'నక్షత్రం' మూవీ రివ్యూ

- August 04, 2017 , by Maagulf
'నక్షత్రం' మూవీ రివ్యూ

సినిమాపేరు: నక్షత్రం 
విడుదల తేదీ: 04-08-2017
సంగీతం: భీమ్స్‌.. హరిగౌరవ.. భరత్ మధుసూధన్‌.. 
ఫొటోగ్రఫీ: శ్రీకాంత్ నరోజ్‌ 
బ్యానర్: బుట్టబొమ్మ క్రియేషన్స్‌.. విన్ విన్ విన్ క్రియేషన్స్‌ 
నిర్మాతలు: కె.శ్రీనివాసులు.. వేణుగోపాల్‌.. సజ్జు 
డైరెక్షన్: కృష్ణవంశీ
తారాగణం: సందీప్‌కిషన్‌, సాయిధరమ్ తేజ్‌, రెజీనా, ప్రగ్యా జైశ్వాల్‌, తనీష్‌, తులసి, ప్రకాష్‌రాజ్, జె.డి.చక్రవర్తి, రఘుబాబు, బ్రహ్మాజీ, శివాజీరాజా, వైవా హర్ష...
పరిచయం: ఫాంలో ఉన్నాడాలేదా అన్నది పక్కనపెట్టి కృష్ణవంశీ సినిమా అంటే ఆసక్తిగా ఎదురు చూసే తెలుగు ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. ఏడాదికో రెండేళ్లకోసినిమా చేసే దర్శకుడు కృష్ణ వంశీ తాజా సినిమా 'నక్షత్రం' ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలువలు.. సాంకేతికత.. సృజనాత్మకతకు పెద్దపీట వేసే ఈ డైరెక్టర్ తాజా సినిమాలో సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్..ఇలా అంతా ప్రేక్షకులకు బాగా పరిచయమైన వాళ్లే నటించారు. ఇంతకీ ఈ సినిమా వెండితెరమీద వర్కౌట్ అయిందో లేదో ఓ లుక్కేద్దాం..

కథ: తమ ఫ్యామిలీలో మూడుతరాలుగా పోలీస్ ఉద్యోగాలు చేస్తుండటంతో రామారావు (సందీప్‌కిషన్‌)కి ఆ డిపార్ట్‌మెంట్ అంటే ఎంతో ఇష్టం. తాను కూడా పోలీస్ అవ్వాలని ఎంతో కష్టపడి ఎగ్జామ్ కు రెడీ అవుతాడు. ఎస్ఐ కావడం దాదాపు ఖాయమైన సందర్భంలో కమిషనర్ రామబ్రహ్మం కొడుకు రాహుల్ (తనీష్‌)తో జరిగిన గొడవ అతని జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. కక్షపెంచుకుని రామారావుకి ఉద్యోగం రాకుండా అడ్డుకుంటాడు రాహుల్. అయితే, తన ప్రియుడు ఎస్సై కావడం ఖాయమనుకొని ప్రియురాలు (రెజీనా) పోలీసు డ్రెస్ రామారావుకి గిఫ్ట్ గా ఇస్తుంది. ఉద్యోగం రాకపోయినా అదే డ్రెస్ తో అనధికారికంగా పోలీస్ డ్యూటీ చేయాలని నిర్ణయించుకొంటాడు రామారావు. ఈ క్రమంలో అలెగ్జాండర్ (సాయిధరమ్ తేజ్‌) పేరుతో ఉన్నపోలీస్‌ యూనిఫాంతో కిరణ్‌రెడ్డి (ప్రగ్యాజైశ్వాల్‌)కి కనిపిస్తాడు రామారావు. యూనిఫాంపై అలెగ్జాండర్ పేరును చూసిన ఆమె రామారావుని తీసుకెళ్లి పోలీసు కమిషనర్‌కి అప్పగిస్తుంది. ఇంతకీ అలెగ్జాండర్ ఎవరు అతడ్ని పోలీసులు ఎందుకు వెతుకుతారు? కిరణ్ రెడ్డికీ అలెగ్జాండర్ కు ఏంటి సంబంధం, రామారావు పోలీస్ కల నెరవేరుతుందా? రెజీనా ప్రేమ ఫలిస్తుందా..? వీటికి సమాధానమే ఈ నక్షత్రం.

విశ్లేషణ : డైరెక్టర్ కృష్ణవంశీ సహా ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ కెరీర్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఈ మూవీ. అలాంటి సినిమాకు పాతచింతకాయపచ్చడిలాంటి కథను తీసుకున్నారు. పోనీ కథనాన్ని ఆసక్తికరంగా దర్శకుడు నడిపించగలిగాడా అంటే అదీ లేదు. ఫస్టాఫ్ పూర్తయినా అసలు కథే స్టార్ట్ కాదు. పైగా మొదటి పార్ట్ లో చాలా అనవసర సన్నివేశాలు. ఇక పోనీ సెంకండ్ పార్ట్ అయినా హుషారుగా సాగుతుందా అంటే.. నత్తనడకే. దీంతో కొందరు ప్రేక్షకుల్లో తీవ్ర అసహనం కనిపించింది. ఇక నటీనటుల్లో హీరో సందీప్ కిషన్ మాస్ కుర్రాడిగానూ.. ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. నెగెటివ్ రోల్ లో తనీష్ బాగా చేశాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ టైం తక్కువే అయినా.. తనదైన స్టైలో మెప్పించే ఒక్క మెరుపు మెరిసి మాయమౌతాడు. రెజీనా పాత్ర కేవలం గ్లామర్ షోకే పరిమితం కాగా.. ప్రగ్యా జైస్వాల్ కి మాత్రం హీరో స్థాయి దొరికింది. గ్లామర్ తో పాటు యాక్షన్స్ సీన్స్ తోనూ రెచ్చిపోయింది. పోలీస్ పాత్రలో ప్రకాష్ రాజ్ బాగా మెప్పించగా.. జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, బ్రహ్మాజీ లు ఓకే అనిపించారు. సాంకేతికంగా సినిమాకి పూర్తి మార్కులు వేయాల్సిందే. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే, డైరెక్టర్ కృష్ణవంశీ గతంలో చేసిన సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తే మాత్రం పూర్తి నిరాశ ఎదురవ్వకమానదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com