రాజకీయ సవ్యసాచి-దామచర్ల సత్య
- March 05, 2025
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎందరో హేమహేమీలు రాష్ట్ర మరియు జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయా కుటుంబాల వారసులు ప్రస్తుతం వివిధ పార్టీల తరుపున క్రియాశీలకంగా జిల్లా రాజకీయాల్లో వ్యవహరిస్తూ వస్తున్నారు. వారిలో ముఖ్యంగా దామచర్ల కుటుంబం ఒకటి. తెదేపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ఈ కుటుంబానికి చెందిన రాజకీయ మూలపురుషుడు దివంగత దామచర్ల ఆంజనేయులు మంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాను ఏంతో అభివృద్ధి చేశారు. జిల్లా రాజకీయాల్లో పెద్దాయనగా సుపరిచితులు. తర్వాత కాలంలో అదే కుటుంబానికి చెందిన దామచర్ల జనార్దన్ సైతం జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఒంగోలు నుంచి రెండు సార్లు ఎమ్యెల్యే అయ్యారు. తాత ఆంజనేయులు రాజకీయ వారసుడిగా వచ్చిన దామచర్ల సత్య సైతం కొండపి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి అక్కడ పార్టీకి హ్యాట్రిక్ విజయాలను అందించారు. నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య జన్మదినం. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం...
సత్యగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితులైన దామచర్ల సత్యనారాయణ 1983, మర్చి 5వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెం గ్రామానికి చెందిన దామచర్ల పూర్ణచంద్రరావు దంపతులకు జన్మించారు. తండ్రి పూర్ణచంద్రరావు కుటుంబ వ్యాపారాలతో పాటు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించేవారు. సత్య తన ప్రాథమిక విద్యను గుడివాడ విశ్వభారతి స్కూల్లో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ విజయవాడ దగ్గరలోని గూడవల్లిలోని గౌతమ్ కాలేజీలో, వైజాగ్ గీతం ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కంప్యూటర్ సైన్సులో బీటెక్, అనంతరం ఆస్ట్రేలియా వెళ్లి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత తమ కుటుంబానికి చెందిన వ్యాపారాల్లో భాగమయ్యారు.
సత్య తాతగారైన రైతు బాంధవుడు ,పేదల పెన్నిధి దివంగత దామచర్ల ఆంజనేయులు తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించి జిల్లాలో పార్టీని బలోపేతం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, మంత్రిగా జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. సత్య తండ్రి పూర్ణచంద్రరావు సైతం ఆంజనేయులు గారు మంత్రిగా ఉన్న సమయంలో కొండపి నియోజకవర్గంలో తెదేపా పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు.
తాత, తండ్రి గార్ల ప్రభావం చిన్నతనం నుంచే సత్యపై ఉండేది. వారిద్దరూ రాత్రి, పగలు అనేది లేకుండా కొండపి నియోజకవర్గ ప్రజల అభ్యన్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తీరుతో స్ఫూర్తి పొందిన సత్య రాజకీయాల పట్ల చిన్నతనంలోనే మక్కువ పెంచుకున్నారు. సత్య కంటే ముందు ఆయన పెదనాన్న కుమారుడైన దామచర్ల జనార్దన్ రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పూనర్విభజనలో భాగంగా కొండపిని రిజర్వ్‌డ్ స్థానం కావడంతో జనార్దన్ ఒంగోలు నియోజకవర్గానికి మారడంతో కొండపి నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా పూర్ణచంద్రావు గారు పార్టీని నడిపించారు. ఈ సమయంలో ఒకవైపు వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూనే నియోజకవర్గ వ్యవహారాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా సత్య నిలుస్తూ వచ్చారు.
2013లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో నియోజకవర్గంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా తెదేపా అత్యధిక పంచాయితీలను కైవసం చేసుకోవడంలో సత్య తనవంతు పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో నవ్యంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొండపిలో తెదేపా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సత్య తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారిని గెలిపించే బాధ్యతను తన భుజానవేసుకొని, ప్రచార కార్యక్రమాల్లో అన్నితానై వ్యవహరించి స్వామి గారు మంచి మెజారిటీతో గెలవడంలో ముఖ్యపాత్ర వహించారు.
కొండపిలో డాక్టర్ స్వామి విజయంలో సత్య పాత్రను గుర్తించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్‌లు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకాశం జిల్లా స్మార్ట్ సిటీ లీడ్ పార్ట్‌నర్‌గా నియమించారు. 2014-19 వరకు ఎమ్యెల్యే డాక్టర్ స్వామితో చక్కగా సమన్వయం చేసుకుంటూ కొండపి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు సత్య. నియోజకవర్గం అంతటా సీసీ రోడ్లు, త్రాగు, సాగు నీటి వనరుల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నిటిని ప్రజలకు అందగలిగేలా చేయడంలో కృషి చేశారు.
2019 ఎన్నికల్లో సైతం సత్య, స్వామిల జోడి కారణంగా కొండపిలో తెదేపాకు వరసగా రెండో విజయం లభించింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ అధినేత జగన్ సునామీ వీచినా కొండపిలో మాత్రం డాక్టర్ స్వామి విజయం సాధించారు. ఈ విజయం తర్వాత సత్య జిల్లా రాజకీయాల్లో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా పార్టీ యువనేత నారా లోకేష్ సైతం సత్యను తన రాజకీయ టీంలో సభ్యుడిగా చేర్చుకొని ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించారు. ఇదే సమయంలో సత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ ఏడాది ప్రకాశం జిల్లాలో జరిగిన అమరావతి రైతుల పాదయాత్ర సందర్బంలో క్రియాశీలకంగా పాల్గొని వారికి సంఘీభావంగా వారితో కలిసి నడిచారు
పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకుడిగా బాధ్యతలు చేపట్టిన సత్య ఆ నియోజకవర్గంలో వరుస ఓటములతో ఢీలా పడ్డ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ, వారి సమస్యలను పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా వాటిని పరిష్కరింపజేశారు. అలాగే, 2022లో కరోనా మహమ్మారి తర్వాత ఒంగోలులో జరిగిన తెదేపా మహానాడును విజయవంతం చేయడంలో సత్య పాత్ర చాలా కీలకం. మహానాడుకు నాటి వైకాపా ప్రభుత్వం విధించిన ఆంక్షలను సైతం అధిగమించి మహానాడును దిగ్విజయంగా జరిపించేందుకు సత్య తెరవెనుక ఎంతో కృషి చేశారు.
2023లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా భాగమైన ఉత్తర రాయలసీమ ఎమ్యెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కందుకూరు నియోజకవర్గానికి చెందిన కంచర్ల శ్రీకాంత్ గెలుపులో సత్య కీలకంగా కృషి చేశారు. 2024లో రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జోన్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టి ఆ జోన్లో పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేసిన సత్య శ్రమకు తగ్గట్టుగానే అక్కడ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో కొండపిలో పోటీ చేస్తున్న ఎమ్యెల్యే స్వామి గారి గెలుపు కోసం తగిన వ్యూహాలు రచించి పార్టీ శ్రేణుల ద్వారా వాటిని అమలు చేసి స్వామి గారి హ్యాట్రిక్ విజయంలో భాగస్వామి అయ్యారు.
దశాబ్దన్నర క్రియాశీలక రాజకీయ జీవితంలో క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా తన కృషి, పట్టుదల మరియు అంకిత భావంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు సత్య. తను పార్టీకి చేసిన అవిరాళమైన కృషిని గుర్తించిన అధినేత చంద్రబాబు 2024లో ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్‌గా నియమించారు. చైర్మన్‌గా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు రాష్ట్రాన్ని షిప్పింగ్ హబ్‌గా, యువతకు షిప్పింగ్ రంగంలో ఉపాధి కల్పించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఒకవైపు చైర్మన్‌గా తీరిక లేకుండా గడుపుతూనే మరోవైపు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రాజకీయ సవ్యసాచిగా నిలుస్తున్నారు.
--డి.వి.అరవింద్(మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!