'బాలకృష్ణుడు' మూవీ రివ్యూ

- November 24, 2017 , by Maagulf
'బాలకృష్ణుడు' మూవీ రివ్యూ

తారాగణం: నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, కోటా శ్రీనివాసరావ్, అజయ్, శివ ప్రసాద్, 30ఇయర్స్ పృధ్వీ, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ఆదిత్య మీనన్, రఘు బాబు, రవి వర్మ, తేజస్వి, సన, సత్యకృష్ణన్, తదితరులు

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావ్
సినిమాటోగ్రఫీ:వి జయ్ సి.కుమార్
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు :మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి
దర్శకత్వం :పవన్ మల్లెల 

వైవిధ్యమైన కథలతో ఓ సెపరేట్ ట్రాక్ లో వెళ్లే నారా రోహిత్ ఫస్ట్ టైం ఫ్యాక్షన్ జానర్ లోకి వచ్చాడు. స్లిమ్ లుక్ లో బాలకృష్ణుడుగా మారాడు. నాకు ఫ్యాక్షన్ మూవీ కూడా ఓ ప్రయోగం లాంటిదే, ఇంతవరకు ఇలాంటి సినిమాలు చెయ్యని నాకు బాలకృష్ణుడు ఓ కొత్త జానర్ సినిమానే అని చెబుతూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి టాలీవుడ్ లో ఒకప్పుడు సక్సెస్ ఫార్ములాగా నిలిచిన ఫ్యాక్షన్ స్టోరీతో నారా రోహిత్ ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో చూద్దాం

కథ:
కక్ష్యలు, పగప్రతీకారాలు, కరువుతో తల్లడిల్లిపోతున్న ఉయ్యాలవాడ ప్రాంతాన్ని అభివృద్దిలోకి తీసుకెళ్లాలని, ప్రజలను చైతన్యపరచాలని స్కూల్లు, కాలేజీలు, పరిశ్రమలు స్థాపించాలనుకుంటారు (ఆదిత్య మీనన్)రవిందర్ రెడ్డి అతని చెల్లెలు భానుమతి దేవి(రమ్యకృష్ణ). అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజాలను దోచుకోవాలని, జనాలను బానిసలుగా వాడుకోవాలనుకునే ప్రతాప్ రెడ్డి(అజయ్) అతని తండ్రికి ఈ పనులు అడ్డుతగులుతుంటాయి. దీంతో రాజకీయపలుకుబడితో రవీందర్ రెడ్డిని దెబ్బతియ్యాలనుకుంటాడు ప్రతాప్ రెడ్డి. ఈ క్రమంలో ప్రతాప్ రెడ్డి తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. తన తండ్రి చావుకు కారణం అయిన రవీందర్ రెడ్డిని చంపి ప్రతాప్ రెడ్డి జైలుకెళతాడు. ఈలోపు భానుమతి తన అన్నయ్యను చంపిన ప్రతాప్ రెడ్డి మనుషులను అంతం చేసి కర్నూల్ లో సూపర్ పవర్ గా ఎదుగుతుంది. ఆ పవర్ ను దెబ్బతియ్యడానికి భానుమతి మేనకోడలు ఆద్య(రెజీనా) ను చంపెయ్యాలనుకుంటాడు ప్రతాప్. ఈ మధ్యలో బాలు(నారా రోహిత్) ఎంటరై ప్రతాప్ ప్లాన్స్ కు అడ్డుపడి ఆద్యను కాపాడుతుంటాడు. మరి ఆద్యకు బాలుకు సంబంధం ఏంటి? బాలు ఆద్య కోసం ఫ్యాక్షన్ గొడవలోకి ఎందుకు ఎంటర్ అవుతాడు? అనేది మిగిలిన కథ

విశ్లేషణ:
టాలీవుడ్ లో ఇప్పటికీ బోల్డన్ని ఫ్యాక్షన్ స్టోరీస్ వచ్చాయి. ఆ ఫ్యాక్షన్ కథలపై స్ఫూఫ్స్ కూడా వచ్చాయి. ఇక అదే జానర్ లో సినిమా అంటే కొత్తగా ఉంటుందనే ఆలోచనలు రావు గానీ, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఉంటుంది. ఆ క్యూరియాసిటీకి ఎంటర్టైన్మెంట్ కోటింగ్ ఇచ్చి బాలకృష్ణుడుని ఫ్యాక్షన్ కమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు దర్శకుడు పవన్ మల్లెల. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లో ఉండే ఫార్ములాస్ ను మిస్ కానివ్వకుండా హీరో ఇంట్రడక్షన్, ఫైట్స్, సాంగ్స్, కామెడీ, అన్ని ట్రాక్స్ నింపేశాడు. హీరోయిక్ ఫార్ములాను హైలెట్ చేస్తూ బాలకృష్ణుడును రెగ్యులర్ ట్రాక్ ఎక్కించాడు. ఇక ఈ ట్రాక్ లో నారా రోహిత్ కూడా కమర్షియల్ హీరోగా అలరించడానికి బాగానే ట్రై చేశాడు. సన్నబడి న్యూ మేకోవర్ తో కొత్త లుక్ లో కనిపించాడు. డబ్బులు ఇస్తే చాలు, ఎంతటి రిస్క్ అయినా చెయ్యడానికి వెనకాడని బాలు పాత్రను బాగానే చేశాడు. ఇప్పటివరకు తనపై ఉన్న సీరియస్ ఇమేజ్ ను చెరిపేసుకోవడానికి కమర్షియల్ వాల్యూస్ ఉన్న పాత్రగా మారాడు. ఫైట్లు, కామెడీ ట్రాక్స్ లో చాలా ఈజ్ గా చేశాడు. అయితే వైవిధ్యమైన పాత్రలతో ఎప్పుడూ సర్ ప్రైజ్ చేసే రోహిత్ కు ఈ బాలు క్యారెక్టర్ అంత స్పెషల్ గా నిలవదనే చెప్పాలి. ఇక సెక్యూరిటీ మధ్య పెరిగి స్వేచ్చ కోరుకునే ఆద్య పాత్రలో రెజీనా చాలా గ్లామర్ గా కనిపించింది. పాటలు, సీన్స్ లో స్కిన్ షోతో అలరించింది. రమ్యకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కు కేరాఫ్ గా నిలుస్తోన్న టైంలో ఫ్యాక్షన్ లీడర్ భానుమతి పాత్రలో ఆ ఈజ్ చూపించింది. అయితే ఆ క్యారెక్టర్ లో రమ్యకృష్ణకు పెద్దగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ లేదు. అయినా బాగానే చేసింది. రెండు రాష్ట్రాలను గడగడలాడించే పవర్ ఉన్న, ఇంట గెలవలేని ప్రతాప్ రెడ్డి పాత్రకు అజయ్ బాగానే సరిపోయాడు. అయితే హీరోయిజం ఫార్ములాలో విలన్ ను స్ట్రాంగ్ గా చూపించడంలో దర్శకుడు అంత శ్రద్ద తీసుకోలేదు. దీంతో అజయ్ పెర్ఫామెన్స్ కు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ఇక సినిమాకు హైలెట్ గా ఫ్యాక్షన్ స్టోరీలో కామెడీని హైలెట్ చేసింది మాత్రం 30ఇయర్స్ పృధ్వియే. నేషనల్ జియాగ్రఫీ ఫోటో గ్రాఫర్ మాధవరావ్ అలియాస్ మాడీ ఆర్ గా కామెడీ ట్రాక్ నడిపించాడు. ఫైట్స్, పాటల మధ్య తన కామెడీతో ప్రేక్షకుల మూడ్ చేంజర్ గా మారాడు. అజయ్ తో ఉండే సీన్స్ లో అయితే పృధ్వీ కామెడీ హైలెట్ అనే చెప్పాలి. ఇక ఆ కామెడీని చిట్టిబాబు డ్రామా కంపెనీతో బాగానే కంటిన్యూ చేశాడు శ్రీనివాసరెడ్డి. తన స్టైలాఫ్ డైలాగ్స్ తో నవ్వించాడు. ఇక పెయింటర్ గా వెన్నెల కిశోర్ కామెడీ కూడా అలరించింది. అయితే మణిశర్మ అందించిన పాటలు సినిమాలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంలో సక్సెస్ కాలేదు. సినిమాను రిచ్ గా చూపించడంలో కెమెరా మెన్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. టాప్ కమెడియన్స్, స్టార్ ఆర్టిస్టులు ఉన్నా, సినిమా కామెడీతో రన్ అవుతోన్నా, ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ మాత్రం ప్రేక్షకుడిని వెంటాడుతుంది. కంటెంట్ గ్రిప్పింగ్ గా లేకపోవడం, మేకింగ్ లో దర్శకుడు తడబడడం, కథనాన్ని సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల కావొచ్చు బాలకృష్ణుడు రెగ్యులర్ యాక్షన్ స్టోరీయే అనే భావన కలిగిస్తుంది. అయితే పాటలు, ఫైట్లు, కామెడీ ఉన్న మాస్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు బాలకృష్ణుడు ఓకే అనిపిస్తాడు.

ఫైనల్ గా: రొటీన్ ఫ్యాక్షన్ ఫార్ములాను దాటలేకపోయిన బాలకృష్ణుడు  

----మాగల్ఫ్ రేటింగ్: 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com