సింగపూర్ లో శోభాయమానంగా ఉగాది ప్రత్యేక పూజలు,శ్రీవారి కళ్యాణ మహోత్సవం
- April 04, 2025
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మరియు రాబోవు సంవత్సరమంతా అందరికీ మేలు జరగాలనే మహా సంకల్పంతో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ,తోమాలసేవ, అభిషేకం , సహస్ర నామార్చన మరియు విశేష పూజలతో పాటు మహాలక్ష్మి, విష్ణుదుర్గ అమ్మవార్లకు మరియు ఆంజనేయ స్వామికి అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంనందు మార్చి 30, 2025 ఆదివారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా, గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు.
ప్రత్యేక శ్రద్ధతో సింగపూర్ తెలుగు సమాజం శోభాయమానంగా ఏర్పాట్లు చేయగా భారీగా తరలివచ్చిన భక్తకోటి ఆ దేవదేవున్ని దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన తెలుగు సమాజానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు మరుసటి రోజే ఉగాది రావటం విశేషం.కళ్యాణోత్సవం తరవాత శ్రీవారు ఆస్ధానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ పఠనాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్న జంటలకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ- తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపి,ఈ సంవత్సరం అందరికీ మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు.సింగపూర్ తెలుగు సమాజం స్వర్ణోత్సవాలు మే 11 న జరుగనున్నట్లు ప్రకటించి, అందరి సహాయ సహకారాలు కోరారు.
కళ్యాణోత్సవం లో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంపిన తిరుమల లడ్డూ ప్రసాదం, తిరుమల కళ్యాణ తలంబ్రాలు, ఇతర మంగళ ద్రవ్యాలతో పాటుగా కార్యక్రమానికి గుర్తుగా ఒక జ్ఞాపికను అందచేసామని కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి తెలిపారు.
అలానే ఈ ఉగాది నాడు సింగపూర్ లోనే అరుదుగా లభించే వేప పువ్వు స్ధానిక తెలుగు వారికి ఉచితంగా అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి ని అందించామని, కార్యక్రమానికి హాజరైన వారికి అన్నప్రసాదాన్ని అందించామని, ఉదయం నుంచి సుమారు 5000 మంది భక్తులు ప్రత్యక్షంగా హాజరయ్యారని కార్యక్రమ నిర్వాహకులు తెలియచేసారు. స్ధానికులు కూడా ఉగాది పచ్చడిని సేవించి దాని విశిష్ఠతను తెలుసుకోవడం గమనార్హం.
కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గానికి, అర్చకులకు, దాతలకు, కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు,భక్తులకు, పంచాంగ పఠనం చేసిన పండితులకు, సేవాదళ సభ్యులకు, కార్యక్రమానికి హాజరైన మరియు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అందరికీ గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు.తెలుగు సమాజ కమిటీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.




తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







