'మిషన్‌ పూర్తయింది' అన్న ట్రంప్‌ ప్రకటనపై సర్వత్రా సందేహాలు

'మిషన్‌ పూర్తయింది' అన్న ట్రంప్‌ ప్రకటనపై సర్వత్రా సందేహాలు

న్యూయార్క్‌ : సిరియాపై తాజా దాడుల ఫలితాల్ని అమెరికా ప్రజలకు తెలియజేస్తూ అధ్య క్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన 'మిషన్‌ పూర్తయింది' (లక్ష్యం నెరవేర్చాం). మరి...సిరియాలో అమెరికా ప్రత్యేక మిషన్‌ ఏంటి ? పూర్తిచేసింది ఏంటి ? అన్న సందేహాల్ని అక్కడి రక్షణరంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇరాక్‌ యుద్ధం సంద ర్భంగా 2003లో అప్పటి అధ్యక్షుడు బుష్‌ కూడా ఇలాగే 'మిషన్‌ పూర్తయింది' అన్న ప్రకటన చేశారు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను గద్దె దించటమే లక్ష్యం గా అమెరికా, బ్రిటన్‌లు కలిసి ఎన్నో కుట్రలు పన్నా యి. ఇరాక్‌పై తమ నియంత్రణ కోసం అక్కడి పాలకుడ్ని నియంతగా, క్రూరుడిగా చిత్రీకరించాయి. ఇరాక్‌పై తమ దాడుల్ని ప్రపంచ దేశాలు వ్యతిరేకిం చకుండా అనేక కట్టుకథల్ని ప్రచారం చేశాయి. 

అదే వ్యూహాన్ని నేడు సిరియాలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు సంయుక్తంగా అమలుజేస్తు న్నాయి. సద్దాం హుస్సేన్‌ను అధికారంలోని దించేశాక, ఇరాక్‌లో ఏం జరిగిందో? నేడు ఏం జరుగుతుందో? అందరికీ తెలుసు. రాజకీయ అస్థిర తతో ఇరాక్‌ నేడు కొట్టుమిట్టాడుతోంది. అనేక రాజకీ య గ్రూపుల మధ్య అధికారం కోసం పోరాటం నడు స్తోంది. ఈ గ్రూపులో కొన్నిపక్షాలు తీవ్రవాదులతో, తిరుగుబాటు గ్రూపులతో చేతులు కలిపాయి. 

కొన్ని ప్రాంతాల్ని తమ ఆధీనంలో ఉంచుకొని పాలన సాగిస్తున్నాయి. మరోవైపు అమెరికా, దాని మిత్ర దేశాల బలగాలు వివిధ నగరాల్ని స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్‌లో ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో ఇరాక్‌లో అమెరికా జోక్యం విఫలమైందని తేలిపోయింది. బుష్‌ చేసిన ప్రకటన 'మిషన్‌ ఎకాంప్లీష్డ్‌' అన్నదానిని అమెరికా పత్రికలు, రాజకీయ నాయుకులు 'విఫలం చెందిందన్న దానికి పర్యాయ పదం'గా వాడుతున్నారు. 

ఇప్పుడు సిరియా అంతర్యుద్ధం నేపథ్యంలో మళ్లీ అదే పదాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాడటంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇది కూడా మరో ఇరాక్‌గా మారుతుందని ట్రంప్‌ చెప్పటమేనని కొంతమంది విశ్లేషించారు. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం, వివిధ రకాల వివాదాలు చుట్టుముట్టడం వంటివి ట్రంప్‌ను ఇబ్బంది పెడుతున్నాయని, ఈ నేపథ్యంలో అమెరికా ప్రజల దృష్టిని మరల్చే అంశంగా 'సిరియా'ను వాడుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Back to Top