చర్చానీయాంశంగా మారిన డోనాల్డ్ ట్రంప్​ ‘మూడోసారి’ ఎన్నిక

- April 07, 2025 , by Maagulf
చర్చానీయాంశంగా మారిన డోనాల్డ్ ట్రంప్​ ‘మూడోసారి’ ఎన్నిక

అమెరికా: అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా దీనిపై యూఎస్‌ అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ స్పందించారు.మూడోసారి పోటీ చేయడానికి అవసరమైన చట్టపరమైన మార్గాన్ని కనుక్కోవడం కష్టమేనన్నారు.

రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారా అవకాశాలు
“అధ్యక్షుడిగా ట్రంప్‌ను 20ఏళ్లపాటు కొనసాగించాలని కోరుకుంటున్నా. కానీ, ఈ పర్యాయం ముగిసిన తర్వాత ఆయనకు వేరే మార్గం లేదని అనుకుంటున్నా” అని యూఎస్‌ అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ పేర్కొన్నారు. ఫాక్స్‌న్యూస్‌తో మాట్లాడిన ఆమె, రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారా అవకాశాలున్నప్పటికీ అది చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. ట్రంప్‌ మూడోసారి ఎన్నిక అసాధ్యమేనంటూ అనేకమంది రాజ్యాంగ నిపుణులు చెబుతున్న వేళ ట్రంప్‌కు విధేయుల్లో ఒకరైన అటార్నీ జనరల్‌ ఇలా అనడం మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి
అమెరికా అధ్యక్షుడిగా తాను మూడోసారి బాధ్యతలు చేపట్టడాన్ని తోసిపుచ్చలేమని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల పేర్కొన్నారు. ఈ విషయంలో తాను జోక్‌ చేయడం లేదని తెలిపారు. ఇందుకోసం కొన్ని మార్గాలు ఉన్నాయని, అయితే వాటిపై ఇప్పుడు ఆలోచించడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. మరోవైపు, అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండొంతుల రాష్ట్రాలు అంగీకరించాలి.

మరోవైపు, దేశాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ నడిపిస్తున్న తీరు పై అమెరికా జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన తీరును నిరసిస్తూ దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. శనివారం న్యూయార్క్‌ నుంచి అలస్కా దాకా వీధుల్లో జనం పోటెత్తి ‘హ్యాండ్సాఫ్‌’ అంటూ నినదించారు. రిపబ్లికన్ల పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతి పెద్ద నిరసనగా ఇది నిలిచింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com