తెలుగు కథాంజలి-కె.ఎన్.వై.పతంజలి
- March 11, 2025
పతంజలి...అతనిదో విలక్షణమైన శైలి.భాషల, వస్తువులో తొణికిసలాడే వ్యంగ్యం. సమాజాన్ని, మనుషులను తలకిందులు చేసి చూడాలనే తత్వం.మనుషుల్లోని వైవిధ్యాన్ని, విలక్షణతని తనదైన ప్రత్యేక కెమరాతో చూసే చూపు. తనకోసం మాత్రమే రచనలు చేస్తాను అని నిక్కచ్చిగా చెప్పగల ధైర్యం. అపారమైన పాండిత్యం, ఆ పాండిత్యాన్ని మాండలిక భాషలో సొగసుగా వ్యక్తం చేయగల ప్రతిభ. అతనే కె.ఎన్.వై. పతంజలి. ఏ కొద్ది సాహిత్యాభిమానం ఉన్నవారికైనా పతంజలి గురించి తప్పక తెలిసే ఉంటుంది. మనుషుల వ్యక్తిత్వాల్లోని వైరుధ్యాన్ని అన్ని కోణాల నుంచి చిత్రించిన రచయత ఆయన. పతంజలి అంటే జర్నలిస్టు, కథ, నవలా రచయిత కాలమిస్టు, వ్యాస రచయిత మరియు వైద్యుడు. వ్యంగ్యానికి పెట్టింది పేరు. నేడు సుప్రసిద్ధ జర్నలిస్టు, కథా రచయిత కె.వై.ఎన్ పతంజలి వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం ....
కె.ఎన్.వై.పతంజలి అసలుపేరు కాకర్లపూడి నరసింహ యోగ పతంజలి. 1952, మార్చి 29న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త విశాఖపట్నం జిల్లా శృంగవరపుకోట తాలూకా అలమండలో క్షత్రియ కుటుంబానికి చెందిన కాకర్లపూడి వెంకట విజయ గోపాలరాజు, సీతాదేవి దంపతులకు జన్మించారు. విజయనగర సంస్థానాధీశులైన పూసపాటి వంశీకులు వీరి బంధువులే. పతంజలి తండ్రి గోపాలరాజు మాత్రం ఆధునికంగా ఉండేవారు. పతంజలికి ఒక అన్న, నలుగురు తమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు.
పతంజలి తండ్రి గోపాలరాజు అలోపతీ, యునానీ, ఆయుర్వేద వైద్యాల కలగలుపు అయిన లైసెన్షియేట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ (ఎల్.ఐ.ఎం.) చదువుకుని వైద్యం చేసేవారు. గోపాలరాజు వైద్యంతో పాటుగా ఖగోళ, జ్యోతిష శాస్త్రాలు, పాశ్చాత్య సాహిత్యం, భారతీయ సాహిత్యం, వేదాంతం వంటి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసేవారు. ఆరోజుల్లోనే తన ఇంట్లో భారీ గ్రంథాలయాన్ని తన ఇంట్లో ఏర్పాటు చేశారు. భారతీయ శాస్త్రాల మీద తనకున్న ఇష్టం కారణంగానే రెండవ కుమారుడి పేరు సంస్కృత వ్యాకరణానికి మహాభాష్యాన్ని, యోగసూత్రాలను అందించిన పతంజలి పేరు (యోగ నారసింహ పతంజలి) పెట్టారు.
పతంజలికి, అతని సోదరులకు సాహిత్యాభిలాష వారి తండ్రి నుంచి నుంచి వారసత్వంగా వచ్చింది. చిన్ననాడే తండ్రి వద్ద ఆయుర్వేద శాస్త్రాన్ని నేర్చుకున్నారు. పతంజలి బాల్యం అలమండ గ్రామంలోనే సాగింది. రెండున్నర ఎకరాల సువిశాల క్షేత్రంలో చుట్టూ ప్రకారం మధ్యలో నాలుగిళ్ళ లోగిట్లో అతను పెరిగాడు. ఊరికి కొద్ది దూరంలోనే కొండలు, అడవి ఉండేవి. గ్రామంలోకి అప్పుడప్పుడూ చొరబడే అడవి జంతువులకు తోడు రకరకాల జంతువులను సీతాదేవి, గోపాలరాజు పెంచేవారు. ఇంట్లోనూ, బయటా ఉండే రకరకాల జంతువులు, పక్షులూ, ఇంటికి వైద్యం చేయించుకోవడానికి వచ్చే రకరకాల సామాన్యులూ, పేదలూ, తన బంధువర్గంలో రకరకాల వ్యక్తుల మాటతీరు, ఆలోచనా విధానం, గ్రామ జీవితం- ఇవన్నీ చిన్నతనం నుంచీ పతంజలి పరిశీలించేవారు.
మేనమామ ఉప్పలపాటి అప్పల నరసింహరాజుతో పతంజలికి, అతని తమ్ముళ్ళకి మంచి సాన్నిహిత్యం ఉండేది. తన అక్క సీతమ్మ ఇంట్లోనే పెరిగినవాడు కావడంతో బుడతనపల్లి రాజేరు నుంచి ఎప్పడు తోచితే అప్పుడు అలమండ వచ్చి అక్కా బావల ఇంట్లో ఉండేవారు. అందరు ఆయన్ని బుచ్చి అని పిలిచేవారు. బుచ్చిమామ వేట జట్లలో ఉండేవాడు, ఎంతో తిరిగినవాడు. అతను విన్న, చూసిన వేట కథలను, ఇతర విశేషాలను వేళాకోళం, వెక్కిరింతలతో హాస్యంగా వినిపిస్తే పతంజలి సైతం మరీ మరీ చెప్పించుకుని వినేవారు. వీటికి తోడు ఎనిమిదేళ్ళ వయసు నుంచి ఇంట్లో దొరికిన ప్రతీ పుస్తకాన్ని ఆసక్తిగా చదవడం మొదలుపెట్టారు. ఆ దశలోనే మామ చెప్పిన కథలను, తాను చదివే కథల్లాగా రాయాలన్న ఆసక్తి పుట్టుకువచ్చింది.
పతంజలి విద్యార్ధి దశలోనే తెలుగు డిటెక్టివ్ నవలలు విపరీతంగా చదవడం మొదలుపెట్టారు. కొమ్మూరి సాంబశివరావు, విశ్వప్రసాద్ వంటి ప్రముఖ తెలుగు డిటెక్టివ్ రచయితలు రాసిన అపరాధ పరిశోధక నవలలు క్షుణ్ణంగా, ఆసక్తిగా చదువుకునేవారు. ఐతే, వీటిని చెత్తపుస్తకాలుగా లెక్కించి, ఇవి చదివినందుకు పతంజలిని అతని తండ్రి చితకబాదేవారు. ఈ వేడిలోనే 1963లో పదకొండేళ్ళ వయసులోనే పతంజలి తన జీవితంలో తొలి నవలగా "అస్థిపంజరం" అన్న అపరాధ పరిశోధక నవల రాశారు. దాదాపు అదే వయసులో చైనా యుద్ధం గురించి ఓ కవిత కూడా అల్లారు. కొన్నాళ్ళకు పతంజలి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, చలం రాసిన స్త్రీ చదివారు. ఆ రెండు పుస్తకాలూ అతనిని చాలా కుదిపివేశాయి.
విజయనగరంలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ తీసుకువచ్చిన ఆవేశంతో అరసం, విరసం వంటి ఉద్యమాల నుంచి క్రమేణా దిగంబర సాహిత్య ఉద్యమం ప్రారంభమవుతున్న కాలంలో తొలుత పాఠకుడిగా, ఆ తర్వాత ఔత్సాహిక యువకవిగా పతంజలి రూపుదిద్దుకుంటున్న కాలమది. ఆ సాహిత్య విప్లవ ప్రభావం అంతా పతంజలిపై పడింది. విజయనగరంలో సోదరులతో కలిసి భారతీయ, పాశ్చాత్య సాహిత్యంలో గొప్ప గొప్ప రచనలు ఎన్నిటినో చదివారు. రావిశాస్త్రిని, గురజాడను ఆరాధించేవారు. తన చుట్టూ ఉన్న తెలుగు సాహిత్య వాతావరణాన్ని అవగాహన చేసుకునేవారు. 1968లో "చివరి రాత్రి" అనే కథానికతో మొదలుపెట్టి దానికి కొనసాగింపుగా మరిన్ని కథలు రాశారు. గొప్ప రచయితలను పోలినట్టు రాయాలన్న తమకంతో ఉండేవారు.
డిగ్రీ పూర్తయ్యాక విశాఖ ఈనాడు ఎడిషన్ సబ్ ఎడిటర్‌గా చేరారు. 1975 నుంచి 84 వరకు ఈనాడులో పనిచేశారు. ఈనాడు పత్రికలో పనిచేస్తున్న సమయంలోనే విశాఖ నగరానికి ఆయన మకాం మారాక అక్కడి ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ప్రపంచ సాహిత్యాన్ని లోతుగా, విస్తారంగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. దాస్తొయెవ్‌స్కీ, బెర్‌టోల్డ్ బ్రెహ్ట్, నికోలాయ్ గోగోల్, మార్క్ ట్వేయిన్, ఆస్కార్ వైల్డ్, అంటోన్ చెకోవ్ వంటి పలువురు ప్రపంచ స్థాయి రచయితల కథలు, నవలలు, నాటకాలు క్షుణ్ణంగా, ఇష్టంగా చదువుకోవడం మొదలుపెట్టారు.ఈ విస్తృతాధ్యయనం వల్ల పతంజలికి అనుకరించాలన్న ధోరణి పోయింది. అదే సమయంలో తాను రాస్తున్నవి ఆ రచయితల స్థాయితో పోల్చుకుని సరిగా లేవేమోనన్న న్యూనత వల్ల సాహిత్య సృష్టి కూడా తగ్గింది. ఆ సమయంలోనూ, అంతకుముందూ రాసిన కథలను "దిక్కుమాలిన కాలేజీ" పేరుతో ప్రమీలా పబ్లికేషన్స్ నెలకొల్పి 1976 జూలైలో ప్రచురించారు.
ఈనాడులో విశాఖ, విజయవాడ, తిరుపతి మరియు హైదరాబాద్ నగరాల్లో పనిచేసిన పతంజలి 1984లో మొదలైన ఉదయం పత్రికలో న్యూస్ ఎడిటర్ హోదాలో చేరారు. ఆ తర్వాత ఆంధ్రభూమి, మహానగరం, ఆంధ్రప్రభ పత్రికల్లో పనిచేశారు. టీవీ9 న్యూస్ ఛానల్‌లో కొద్దీ కాలం పనిచేసిన ఆయన సాక్షి దినపత్రిక మొదలైనప్పుడు ఆ పత్రిక వ్యవస్థాప ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తించారు. జర్నలిజం రంగంలో ఆయన స్పూర్తి మరియు శిక్షణలో రాటుదేలిన ఎందరో ఔత్సాహిక యువకులు నేడు జర్నలిజం రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. తమను ఈ స్థాయికి తీసుకువచ్చిన ఆ మహనీయుడిని ఇప్పటికి స్మరించుకుంటూనే ఉన్నారు.
పతంజలి ఎన్నో కథలు, నవలలు, నవలికలు రాశారు. ఆయన రచనలు సమాజానికి చేదు మాత్రలు. తన వ్యంగ్య వైభవంతో నవ్విస్తూనే కంట తడి పెట్టించే అతి కొద్ది మంది రచయితల్లో పతంజలి ఎన్నదగినవారు. ఆయన జర్నలిస్టు జీవితాలపై 'పెంపుడు జంతువులు' నవల రాశారు. పోలీసులపై 'ఖాకీవనం' అనే నవల రాశారు. పతంజలి తొలినవల “ఖాకీవనం” 1980 నవంబర్‌లో అచ్చయింది. పోలీసుకు తెలుగు సమాజంలో 'ఖాకీ' పర్యాయ పదం కావడానికి ఈ నవలే కారణం. అంత పదునైన రచనలు ఆయనవి. ఆయనది 'చూపున్న పాట' అనే కథాసంకలనం అచ్చయింది. 'పతంజలి భాష్యం' కొందరికి నిత్య పఠనీయ గ్రంథం కొందరికి. వివిధ ఆంశాలపై ఆయన ప్రతిస్పందనలను పదునైన భాషలో, తెలుగు నుడికారంలో, వ్యంగ్య వైభవంతో రికార్డు చేసిన పుస్తకం ఇది.
ఇవన్నీ ఒక ఎత్తయితే, 'వీరబొబ్బిలి', 'పిలక తిరుగుడు పువ్వు', మరో నవలిక సమాజంపై విసిరిన తీయని కత్తులు. తెలుగు సమాజంలోని అనేకానేక 'జబ్బులను' సమర్థంగా వ్యక్తీకరించి, పాఠకులను నవ్విస్తూనే కంట ఆలోచనల తెరను లేపే రచనలివి.భారత ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలుగా నిలిచిన నాలుగు యంత్రాంగాలైన రాజకీయం, న్యాయం, పోలీసు, పత్రికలను నిరంతరం డేగ నిఘావేస్తూ వాటి డొల్లతనాన్ని తన ప్రతి రచనలోనూ ఏకి పారేసిన పతంజలి కేవలం విమర్శతో ఆగిపోలేదు. దానినెలా బాగుచేసుకోవచ్చో అన్యాపదేశంగా తన రచనలలో సూచించారు.
ఖాకీవనం, పెంపుడు జంతువులు, రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, అప్పన్నసర్దార్, ఒక దెయ్యం ఆత్మకథ, నువ్వేకాదు, వేటకథలు, రాజుల లోగిళ్లు, దిక్కుమాలిన కాలేజీ, పతంజలి భాష్యం, చూపున్నపాట, పోయేకాలం, శెభాసోమపాసా, జ్ఞాపకకథలు, గెలుపుసరే బతకడమెలా వంటి రచనలు ఆయన కలం జాలువార్చిన అక్షరాస్త్రాలు. ఉత్తరాంధ్ర వాడుక భాష నుడికారాన్ని, ఇక్కడి ప్రజల జీవనసరళిని ఆత్మను, వర్గస్వభావ నేపథ్యంలో తన రచనల్లో ప్రతిఫలింపజేసి ప్రపంచానికంతటికీ చాటి చెప్పిన గొప్ప రచయిత పతంజలి
పతంజలి రచనలను అర్థం చేసుకోవాలంటే 1970ల నుంచి సమాజాన్ని అవగతం చేసుకోవాలి. తెలుగునేలపై వచ్చిన సాంస్కృతిక, రాజకీయ మార్పులను, ఉద్యమాలను తెలుసుకోవాలి.1975లోని ఎమర్జన్సీ నుంచి అన్నమాట. బాల్యంలో భూస్వాముల ఇళ్లల్లోని గొప్పలు, యవ్వనంలో విశాఖతీరంలోని అనుభవాలు, ఉత్తరాంధ్రలోని ఉద్యమాల ప్రభావం అన్నీ వీరి రచనల్లో అంతర్గతంగా కనిపిస్తాయి. ఇంకా శ్రీశ్రీ, పురిపండ అప్పల స్వామి, కారా మేస్టారు, రావి శాస్త్రి, చెకోవ్, మొపాసా, గురజాడ, చాసో, ఆస్కార్ వైల్డ్, వేమన, సెర్వాంటిజ్‌ల ప్రభావం కూడా ఉంది. అందుకే చమత్కారం, వ్యంగ్యం, విలక్షణమైన వచనశైలి వీరి సొంతం. పాత్రచిత్రణ, సన్నివేశాల కల్పన, సంభాషణలు... సరికొత్తగా తటిల్లతల్లా మెరుస్తుంటాయి. ప్రతి రచనలో అంతుచక్కని లోతు, అర్థం చేసుకున్నంత విస్తృతి కనిపిస్తుంది.
ఖాకీవనంలో ప్రభుత్వం తరపున ప్రజలపై ధౌర్జన్యం చేసే వాళ్లే అధికార వర్గాన్ని నిలదీయడం చూడొచ్చు. వీరబొబ్బిలిలో రాజుల లోగిళ్లలో పుట్టి పెరిగి వారి మాటలతో పాటు, మర్యాదలు, పెంకితనాన్ని నేర్చుకున్న గ్రామసింహం (కుక్క) తీరును వ్యంగ్యంగా అర్థం చేసుకోవచ్చు. నావల్ల ఈ దివాణానికి కళ, కాంతి అని విర్రవీగే కుక్క అది. చూపున్న పాట కథలో గుడ్డివాడు తన ప్లూటులో విప్లవాన్ని ఉద్దేశించే పాట పాడితే... అది పోలీసును ఎలా భయపెడుతుందే వివరించారు. అడల్డ్ స్టోరీలో- పువ్వును ముద్దు పెట్టుకుంటే పుప్పొడి, పెళ్ళాన్ని ముందు పెట్టుకుంటే కుంకుమ పెదాలకు అంటుకుంటాయి అన్నారు. నువ్వే కాదు నవలికలో డబ్బు మనుషుల్ని ఎలాంటి దైన్యానికి దిగజారుస్తుందో తెలియజేశారు. న్యాయం, మీడియా అన్నీ వ్యవస్థలూ అవినీతి మయం అయ్యాయని రుజువు చేశారు. అసలు పతంజలి సృష్టించిన పాత్రలు వెక్కిరిస్తాయి, చమత్కారంగా సంభాషిస్తాయి, పాఠకుల గుండెలను బరువెక్కిస్తాయి, మెండైన తర్కంతో మెప్పిస్తాయి. మానవ స్వభావం, ఆశలు, నిరాశలు, అన్నీ వ్యవస్థీకృతం అని చెప్పకనే చెప్తాయి. మనల్ని మేడిపండు వొలిచినట్లు వొలిచి మనలోని లోపాల్ని పురుగుల్లా బైటకు చూపెడతాయి.
తన రచనల గురించి పతంజలి స్వయంగా చెప్తూ- నేను వ్యంగ్యాన్ని ప్రత్యేకంగా రాయను, మనుషుల్లో ఉన్నదే రాస్తాను అంటారు. చెడును. దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం. వ్యంగ్యంలో నా బాధ, క్రోధం ఉంటాయి. రాయకుండా ఉండలేను కాబట్టే రాస్తున్నాను అని చెప్పుకున్నారు. పతంజలి రచనలు చదవడానికి ధైర్యం కావాలి. లోకం మీద కసితో కురిసే వారి వాక్యాల కత్తుల బోనులోకి ప్రవేశించాలి అంటే ఆ పదును తట్టుకోగలగాలి. వీరికి రావిశాస్త్రి పురస్కారం, చాసో పురస్కారం లభించాయి. వీరి రచనల మొత్తాన్ని మనసు ఫౌండేషన్ రెండు సంపుటాలుగా తెచ్చింది. వీరి నవలికలను నాటకాలుగా మలచి ప్రదర్శించారు.
రావిశాస్త్రికి తెలుగు సాహిత్యంలో ఇద్దరే వారసులున్నారు. ఒకరు- బీనాదేవి, మరొకరు- పతంజలి. బీనాదేవి రావిశాస్త్రి కన్నా ముందుకు వెళ్లలేకపోయారు. అయితే, గరువును మించిన శిష్యుడు పతంజలి. రావిశాస్త్రిని దాటి ఎదిగిన రచయిత ఆయన. రావిశాస్త్రి అంటే పతంజలికి ఎనలేని అభిమానం. అయితే, తెలుగులో పతంజలి రచనలను పెద్దగా విశ్లేషించనవారు లేరు.దానికి కారణం తెలుగులో సాహిత్య విమర్శ ఎదగాల్సినంత ఎదగలేదు. పతంజలి రచనలు అర్థం కాకపోవడం వల్ల విశ్లేషణలు రాలేదనే విషయాన్ని పతంజలి అంగీకరించరు. 'మనకున్న విమర్శకులే తక్కువ' అని ఆయన అన్నారు.
ఆయన సమకాలానికి చెందిన ఒక్కో రచయితవి, కవివి రెండేసి, మూడేసి ఇంటర్వ్యూలు అచ్చయ్యాయి. కానీ పతంజలి ఇంటర్వ్యూలు అచ్చు కాలేదు. కొందరు ఇంటర్వ్యూ కూడా చేశారాయనను. కానీ, అవి అచ్చు కాలేదు. దీనికి కారణమడిగితే- 'నేను జర్నలిస్టు కావడం వల్లనేమో' అని ఆయన జవాబిచ్చారు. ఆయన 'ఉదయం' దిన పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. ఇంకా చాలా పత్రికల్లో పని చేశారు. ఒక సాహిత్యకారుడికి జర్నలిజం కూడా అడ్డం వస్తుందనేది పతంజలి ఉదంతం తెలియజేస్తోంది. తన రచనలతో సమాజాన్ని చైతన్యవంతం చేసిన పతంజలి కాలేయ కాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2009, మార్చి 11న తన 56 ఏట కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!