Maa Gulf
దుబాయ్‌ తెలుగువారి సదస్సులో చంద్రబాబు, ప్రవాసాంధ్రులకు పలు వరాలు

దుబాయ్‌: ఏపీలో వ్యాపారాలు చేసే ఎన్‌ఆర్‌ఐలకు సహకరిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. వ్యాపార అనుకూలత రాష్ట్రాల్లో ఏపీకి నెం.1 ర్యాంక్ సాధించిదని ఆయన చెప్పారు. దుబాయ్‌లో తెలుగువారి సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములయ్యే వారికి ఏపీఎన్‌ఆర్‌టీ మార్గదర్శనమన్నారు. ప్రవాస ఆంధ్రుల సంక్షేమానికి రూ.40 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు మైగ్రెంట్ ఎకనమిక్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. దుబాయ్ కంటే విశాఖ బాగుందన్న ప్రశంసలు వినిపించాయని చెప్పారు. విభజన తర్వాత ఏడాదిలో మిగులు విద్యుదుత్పత్తి సాధించామని, రాజకీయంగా నూటికి 80% టీడీపీనే ఉండాలని, తాను ఏ పని చేసినా ప్రజల్లో ఆనందం చూస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ప్రవాసాంధ్రులు సొంత గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. డబ్బులు ఇవ్వమని అడగడం లేదని, మంచి సలహాలు ఇవ్వాలని కోరారు. సీఎం గల్ఫ్‌లో ఏపీ ఎన్‌ఆర్టీ సమన్వయకర్తల భేటీలో చంద్రబాబు పాల్గొన్నారు. సమన్వయకర్తలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. గ్రామాభివృద్ధికి సాంకేతికత, ఉత్తమ పద్ధతులను తీసుకురావాలని, నిధుల కంటే ఆలోచనలు అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు. గ్రామాభివృద్ధికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ సదస్సులో కువైట్, బహ్రెయిన్, సౌదీ APNRT కో-ఆర్డినేటర్స్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో  APNRI మంత్రి  కొల్లు రవీంద్ర, మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ,ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు,మీడియా అడ్వైసర్ పరకాల ప్రభాకర్,APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు తదితరులు పాల్గొన్నారు.