తెలంగాణ: స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్..

- March 13, 2025 , by Maagulf
తెలంగాణ: స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్..

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజురోజుకు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో అలర్ట్ అయిన సర్కార్ ఒంటిపూట బడులను ప్రకటించింది.ఈ నెల 15 నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట బడులు నడవనున్నాయి.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తారు. టెన్త్ పరీక్షలు జరిగే స్కూల్స్ లో మధ్యాహ్నం క్లాసులు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు క్లాసులు ఉంటాయి. ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు రానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు కొనసాగుతాయి. కొత్త విద్యా సంవత్సరం జూన్ 12, 2025న ప్రారంభం కానుంది.

అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ, ఎయిడెడ్ లేదా ప్రైవేట్ పాఠశాలలు అన్ని ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు పనిచేస్తాయి. విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం అందించబడుతుంది. ఆ తర్వాత వారిని ఇంటికి పంపేస్తారు.

ఇక, ఈ ఏడాది అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈసారి కాస్త ముందే ఒంటిపూట బడులు ప్రారంభించాలని నిర్ణయించింది.

మార్చి 21 నుంచి రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 4కి పరీక్షలు ముగుస్తాయి. 4.97 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 2వేల 500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 9గంటల 30నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీవ్రమైన వేడి నుండి విద్యార్థులను రక్షించడానికి, మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా ఉండటానికి కాస్త ముందుగానే ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com