చంద్రుడిపై చైనా అద్భుతం.. మొలకెత్తిన పత్తి విత్తనం!

- January 16, 2019 , by Maagulf
చంద్రుడిపై చైనా అద్భుతం.. మొలకెత్తిన పత్తి విత్తనం!

బీజింగ్: చంద్రుడిపై పత్తి విత్తనం మొలకెత్తింది. ఇటీవల చైనా పంపిన చేంజ్‌-4 ప్రోబ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. చేంజ్‌4 పంపిన చిత్రాల ఆధారంగా చైనా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి శాస్త్రవేత్తలు పలు రకాల విత్తనాలను చంద్రుడి మీదకు తీసుకువెళ్లారు. కానీ వాటిలో పత్తి విత్తనం ఒక్కటే మొలిచినట్లు చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈనెల 3వ తేదీన చంద్రుడి చీకటి ప్రదేశంలో చేంజ్‌4 ప్రోబ్ దిగింది. చంద్రుడి ఆవలి వైపుకు ఓ రోవర్ వెళ్లడం కూడా ఇదే మొదటిసారి. అయితే ఈ రోవర్‌పై పత్తితో పాటు ఆయిల్‌సీడ్ రేప్‌, పొటాటో, ఆరాబిడోప్‌సిస్ విత్తనాలను కూడా పంపించారు. సౌత్‌వెస్ట్ చైనాలోని చాంగ్‌కింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విత్తనాలను ఆ ప్రోబ్‌లో పొందుపరిచారు. గతంలో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలో మొక్కలు మొలిచాయి. కానీ చంద్రుడి మీద ఓ విత్తనం మొలకెత్తడం ఇదే ప్రథమం. ఇక నుంచి ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోనే తమ ఆహారాన్ని పండిస్తారని, తిండి కోసం వాళ్లు తిరిగి భూమికి రావాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పంటలతో చంద్రుడిపై జీవానుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్న విషయం తెలిసిందే. 18 సెంటీమీటర్ల క్యాన్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com