ఉత్కళ రాజకీయ శిఖరం-బిజు పట్నాయక్
- March 07, 2025
బిజు పట్నాయక్.. భారతదేశ రాజకీయ యవనికపై చెరిగిపోని ముద్రవేసిన గొప్ప నాయకుడు. తూర్ప భారతదేశం అభివృద్ధి పట్ల కాంగ్రెస్ చూపించిన వివక్షను ధైర్యంగా ప్రశ్నించారు. మహాత్ముడి ప్రభావంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన పట్నాయక్ నాలుగున్నర దశాబ్దాల పాటు జాతీయ మరియు కళింగ (ఒరిస్సా) రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్నారు. ఒరిస్సా అభివృద్ధికి బాటలు పరిచిన మహనీయుడిగా ఆ రాష్ట్ర ప్రజల చేత ఇప్పటికి కొలవబడుతున్నారు. ఉత్కళ రాజకీయ శిఖరం బిజు పట్నాయక్ జీవన ప్రస్థానం మీద ప్రత్యేక కథనం..
బిజు పట్నాయక్ అసలు పేరు బిజయానంద పట్నాయక్. 1916, మార్చి 5న ఉమ్మడి బీహార్ & ఒరిస్సా ప్రావిన్స్‌లోని కటక్ పట్టణంలో లక్ష్మీ నారాయణ పట్నాయక్, ఆశాలత పట్నాయక్ దంపతులకు జన్మించారు. వారి స్వస్థలం గంజాం జిల్లాలోని భంజన్‌నగర్. తండ్రి ప్రముఖ న్యాయవాది మరియు పర్లాకిమిడి సంస్థానం దివాన్‌గా పనిచేసేవారు. బిజు తన బాల్యం,మరియు విద్యాభ్యాసాన్ని కటక్ పట్టణంలోనే పూర్తి చేశారు. కటక్‌లోని ప్రసిద్ధ రావెన్‌షా కళాశాలలో ఇంటర్ మరియు బిఎస్సి రెండో సంవత్సరం వరకు చదువుకున్నారు.
బిజు పట్నాయక్ చిన్నతనం నుంచే విమానాలు అంటే ఎంతో ఆసక్తి చూపేవారు. పెరిగి పెద్దయ్యే కొద్దీ విమానాలు నడపాలనే ఆసక్తి కూడా ఆయనలో పెరుగుతూ వచ్చింది. తండ్రి ఆయన్ని న్యాయవాదిగా చూడాలనుకున్నప్పటికి విమానాలు నడపాలని ఆసక్తితో డిగ్రీ రెండో సంవత్సరంలోనే రావెన్‌షా కాలేజీ నుంచి వచ్చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడ ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ అనుబంధంగా ఉన్న ఏరోనాటికల్ శిక్షణ సంస్థలో పైలట్‌గా శిక్షణ పొందారు. ఆ తర్వాత రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు.
1946లో ఇండోనేషియా స్వతంత్ర పోరాటంలో పైలట్‌గా డచ్ పాలకుల నుంచి ఆ దేశ నాయకులను కాపాడి ఆ దేశ ప్రజల్లో హీరోగా నిలిచారు. ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇండోనేషియా అత్యున్నత అవార్డు "భూమిపుత్ర" తో సత్కరించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.1947 ఇండియా - పాకిస్తాన్ యుద్ధంలో సైతం పైలట్‌గా ఇండియన్ ఆర్మీ సిబ్బందిని శ్రీనగర్ పట్టణానికి సురక్షితంగా తీసుకెళ్లి నాటి యుద్ధంలో భారత్ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు.పైలట్‌గా పట్నాయక్ అందించిన సేవలను నాటి దేశ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కొనియాడారు.
పట్నాయక్ తండ్రి లక్ష్మీ నారాయణ పట్నాయక్ జాతీయవాద భావజాల సానుభూతిపరుడు. ఒరిస్సా రాష్ట్ర పితామహులైన ఉత్కళ ప్రజల ఆరాధ్య నాయకులు మధుసూదన్ దాస్, గోపబంధు దాస్ గార్లకు అత్యంత సన్నిహితుడు. తండ్రి స్పూర్తితో పట్నాయక్ సైతం చిన్న నాటి నుంచి జాతీయవాద దృక్పథాన్ని అలవరుచుకున్నారు. విద్యార్ధి దశలోనే మహాత్మాగాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటం ఆయన్ని బాగా ఆకర్షించింది. రెండో ప్రపంచ యుద్ధం మధ్యలోనే ఇండియాకు తిరిగి వచ్చి 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, లోహియా, అరుణ అసఫ్ ఆలీ వంటి యువ నాయకులతో పరిచయాలు అయ్యాయి.
స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే ఒరిస్సాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. కటక్ కేంద్రంగా చేసుకొని రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ 1946 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర కటక్ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గంజాం జిల్లాలోని జగన్నాథ్ ప్రసాద్, సౌరుదా నియోజకవర్గాల నుంచి 1952, 1957లలో ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1961లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి 45 ఏళ్ళ వయస్సులోనే ఒరిస్సా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన ప్రత్యర్థులు చేసిన కుట్రల కారణంగా కామరాజ్ ప్రణాళికను సాకుగా చూపి రెండేళ్లు తర్వాత 1963లో సీఎం పదవికి రాజీనామా చేయించారు.
సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉత్కళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పట్నాయక్, పార్టీ బలోపేతం కోసం కృషి చేసినప్పటికి పార్టీలోని వర్గ రాజకీయాల మూలంగా పట్నాయక్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 1967 ఎన్నికల్లో పట్నాయక్ బదులు ఊరుపేరు లేని నాయకుడి ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికలకు వెళ్లగా ప్రజలు ఓడించారు. పట్నాయక్ ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. శాస్త్రి మరణం తర్వాత ఇందిరా ప్రధాని అవ్వడంతో ఏఐసిసిలో కీలకంగా వ్యవహరించారు.
1969లో ఆమెతో వచ్చిన భేధాభిప్రాయాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి ఉత్కళ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 1971 ఎన్నికల తర్వాత స్వతంత్ర పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పట్నాయక్ పాత్ర చాలా కీలకం. ఈ ప్రభుత్వాన్ని ఇందిరా సహకారంతో ఒకప్పటి పట్నాయక్ అనుచరురాలైన నందిని సత్పతి కూల్చి తన నేతృత్వంలో ప్రభుత్వాన్ని చేశారు. ఇదే సమయంలో పట్నాయక్ తన పూర్వ సన్నిహితుడైన జయప్రకాశ్ నారాయణ్ మొదలు పెట్టిన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో భాగస్వామి అయ్యి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. 1975లో ఇందిరా విధించిన ఎమెర్జెన్సీ సమయంలో దేశవ్యాప్తంగా మొదట అరెస్ట్ అయిన ప్రతిపక్ష నేతగా బిజు పట్నాయక్ చరిత్రలో నిలిచారు.
1977లో ఎమెర్జెన్సీ ఎత్తేసిన తర్వాత తన నాయకత్వంలోని ఉత్కళ కాంగ్రెస్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు. 1977లో కేంద్రపాడ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1977-79 వరకు మొరార్జీ దేశాయ్, చౌధరీ చరణ్ సింగ్ మంత్రివర్గాల్లో కేంద్ర ఉక్కు మరియు బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1979 చివర్లో జనతా ప్రభుత్వం కూలిన తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లో సైతం జనతా పార్టీ తరపున కేంద్రపాడ నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1984లో సైతం ఇందిరా ఆకస్మిక మరణం తర్వాత ఎన్నికల్లో దేశంలోని దిగ్గజ ప్రతిపక్ష నేతలు ఓటమి పాలైనప్పటికి పట్నాయక్ మూడోసారి కేంద్రపాడ నుంచి ఎన్నికయ్యారు.
1984లో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెదేపా అధినేత, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్టీఆర్ రాజకీయాలను దగ్గర నుంచి గమనిస్తూ వచ్చిన పట్నాయక్, జాతీయ రాజకీయాల్లో విపక్షాల మధ్య ఐక్యత పరిచేలా చేసేందుకు ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించేలా ఒప్పించడంలో పట్నాయక్ వ్యవహరించారు. ఎన్టీఆర్, పట్నాయక్ కలిసి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ సీఎంగా బిజీగా ఉన్న సమయంలో పట్నాయక్ దేశంలోని విపక్ష నేతలను కలుస్తూ ఐక్యత సాధించేవారు. ముఖ్యంగా అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వి.పి.సింగ్‌ను తమలో ఒకడిగా చేర్చుకోవడానికి ఆనాటి జాతీయ విపక్ష నేతలు సందేహిస్తున్న సమయంలో పట్నాయక్ చూపిన చొరవ వల్ల సింగ్‌ను అంగీకరించారు. దేశంలోని చీలిక సోషలిస్టు, సెక్యులర్ పార్టీలన్ని విలీనం జరిగి జనతాదళ్ పార్టీగా ఏర్పడటంతో కీలకమైన పాత్ర పోషించారు.
1985లో జరిగిన ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో రాజధాని భువనేశ్వర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో జనతాపార్టీ గెలవక పోయినప్పటికి పట్నాయక్ ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పాటు కొనసాగారు. ఈ సమయంలో 1989 ఎన్నికల్లో కేంద్రంలో వి.పి.సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ కొలువుదీరిన తర్వాత ఫ్రంట్ సమన్వయకర్తగా పట్నాయక్ ఢిల్లీలో ఎక్కువగా గడిపారు. అయితే, ప్రతిపక్షనేతగా అప్పటి ఒరిస్సా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుండేవారు.
1990లో తన నాయకత్వంలో జనతాదళ్ పార్టీ ఒరిస్సాలో అధికారంలోకి రావడం జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత 1990లో రెండోసారి ఒరిస్సా సీఎంగా ఎన్నికయ్యారు. 1990 నుంచి 1995 వరకు ఒరిస్సాను ఐదేళ్ల పాటు పాలించారు. అయితే, పాలనలో జరిగిన చిన్న తప్పులు వల్ల 1995లో అధికారాన్ని కోల్పోయారు. 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆస్కా నుంచి నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
బిజు పట్నాయక్ తన రాజకీయ జీవితంలో ఓటమెరుగని నేతగా నిలిచారు. 6 సార్లు ఎమ్యెల్యేగా, 4 సార్లు ఎంపీగా, ఒక పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధిగా ఆయన ఒరిస్సా రాష్ట్ర ప్రగతికి ఎంతో కృషి చేశారు. కేంద్రంలో సుదీర్ఘ కాలంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలను వెలికితీయడానికి ఇచ్చే ప్రాధాన్యత రాష్ట్ర ప్రజల అభ్యన్నతికి ఇవ్వడం లేదని ధైర్యంగా నాటి ప్రధాని ఇందిరా ముందే తన నిరసన గళం వినిపించారు. తూర్పు భారతదేశంలోని బెంగాల్, ఒరిస్సా, అవిభక్త బీహార్ రాష్ట్రాల వెనుకబాటును పారద్రోలే చర్యలు చేపట్టడంలో ఎటువంటి పురోగతి లేదని పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
పట్నాయక్ గొప్ప పరిపాలనాదక్షుడు. ఒరిస్సా ముఖ్యంత్రిగా ఆయన ఉంది కేవలం 7 సంవత్సరాలే! అయినప్పటికి ఆ రాష్ట్రంలో ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలు, థర్మల్ మరియు హైడల్ పవర్ ప్లాంట్స్, పారాదీప్ పోర్ట్ నిర్మాణం, కళింగ ఎయిర్ లైన్స్ , కళింగ పైప్స్ వంటి ప్రముఖ సంస్థలన్ని ఆయనే స్థాపించారు. ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ పట్టణాన్ని అన్ని హంగులతో మహానగరంగా తీర్చిదిద్దిన ఘనత సైతం ఆయనదే. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేంచేందుకు నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేశారు. ఉన్నత విద్యా సంస్థలైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడిసిన్ కాలేజీలను స్థాపించారు. ఒరిస్సాకు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో తన అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేశారు.
ఒరిస్సా స్థానిక సంస్థలను సంస్కరించి, వాటి బలోపేతం కోసం నిధులు దండిగా విడుదల చేసిన ఘనత బిజు బాబు సొంతం. స్థానిక సంస్థల్లో అన్ని వర్గాలకు చెందిన వారు ప్రాతినిధ్యం వహించేలా కృషి చేశారు. స్థానిక సంస్థల బలోపేతం ద్వారానే మహాత్ముడు కలలు కన్న రామరాజ్యం ఏర్పడుతుందని పట్నాయక్ నమ్మేవారు. ఒరిస్సాలో ఆయన ప్రవేశ స్థానిక సంస్థల సంస్కరణల కారణంగా ఆ రాష్ట్రంలో ప్రగతికి బీజం పడ్డాయి. అందుకే ఆయన్ని ఆ రాష్ట్ర స్థానిక సంస్థల సంస్కరణకర్తగా కీర్తిస్తుంటారు.
పట్నాయక్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన సతీమణి గ్యాన్ పట్నాయక్ సైతం పైలట్‌గా పనిచేశారు. భారతదేశంలో కమర్షియల్ ఏరోప్లేన్ నడిపేందుకు లైసెన్స్ పొందిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా మిషన్లో తన భర్తతో కలిసి ఆ దేశ నాయకులను కాపాడారు. తర్వాత కాలంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారులు ప్రేమ్ పట్నాయక్ మరియు నవీన్ పట్నాయక్‌లు, కుమార్తె గీతా మెహతా. ప్రేమ్ పట్నాయక్ ప్రముఖ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు. కుమార్తె గీతా మెహతా ప్రముఖ రచయిత్రి. ఇక నవీన్ పట్నాయక్ తండ్రి రాజకీయ వారసుడిగా వచ్చి ఒక పర్యాయం కేంద్ర మంత్రిగా, వరసగా ఐదు సార్లు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఒరిస్సా అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు.
నాలుగున్నర దశాబ్దాల క్రియాశీలక రాజకీయ జీవితంలో అవినీతి, బంధుప్రీతికి ఆమడదూరంలో నిలుస్తూ ఎందరో సామాన్య, సాధారణ కుటుంబ నేపథ్యం కలిగిన యువకులను రాజకీయాల్లో పైకి తీసుకువచ్చారు. ఒరిస్సా రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా రాజకీయాలను నడిపిన బిజు బాబు అంటే అన్ని పార్టీల నాయకులకు ఎంతో గౌరవం. ముఖ్యంగా ఒరిస్సా ప్రజానీకం అయితే తమ జీవితాలను బాగు చేసేందుకు ఆ పూరీ జగన్నాథుడు పంపిన దైవ దూతగా ఆయన్ని భావించేవారు.
రాజకీయాల్లో అజాతశత్రువుగా, ప్రజాక్షేత్రంలో ఓటమెరుగని రాజకీయ యోధుడిగా నిలిచిన బిజు బాబు 1997, ఏప్రిల్ 17న గుండెపోటుతో ఊపిరాడక తన 81వ ఏట కన్నుమూశారు. ఒరిస్సా ప్రగతి కోసం అహర్నిశలు శ్రమించిన ఆయన స్మారకార్థం పలు విద్యాసంస్థలకు, భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు, క్రీడా సంస్థలకు పేరు పెట్టారు. అలాగే, ఒరిస్సా స్థానిక సంస్థలను బలోపేతం చేసినందుకు ఆయన జన్మదినాన్ని ఒరిస్సా పంచాయితీరాజ్ దినోత్సవంగా ప్రకటించారు.
--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!