హోలీ పండుగ...!
- March 14, 2025
భారతదేశంలో సర్వమత సమ్మేళనంగా జరుపుకునే పండుగలు హోలీ పండుగ ఒకటి.ఈ పండగను కుల మతం భేదం లేకుండా అందరూ ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ హోలీ పండుగను భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
దీపావళి సంబరాల తర్వాత దేశ ప్రజలంతా అత్యంత వేడుకగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందా? అంటే అది హోలీ పండుగ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి హోలీ పండుగ వస్తుందంటే చాలు పిల్లలు, యువకులు ఎంతో హుషారుగా ఉరకలేస్తుంటారు. ఈ పండుగకు చాలా విశిష్టతలు ఉన్నాయి. హోలీకి పురాణ గాథలతో పాటు శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నాయి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున నిర్వహించుకునే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా పిలుస్తారు.
రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. విష్ణుమూర్తిని స్మరించడం హిరణ్యకశపుడికి ఏ మాత్రం నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని అగ్నిలో ఆహుతి చేయాలని హోళికను హిరణ్యకశపుడు కోరుతాడు. దీంతో ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని హోళిక మంటల్లో దూకుతుంది. అయితే విష్ణుమూర్తి తన ఆధ్యాత్మిక శక్తితో ప్రహ్లాదుడిని ప్రాణాలతో కాపాడుతాడు. హోళిక మాత్రం మంటల్లో కాలిపోతుంది. ఈ క్రమంలో హోళికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలిక దహనం నిర్వహిస్తారు.
పాలమీగడ వంటి రంగు గల రాధను చూసి నల్లని కన్నయ్య చిన్న బుచ్చుకుంటుంటే యశోద రాధ మొహానికి ఇదే రోజున ఇంత రంగు పులిమిందంట! అందుకే ఈ రోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా వసంతం రాకను ఆహ్వానిస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందించడం కూడా ఆనవాయితీగా వస్తోంది.
హోలీ పండుగకు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వసంత కాలంలో వాతావరణం చలి కాలం నుంచి ఎండా కాలానికి మారుతుంది. వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరం, జలుబు వంటి వ్యాధులు సంభవిస్తాయి. ఈ జ్వరాల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం ద్వారా దూరమవుతాయనినే వాదన ఉంది.
హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఆచార సాంప్రదాయాలే కాదు ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. ప్రకృతి సహజసిద్ధమైన రంగులు చల్లుకుంటే అవి ఆరోగ్యానికి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బజారులో దొరికే కృత్రిమ రసాయనాలు కలిపిన రంగులు చల్లుకుంటే మాత్రం హాని తప్పదు.
ప్రకృతి సిద్దమైన మోదుగ, బంతి పూలు, ఆకులు, బచ్చలి ఆకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, గోరింటాకు వంటి సహజ సిద్దమైన వాటితో రంగులు తయారు చేసుకుని వాటి చల్లుకొని హోలీ సంబరాలు జరుపుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం. ప్రస్తుతం బజారులో దొరికే సింథటిక్ రంగులు వాడితే అవి కళ్లకు, చర్మానికి హాని చేస్తాయి.కాబట్టి ఈ హోలీ పండుగను మనం సహజసిద్ధమైన రంగులతో జరుపుకుందాం పర్యావరణానికి మేలు చేద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







