దుబాయ్ లోని జుమేర లో బంగారం దొంగలించిన ఫిలిప్పీన్స్ మహిళ

- July 03, 2016 , by Maagulf
దుబాయ్ లోని జుమేర లో బంగారం దొంగలించిన ఫిలిప్పీన్స్ మహిళ

64 కళల్లో చోర కళ కూడా ఒకటి. దొంగతనం చేయడంలో కూడా ఎంతో నేర్పు, మరెంతో నైపుణ్యం ఉండాలి. లేదంటే కటకటాల పాలవడం ఖాయం. తనకు ఆ కళలో బోల్డంత నైపుణ్యం ఉందని చాటిందో పనిమనిషి. పనిచేస్తున్న ఇంట్లోనే ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా బంగారు ఆభరణాలను వారి కళ్లముందే ఎత్తుకెళ్లింది. ఆభరణాలు పోతుండడం, ఇంట్లోకి వేరే వ్యక్తులెవరూ రాకపోవడంతో పనిమనిషిపైనే అనుమానం వచ్చిన యజమాని వలవేసి పట్టుకుంది. బంగారు ఆభరణాలను ఇంటి నుంచి తరలించిన వైనం విని ఆశ్చర్యపోయింది. దుబాయ్‌లోని జుమీరా ప్రాంతంలోని ఓ ఇంట్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళ(29) పనిమనిషిగా చేస్తోంది. ఇటీవల ఇంట్లోని నగలు, డబ్బు మాయమవుతుండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనుమానిత వ్యక్తులెవరూ ఇంటికి రాకపోవడంతో అవి ఎలా పోతున్నదీ వారికి అర్థం కాలేదు. చివరికి పనిమనిషిపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను పరీక్షించేందుకు బెడ్‌రూంలో నగలు పెట్టారు. అవి కూడా మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. సబ్బును రెండు ముక్కలు చేసి లోపలి సబ్బును తీసేసి గుల్లగా మార్చి అందులో దొంగిలించిన నగలు పెట్టి తిరిగి రెండింటిని కలిపేస్తున్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఆ సబ్బును చేత్తో పట్టుకుని యజమానుల ముందునుంచే బయటకు వెళ్లిపోయేదానిని పోలీసులకు చెప్పింది. ఆమె నైపుణ్యాన్ని విని వారు సైతం అవాక్కయ్యారు. నగలతోపాటు డబ్బులు కూడా దొంగిలించానని, మరొకరి సాయంతో వాటిని తన ఇంటికి పంపించేదానినని పేర్కొంది. ఆమె ఇచ్చిన సమాచారంతో డబ్బు పంపిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనిమనిషిని దోషిగా నిర్ధారించిన కోర్టు తుది తీర్పును ఈనెల 9కి వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com