మేక్‌ ఇన్‌ ఇండియాకు బలమైన మద్దతుదారు స్వీడన్‌

- April 17, 2018 , by Maagulf
మేక్‌ ఇన్‌ ఇండియాకు బలమైన మద్దతుదారు స్వీడన్‌

మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి స్వీడన్‌ తొలి నుంచి బలీయమైన మద్దతుదారుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తెలిపారు. స్వీడన్‌ ప్రధాన మంత్రి లోఫ్వీన్‌ మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో 2016లోనే చేరారని ఆయన చెప్పారు. స్టాకహేోంలో మంగళవారం మధ్యాహ్నం స్వీడన్‌ ప్రధాన మంత్రి స్టెఫాన్‌ లోఫ్వీన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో మోడీ పైవిషయాలు చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం మేరకు ఇద్దరు నేతలు కూడా ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై పరస్పర అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు. ప్రధాన మంత్రులు ఇద్దరూ వాణిజ్య ప్రముఖులతో సమావేశమై చర్చించారు. 
''భారత్‌ అభివృద్ధి నుండి ఉత్పన్నమయ్యే అవకాశాలపై స్వీడన్‌ ఎలా గెలువు గెలిపించు భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలన్నది ఈ రోజు జరిగిన చర్చల్లో ప్రధానాంశమని భావిస్తున్నాను. దీని ఫలితంగా ఆవిష్కరణలలో భాగస్వామ్యం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై ఒక అంగీకారానికి రాగలిగాము'' అని మోడీ అన్నారు. 
భారత్‌, స్వీడన్‌ల మధ్య సహకారంలో ఆవిష్కరణలు, పెట్టుబడులు, స్టార్ట్‌అప్‌లు తయారీ తదితర అంశాలు కీలకంగా ఉన్నాయని ఆయన చెప్పారు. వీటితో పాటు పునర్వినియోగ ఇంధనం, పట్టణ రవాణా, వృధా నిర్వహణ వంటి భారత దేశ ప్రజల నాణ్యమైన జీవనంతో సంబంధమున్న అంశాలపై కూడా సహకారంపై చర్చించుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు రక్షణ, భద్రత సహకారాలను కూడా బలోపేతం చేసుకునేందుకు ఇరువురం అంగీకారానికి వచ్చామని చెప్పారు. 
ఈ సందర్భంగా స్వీడన్‌ ప్రధాన మంత్రి లోప్వీన్‌ మాట్లాడుతూ ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టిన భారత ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. భారత్‌ తీసుకుంటున్న చర్యలు దేశ పురోగతికి, సమున్నతికి కీలకమవుతాయన్నారు. ఆవిష్కరణల భాగస్వామ్యంపై ఆయన మాట్లాడుతూ భారత్‌తో కలిసి స్మార్ట్‌ సిటీల ప్రాజెక్టు కోసం దాదాపు రూ.40 కోట్లను ఆవిష్కరణల కార్పొరేషన్‌ కోసం పెట్టుబడులు పెడతామన్నారు. దీని వల్ల ఉపాథి అవకాశాలు కూడా సృష్టించబడతాయన్నారు. ఈ సందర్భంగా స్ధిరమైన భవిష్యత్‌ను కాంక్షిస్తూ స్వీడన్‌-భారత్‌ ఆవిష్కరణల భాగస్వామ్యంపై ఉమ్మడి ప్రకటన చేశారు. అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనలో భాగంగా తొలుత స్వీడన్‌ చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com