టాలీవుడ్ డ్రగ్స్ కేసులో..

- May 14, 2019 , by Maagulf
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో..

టాలీవుడ్ డ్రగ్స్ కేసు అటకెక్కినట్టే కనిపిస్తోంది. రెండేళ్లకిందట 3 నెలలపాటు వరసపెట్టి సినీ ప్రముఖులు, VIPల పిల్లలను ప్రశ్నించిన సిట్.. చివరికి వాళ్లందరికీ క్లీన్‌చిట్ ఇచ్చేసినట్టు కనిపిస్తోంది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేసిన దర్యాప్తు బృందం.. ఇప్పటికే నాలుగు చార్జీషీట్లు దాఖలు చేసింది. మొత్తం 62 మందిని విచారించారు ఎక్సైజ్‌ పోలీసులు. వీళ్లలో 12 మంది సినీ ప్రముఖులు ఉంటే.. 50 మంది VIPల పిల్లలు, కార్పొరేట్ స్కూల్స్‌ విద్యార్థులు ఉన్నారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ల గోళ్లు, వెంట్రుకల నమూనాలను సిట్ సేకరించింది. కొందరి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. వాళ్లంతా మాదకద్రవ్యాలు తీసుకున్నారో లేదో నిర్థారించుకునేందుకు ల్యాబ్ టెస్ట్‌లకు కూడా పంపారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులు నమోదవగా.. ఇప్పటికే 4 ఛార్జ్‌షీట్స్ దాఖలయ్యాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ఇప్పుడీ విషయం వెలుగుచూసింది. కానీ ఎక్కడా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖుల పేర్లు లేకపోవడం విశేషం.

సిట్ దాఖలు చేసిన 4 ఛార్జ్‌షీట్లలో టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లను ఎక్కడా చేర్చలేదు. అలాగే వాళ్ల విచారణకు సంబంధించిన అంశాలపై నివేదికను కూడా కోర్టుకు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే డ్రగ్స్ కేసుపై తమకు అనుమానాలు వస్తున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ అంటోంది. విచారణ పారదర్శంగా జరపాలని, వాస్తవాలన్నీ బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్ల కిందటి డ్రగ్స్ కేసు విచారణ ఎంత వరకూ వచ్చిందో చెప్పాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి RTI ద్వారా అర్జీ పెట్టారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి. ఆయనకు సమాధానంగా ఇచ్చిన డాక్యుమెంట్లతో ఇప్పుడీ విషయమంతా వెలుగు చూసింది. సినీ ప్రముఖులంతా విచారణకు హాజరయ్యారని వారి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారని చెప్తూనే ఈ కేసులో ఇంకా దర్యాప్తు సాగుతోందని చెప్పడంపై పద్మనాభరెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సిట్ ఛార్జ్‌షీట్‌లో సౌతాఫ్రికాకు చెందిన రఫెల్ అలెక్స్‌ విక్టర్‌ పేరు ప్రస్తావించారు. అతను ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్ తీసుకొచ్చి విక్రయిస్తున్నాడని 2017లో అరెస్టు చేశారు. అలాగే.. రొన్సన్ జోసెఫ్ అనే వ్యక్తిని కూడా 2017 జులైలో అరెస్టు చేశారు. గంజాయి అమ్ముతున్నాడన్న కారణంగా NDPS యాక్ట్ కింద అతనిపై అభియోగాలు మోపారు. వీళ్లు తప్ప.. డ్రగ్స్ విచారణ ఎదుర్కొన్న 62 మందిలో ఏ ఒక్కరిపేరు ఇప్పుడు ఛార్జ్‌షీట్‌లో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

టాలీవుడ్ ప్రముఖుల్లో.. పూరీజగన్నాథ్‌, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్నా, ఛార్మి కౌర్, ముమైత్ ఖాన్, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, తనీష్‌, నందులను సిట్ ఎంక్వైరీకి పిలిచింది. పార్టీల్లో డ్రగ్స్ వాడినట్టు తమకు ప్రాధమిక సమాచారం ఉందని పేర్కొంటూ వారికి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేశారు. ఇలా విచారణకు హాజరైన వాళ్లలో కొందరు సిట్ కోరిన శాంపిల్స్ ఇచ్చారు. మరికొందరు నిరాకరించారు. అప్పట్లో వరుసగా పలువురు డ్రగ్ పెడ్లర్లు కూడా అరెస్టవ్వడంతో వాళ్ల కాల్‌డేటా ఆధారంగా లోతైన దర్యాప్తు చేశారు. కెల్విన్ సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరిపైన సమగ్ర దర్యాప్తు చేశారు. ఐతే.. సిట్ విచారించిన 62 మంది పేర్లు ఛార్జ్‌షీట్‌లో లేకపోవడం చూస్తుంటే.. ఈ కేసు కథ కంచికి చేరినట్టే కనిపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com