నల్లమలను కాపాడుకునేందుకు నడుంబిగించిన టాలీవుడ్

- September 15, 2019 , by Maagulf
నల్లమలను కాపాడుకునేందుకు నడుంబిగించిన టాలీవుడ్

సేవ్‌ నల్లమల. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నినాదం. నల్లమలను కాపాడాలంటూ పలువురు సోషల్ మీడియాలో విస్తృతంగా కాంపెయిన్ నిర్వహిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మొదలైన సేవ్‌ నల్లమల ఉద్యమానికి టాలీవుడ్‌ ఇండస్ట్రీ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. నల్లమల అడవులను కాపాడాలని ఒక్కొక్కరుగా మద్దతిస్తూ.. అభిమానులకు పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని గట్టిగా వినిపిస్తున్నారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నుంచి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. యురేనియం తవ్వకాలతో ప్రకృతి నాశనం అవుతుందని.. తెలుగు రాష్ట్రాలకు ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేవ్‌ నల్లమలకు మద్దతుగా పవన్‌ కల్యాణ్‌, విజయ్‌ దేవరకొండ, శేఖర్‌ కమ్ముల,  ట్వీట్‌ చేయగా.. ఈ జాబితాలో మరికొంత మంది సెలబ్రిటీస్ చేరారు. తాజాగా అక్కినేని సమంత కూడా యురేనియం తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. యురేనియం తవ్వకాల నుంచి నల్లమలను కాపాడాలంటూ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు ట్వీట్‌ చేశారు. అలాగే నల్లమలలో యురేనియం తవ్వకాలపై ఆవేదన వ్యక్తం చేశారు నటుడు సాయి ధరం తేజ్‌. ఎక్కడో ఉన్న అమెజాన్‌ అడవుల గురించి మనం బాధపడుతున్నామని.. అలాంటిది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామని ప్రశ్నించారు. మన నల్లమలను కాపాడుకుందాం రండి అంటూ సాయిధరం తేజ్‌ పిలుపునిచ్చారు. యాంకర్‌ అనసూయ, హీరో వరుణ్‌ తేజ్‌ కూడా సేవ్‌ నల్లమల ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ ఉద్యమానికి టాలీవుడ్ నుంచే కాదు ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. తాజాగా నటుడు రణదీప్ హుడా సైతం…ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేసి నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపాడు.

అటు ఐటీ మంత్రి కేటీఆర్ కూడా యురేనియం తవ్వకాలపై సానుకూలంగా స్పందించారు. యురేనియంపై ప్రజల ఆవేదనను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు కేటీఆర్‌. మరోవైపు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రత్యక్ష ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నాయి. రేపు 11 గంటలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి ఫోన్‌ చేసిన పవన్‌ కల్యాణ్‌… రేపటి అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వానించారు. అయితే రాజకీయంగా యురేనియం తవ్వకాల ఉద్యమం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com