సాంప్రదాయాలను గౌరవించాల్సిందే...రజినీకాంత్

- October 20, 2018 , by Maagulf
సాంప్రదాయాలను గౌరవించాల్సిందే...రజినీకాంత్

చెన్నై: అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీనటుడు రజినీకాంత్ ఈ విషయంపై స్పందించారు.

శబరిమల ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను గౌరవించాలని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెబుతూనే... శబరిమల ఆలయం మతపరమైన విశ్వాసాలతో ముడిపడిందని, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆచార, సాంప్రదాయాలను గౌరవించాల్సిందేనని అన్నారు.

తాను నటిస్తున్న 'పేట్టా' చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో రజనీకాంత్ లక్నో నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు అవసరం లేదన్నారు. అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ఆచారం ఏళ్లుగా ఉంటోందని, ఇది నమ్మకానికి సంబంధించిన వ్యవహారమన్నారు. ఈ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు.
 
అటు దేశాన్ని కుదిపేస్తున్న మీటూ వివాదంపైనా రజనీకాంత్ స్పందించారు. 'మీటూ' ఉద్యమంతో మహిళలకు మేలు జరుగుతుందన్నారు. అయితే దీన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. సరైన రీతిలో మీటూను బాధిత మహిళలు వినియోగించుకోవాలన్నారు.
 
ఈ ఏడాది డిసెంబర్ 12వ, తేదీన పార్టీ, ఎజెండాను ప్రకటిస్తానని తాను చెప్పలేదని తమిళ రజనీకాంత్ స్పష్టం చేశారు. తాను పార్టీ ప్రకటనపై ఏ తేదీని నిర్ణయించుకోలేదని తెలిపారు. అయితే పార్టీకి సంబంధించిన 90శాతం పనులు పూర్తయ్యాయని రజినీకాంత్ తెలిపారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను వైరముత్తు తోసిపుచ్చారని.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కూడా వైరముత్తు చెప్పారని రజినీకాంత్ గుర్తుచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com