెట్టారు. అరెస్టయి ఔరంగాబాద్ మరియు జల్నా జైళ్లలో ఐదేండ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. జల్నా జైలులో పదివేల మంది ఖైదీలతో సమ్మె చేయించిన ఘనత ఆయనదే. ధర్మభిక్షం నల్లగొండ జిల్లాలో అనేక రంగాలలో పనిచేస్తున్న కార్మికులను, మహిళలను, రైతులను, విద్యార్ధి, యువజన మేధావులను చేరదీశారు.
1952లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి సిపిఐ తరపున హైదరాబాద్ అసెంబ్లీకి అత్యధిక మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1957లో నకిరేకల్, 1962లో నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. నల్లగొండ లోకసభ నియోజకవర్గం నుంచి 1991లో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు నల్లగొండ నుంచి 480 మంది ఫ్లోరైడ్ బాధితులు పోటీ చేసినప్పటికీ ఆయన 76 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం విశేషం.
ప్రజాప్రతినిధిగా ధర్మభిక్షం అటు పార్లమెంటులోను, ఇటు అసెంబ్లీలోను, పేద ప్రజల పక్షాన తన గొంతుకను వినిపించారు. కార్మిక, శ్రామిక, మహిళ, విద్యార్థి, యువజన, రైతు సమస్యల మీద, సాగునీరు, త్రాగునీరు అవసరాలపైనా చట్ట సభలలో తెలుగు, ఉర్దూ మరియు ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడిన ప్రజల మనిషి ధర్మబిక్షం. నేత, మత్స్య, రజక, కమ్మరి, కుమ్మరి, తదితర వృత్తులకు సంబంధించిన ప్రజల అభివృద్ధికి కూడా ఆయన ఎంతో కృషి చేశాడు.
గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన పోరాడారు. దున్నే వానికే భూమి నినాదంతో పాటు, ‘గీసేవానికే చెట్టు’ నినాదంతో చెట్టు పుట్టా తిరిగి కల్లు మండువల కాడ పోరాట ప్రణాళికలను చెక్కిన చైతన్యమూర్తి ధర్మబిక్షం. నల్లని మేఘాలు కమ్ముకున్న వాతావరణంలో, చుట్టూత పోలీసుల తుపాకీ మోతలు, లాఠీచార్జీలు, నోల్లు తెరచిన జైళ్లు భయపెడుతూ వెంబడిస్తున్న అననుకూల వాతావరణంలో కూడ గీత కార్మికుల గుండెల్లో ధైర్యం నింపి, లక్షలాది గీత కార్మికుల నొసట ‘కొత్తగీత’ గీసిన భీష్మాచార్యుడు ధర్మబిక్షం.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ కల్లు గీత వృత్తిని పరిశ్రమగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో గీత పనివారల సంఘానికి జెండా రూపొందించారు. మధ్యలో తాటి చెట్టు, దాని చుట్టూ ఎరుపువర్ణంలో పారిశ్రామిక చక్రం (గీతవృత్తిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న సంకేతం), మిగతాఅంతా నీలివర్ణంతో రూపొందిన ఈ జెండాతో ధర్మబిక్షం లక్షలాది గీత పనివారల గుండె జెండా అయ్యారు. గీత వృత్తి వున్నంత కాలం ఈ జెండా రెపరెపల్లో ధర్మ బిక్షం దర్శనమిస్తారు.
కల్లుదుకాణాల కేటాయింపులో హర్రాజు విధానాన్నీ, కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేయించి, సహకార సంఘాల ద్వారా కల్లు దుకాణాల నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టించారు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడి, చనిపోయిన గీతకార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోసం గీత పనివారల సంఘం ద్వారా ఉద్యమించారు. రాష్ట్ర గీత పనివారల సంఘానికీ, జాతీయస్థాయి సమాఖ్యకూ నాయకత్వం వహించి హక్కుల సాధనకోసం పోరాడారు. ఆయన పోరాటాల ఫలితంగానే గీత వృత్తిలో పురోభివృద్ధి జరిగి, గౌడ కులం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కొంతైన మెరుగుపడిన మాట నిజం.
సోవియట్ యూనియన్, వియత్నాం, చైనా, క్యూబా, లాటిన్ అమెరికా దేశాల్లోని విప్లవాల గురించి, ప్రజా చైతన్యం గురించి ధర్మబిక్షం చెప్పేవారు. ఈ దేశంలో నెలకొనాల్సిన విప్లవ పరిస్థితులు, ప్రజా జీవితాల్లో రావాల్సిన మార్పుల గురించి నిర్మాణాత్మక ప్రసంగాలు చేసేవారు. ఆయన దృష్టంతా విద్యార్ధులు, యువకులను చైతన్యం చేయటంపైననే ఉండేది. 90వ దశకం ఆరంభంలోనే సోవియట్ యూనియన్ కుప్పకూలినప్పుడు కమ్యూనిస్టు క్యాడర్‌కు, యువతకు, ఆయన పోరాట స్ఫూర్తిని, లక్ష్యం పట్ల నమ్మకాన్ని నూరిపోశారు.
సోవియట్ యూనియన్ పతనానంతరం, 1996లో కేంద్రంలో ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో సిపిఐ చేరడంతో ఆ పార్టీ నుంచి
సెంట్రల్ హోం మినిష్టర్‌గా కామ్రేడ్ ఇంద్రజిత్ గుప్తా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా చతురానన్ మిశ్రా ఉన్న కాలంలోనే వారి ద్వారా అత్యధిక నిధులను తీసుకొచ్చి నల్గొండ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారు. 1991 నుండి అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలు, సరళీకరణ విధానాలు, ఈ ప్రపంచీకరణా ప్రయివేటీకరణలూ ప్రజలను మరింత అధోగతి పాల్జేస్తాయని హెచ్చరించేవారు. వీటికి వ్యతిరేకంగా బలమైన ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం వున్నదని నాయకులతో, పార్టీ పార్టీయేతర శ్రేణులతో మేధావులతో చెప్పేవారు.
చట్టసభల్లో సుదీర్ఘకాలం కొనసాగిన ధర్మభిక్షం చివరి వరకు సాదాసీదా జీవితాన్నే గడిపారు. పరిచయమైన ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలుకరిస్తూ, ఒక కుటుంబ పెద్దలాగా వారి కష్టసుఖాలు తెలుసుకునేవారు. మానవ సంబంధాలకు విలువనిచ్చేవాడు. నిగర్వి, నిజాయితీకి నిలువెత్తు రూపం. తెల్లని శరీరఛాయకు తగినట్లు తెల్లని వస్త్రధారణం. సామాజిక న్యాయ సాధన అతని ఆశయం. అంతరాలు లేని సమసమాజ నిర్మాణం ఆయన అంతిమ లక్ష్యం.
కమ్యూనిస్టు భావజాలాన్ని అణచివేస్తామని గర్జించిన వారు సైతం, ధర్మబిక్షం దేశభక్తి, నిజాయితీ, త్యాగం, విలువలు, పోరాట పటిమ, శాస్త్రీయ దృక్పథం చూసి కమ్యూనిస్టులంటే ఇలా ఉండాలని చెప్పుకునే విధంగా జీవించి, ఆ జీవితాన్ని సమాజానికి పంచిపెట్టిన వ్యక్తి ధర్మబిక్షం. 89 సంవత్సరాల పరిపూర్ణమైన ఆదర్శ జీవితం గడిపిన ప్రజల మనిషి బొమ్మగాని ధర్మభిక్షం 2011 మార్చి 26వ తేదీన కన్నుమూశారు. బంధుప్రీతికీ, ఆశ్రితజనపక్షపాతానికీ, అవినీతికీ, ఆస్తుల సంపాదనకు తాపత్రయపడని శ్రామిక ప్రజల నాయకుడు ధర్మభిక్షం జీవితం నేటి తరానికి, రానున్న తరాలకి స్ఫూర్తిదాయకం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!







