APNRT కో-ఆర్డినేటర్ అనిల్ కుమార్ కడించర్ల(-ఒమాన్)తో ముఖాముఖి

- October 27, 2016 , by Maagulf
APNRT కో-ఆర్డినేటర్ అనిల్ కుమార్ కడించర్ల(-ఒమాన్)తో ముఖాముఖి

Q: ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ కో-ఆర్డినేటర్లుగా మీ బాధ్యత ఏమిటి? 

A: ఒమన్‌లో నివసిస్తున్న తెలుగువారిని గుర్తించి, వారిని సభ్యులుగా చేర్చడం. మరీ ముఖ్యంగా ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంటర్‌ప్రెన్యూర్లను గుర్తించి, వారితో మమేకమై, ఎపిఎన్‌ఆర్‌టి లక్ష్యాల గురించి వివరించడం. 

Q: ఆంధ్రప్రదేశ్‌తో విదేశాల్లోని తెలుగువారిని కలిపేందుకు ముందుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం పట్ల మీ స్పందన ఏమిటి? 
A: ముఖ్యమంత్రి నిర్ణయం హర్షించదగ్గది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న శ్రమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో విదేశాల్లోని తెలుగువారిని భాగస్వాముల్ని చేయాలన్న ముఖ్యమంత్రి ఆలోచన చాలా గొప్పది. ముఖ్యమంత్రి ఆలోచనకు సర్వత్రా మంచి స్పందన లభిస్తోంది. 

Q: మాతృభూమికి ఎంతో కొంత చేయాలన్న సంకల్పం చాలా గొప్పది, ఈ సంకల్పాన్ని విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారెలా భావిస్తున్నారు? 
A: మాతృభూమికి ఏదైనా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. దానికి సరైన వేదికను ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడాన్ని విదేశాల్లోని తెలుగువారు హర్షిస్తున్నారు. సరైన అవకాశం కోసం, వేదిక కోసం ఎదురుచూస్తున్నవారంతా ఎపిఎన్‌ఆర్‌టి పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. 

Q: కొత్త రాష్ట్రం, కోటి సమస్యలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఎన్‌ఆర్‌ఐల తోడ్పాటు ఎలా ఉంటే బావుంటుందనుకుంటున్నారు? 
A: ప్రాంతాలకతీతంగా మాతృభూమి పట్ల మమకారం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సమస్యలతో ఉన్న రాష్ట్రానికి అభివృద్ధిలో తమవంతు ఊతమివ్వాలని భావిస్తున్నారు ఎన్‌ఆర్‌లు. అలాంటివారికి ఆహ్వానం పలికేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనస్వాగతం పలుకుతోంది. 'మాతృభూమి మనకేమిచ్చింది? అనేదానికన్నా మాతృభూమికి మనమేమిస్తున్నాం?' అనే భావన ఎన్‌ఆర్‌ఐలలో ఎక్కువగా ఉంటోంది. ఈ భావన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఊతమిస్తుంది. 

Q: ఇప్పటిదాకా ఎప్పుడూ ఎక్కడా లేని కొత్త విధానం, కొత్త ఆలోచన ఇది. ఈ ఆలోచన విదేశాల్లో ఉన్న వారిగా మీకెలా అనిపిస్తోంది? 
A: ఇది నిజంగానే చాలా గొప్ప ఆలోచన. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం చిన్న విషయం కాదు. వారందరి డాటాబేస్‌ రూపకల్పనలో ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో డాక్టర్‌ రవి వేమూరి సహకారం మరువలేనిది. ఎపిఎన్‌ఆర్‌టి అలాగే ఇండియన్‌ ఎంబసీ ఇన్‌ ఒమన్‌ వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. 

Q: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మీకు ఈ విషయంలో అందించే సహాయ సహకారాలు ఎలా ఉంటున్నాయి? 
A: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సంపూర్ణ సహకారాలు అందుతున్నాయి. డాక్టర్‌ రవి వేమూరి, డాక్టర్‌ నిరంజన్‌ తదితరులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నాం. మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిగారు కూడా ఈ విషయంలో వ్యక్తిగతంగా టచ్‌లో ఉంటూ, ప్రోగ్రామ్‌ అభివృద్ధిలో తమవంతు సహాయ సహకారాలు, సూచనలు అందిస్తున్నారు. 

Q: మాతృభూమికి సేవ చేయడం ఓ గొప్ప అవకాశం. ఆ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి మీ తరఫున ఎలా కృతజ్ఞత తెలుపుతారు? 
A: ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి వినూత్న ఆలోచనల్ని తెరపైకి తెచ్చినందుకు ఆయనకీ కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేం. ఎపిఎన్‌ఆర్‌టి ద్వారా తమ గ్రామాలు లేదా పట్టణాల్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం దొరకడం నిజంగా మా అదృష్టం. 

Q: ప్రభుత్వ ఆలోచనల్ని విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐల వద్దకు తీసుకెళ్ళడానికి మీరు చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు? 
A: ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన విశేషాలు, సంపూర్ణ సమాచారాన్ని తెలుగు కళా సమితి ద్వారా ప్రచారం చేయగలుగుతున్నాం. అలాగే ఎంబసీ అధికారులతోనూ, ఒమన్‌లో ప్రొఫెషనల్స్‌తోనూ, ఎపిఎన్‌ఆర్‌టి టీమ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com