హై స్పీడ్‌ రైళ్ళలో చైనా ప్రపంచ రికార్డు

- May 13, 2019 , by Maagulf
హై స్పీడ్‌ రైళ్ళలో చైనా ప్రపంచ రికార్డు

బీజింగ్‌ : చైనా హై స్పీడ్‌ రైల్వేస్‌ వెయ్యి కోట్ల మంది ప్రయాణీకులను గమ్య స్ధానాలకు చేరవేయడంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికం ముగిసే నాటికి వెయ్యి కోట్ల మందికి పైగా (10 బిలియన్లు) ప్రయాణీకులను చేరవేసిందని చైనా రైల్వేస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది మార్చి మాసాంతానికి 3.34 లక్షల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయని ఆ ప్రకటనలో తెలిపింది. 2018 నాటికి చైనాలో దాదాపు 30 వేల కిలోమీటర్ల హై స్పీడ్‌ రైల్వే ట్రాక్‌ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హై స్పీడ్‌ రైల్వే ట్రాక్‌ మొత్తాన్ని కలిపితే దానికి రెండింతలు చైనాలో ఉన్నట్లు ఆ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. చైనాలో హై స్పీడ్‌ రైలు అత్యంత ప్రజాదరణ పొందిన రైలుప్ర యాణం. 2018లో 2 బిలియన్లకు పైగా హైస్పీడ్‌ ట్రిప్పులను నిర్వహించి రికార్డు సాధించినట్లు తెలిపారు. రైల్వేలలో ప్రయాణించే వారి సంఖ్య ప్రతి ఏడాది 17 శాతం పైగా పెరుగుతోంది. మొత్తం రైల్వే ప్రయాణీకుల్లో వీరి వాటా 3/5గా ఉంది.

ప్రయాణీకులను చేరవేయడంలోనూ, రైలు చార్జీలలోనూ, రవాణా సాంద్రతలోనూ, రవాణాకు సంబంధించిన ఇతర ప్రధాన ఆర్థిక విషయాలలోనూ చైనా రైల్వేలు ప్రపంచంలోనే తొలి స్ధానాన్ని సాధించాయని చైనా రైల్వే ఆ ప్రకటనలో పేర్కొంది. 2008లో చైనా తొలిసారిగా బీజిగ్‌-టియాన్‌జిన్‌ ఇంటర్‌సిటి రైల్వే మార్గాన్ని ప్రారంభించిన నాటి నుండి ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా ఉన్నట్లు తెలిపింది. 2017 నుండి చైనాలో అమలులోకి వచ్చిన ఫక్సింగ్‌ బుల్లెట్‌ రైళ్ళు సగటున 75 శాతం ప్రయాణీకులతో 200 మిలియన్‌ ప్రయాణీకులను చేరవేశాయి. ఇది ఇతర హైస్పీడ్‌ రైళ్ళకన్నా 1.3 శాతం అధికమని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరాంతానికి దాదాపు 850 ఫక్సింగ్‌ హై స్పీడ్‌ రైళ్ళను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com