కన్నడ కంఠీరవుడు-డా.రాజ్ కుమార్
- April 12, 2025
భారత చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నారు కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్.కోట్లాది మంది అభిమానులు "డాక్టర్ రాజ్" లేదా "అన్నావ్రు" (అన్నగారు) అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర పరిశ్రమలో అర్థశతాబ్దం పాటు 200 పై చిలుకు సినిమాల్లో నటించారు.నేడు ఆయన వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
రాజ్ కుమార్ అసలు పేరు సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు. 1929, ఏప్రిల్ 24న అప్పటి మైసూరు రాజ్యంలోని గాజనూరులో కన్నడ కుటుంబంలో సింగనల్లూరు పుట్టస్వామయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు.ఈ గ్రామం ప్రస్తుతం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఒకటి. తల్లిదండ్రులిద్దరూ రంగస్థల నటులు కావడంతో నటన పట్ల ఆసక్తి కలిగి నాటకాలు వేయడం మొదలు పెట్టారు.
రాజ్ కుమార్ నాటక రంగం నుండి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి 1954లో వచ్చిన బెడర కన్నప్ప సినిమా ద్వారా పూర్తి స్థాయి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజ్‌కుమార్ అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు.రాజ్ కుమార్ కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలున్నప్పటికీ, బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధద గుడి, జీవన చైత్ర చిత్రాలు ఆయన సినీ కెరీర్‌లో మరపురానివిగా నిలిచాయి.
కన్నడ సీమలో కొందరు రంగస్థల నటులు రాజ్యమేలారు. రాజ్ కుమార్, కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్ ముగ్గురూ తరువాతి రోజుల్లో కన్నడ చిత్రసీమలో తమదైన బాణీ పలికించారు. ఈ ముగ్గురినీ ‘కన్నడ చిత్రసీమ త్రిమూర్తులు’ అని పిలిచేవారు. అయితే వారిలో అత్యధిక కాలం స్టార్ గా వెలుగొందింది మాత్రం రాజ్ కుమార్ అనే చెప్పాలి. తనను ‘కాళహస్తి మహాత్మ్యం’లో ఎంతగానో ఆదరించిన తెలుగువారంటే రాజ్ కుమార్‌కు ఎంతో అభిమానం. ఇక ఆయన ఇష్టదైవం తెలుగునేలపై కొలువైన మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి.
తెలుగునాట సూపర్ స్టార్స్‌గా వెలుగొందిన చిత్తూరు వి.నాగయ్య,ఎన్టీఆర్, ఏయన్నార్ అంటే రాజ్ కుమార్‌కు ఎంతో గౌరవం. వారిలో ముఖ్యంగా నటరత్న ఎన్టీఆర్ అంటే మరింత అభిమానం. అందుకు కారణం లేకపోలేదు – ఎన్టీఆర్ తెలుగులో నటించిన అనేక చిత్రాలు కన్నడలో రాజ్ కుమార్ హీరోగా రీమేక్ అయ్యాయి. అంతేకాదు, ఎన్టీఆర్ లాగా తానూ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో నటించి కన్నడ ప్రేక్షకులను అలరించారు.
ఎన్టీఆర్ నటించిన “పెళ్ళిచేసి చూడు, సత్య హరిశ్చంద్ర, భూకైలాస్, బందిపోటు, కదలడు-వదలడు” వంటి చిత్రాల కన్నడ రీమేక్స్ లో రాజ్ అభినయించారు. ఎన్టీఆర్ నటజీవితంలో తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘కులగౌరవం’. ఈ చిత్రానికి కన్నడలో రాజ్ కుమార్ నటించిన ‘కులగౌరవ’ చిత్రానికి ఆధారం. ఎన్టీఆర్ లాగే కన్నడ నాట శ్రీరామ, శ్రీకృష్ణ వంటి దేవతామూర్తుల పాత్రల్లో నటించి, రావణ, హిరణ్యకశ్యప, కంస, శిశుపాల వంటి ప్రతినాయక పాత్రల్లోనూ అలరించారు. ఇక బెంగళూరు, బళ్ళారి, హోస్పేట్, రాయచూర్ వంటి కేంద్రాలలో ఎన్టీఆర్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఆయా ప్రాంతాల్లో ఎన్టీఆర్‌తో పోటీగా రాజ్ కుమార్ గారి సినిమాలు సైతం విడుదలయ్యేవి. వారిద్దరి మధ్యనే పోటీ ఉందని తెలుగు కన్నడ వాసులు భావించేవారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు ఘనవిజయాలు చూశాయి. అక్కడ తమిళ స్టార్ హీరోస్ ఎమ్జీఆర్, శివాజీగణేశన్ చిత్రాలు విడుదలైనా, ఎందుకనో అన్న ఎన్టీఆర్ గారినే రాజ్ కుమార్ గారికి సమవుజ్జీగా ఆయన అభిమానులు భావించేవారు. అయితే, రాజ్ కుమార్ మాత్రం ఎన్టీఆర్‌ను తన అన్నలాగే అభిమానించేవారు. మరో విశేషమేమంటే, వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహ బంధం తర్వాతి తరం వారు సైతం కొనసాగిస్తూనే ఉన్నారు. రాజ్ కుమార్ గారి తనయుడు శివరాజ్ కుమార్, ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో అతిథి పాత్రలో కనిపించారు. ఇక రాజ్ కుమార్ మరో కుమారుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ “గెలెయ గెలెయా..” అంటూ సాగే కన్నడ పాట పాడి ఆకట్టుకున్నారు.
కన్నడలో రాజ్ కుమార్ నటించిన ‘సంత తుకారాం’ను తెలుగులో ఏయన్నార్ హీరోగా ‘తుకారాం’గా తెరకెక్కడం జరిగింది. ‘భక్త కుంబార’ చిత్రాన్ని తెలుగులో అక్కినేనితో ‘చక్రధారి’గా రూపొందించారు. రాజ్ కుమార్ ‘శ్రావణబంతు’ ఆధారంగా ఏయన్నార్ ‘వసంతగీతం’ వచ్చింది. ఏయన్నార్ ధరించిన సత్యవంతుడు, కాళిదాసు వంటి పాత్రలను కన్నడలో రాజ్ కుమార్ కూడా పోషించడం గమనార్హం!
రాజ్ కుమార్ చిత్రాలను ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత తరం హీరోలైన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు గార్లు కూడా రీమేక్ చేశారు. రాజ్ కుమార్ కెరీర్ లోనే కాదు, కన్నడ నాట అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా ‘బంగారద మనుష్య’ నిలచింది. ఈ చిత్రం ఆధారంగా తెలుగులో కృష్ణ ‘దేవుడు లాంటి మనిషి’ రూపొందింది. రాజ్ కుమార్ ‘శంకర్ గురు’నే కృష్ణ ‘కుమార రాజా’గా తెరకెక్కింది.రాజ్ కుమార్ నటించిన ‘సనాది అప్పన్న’, ‘చెలుసువే మోడగళ్’ చిత్రాలు తెలుగులో శోభన్ బాబు హీరోగా ‘సన్నాయి అప్పన్న’, ‘రాజ్ కుమార్’ రూపొందాయి. కృష్ణంరాజు హీరోగా రూపొందిన ‘పులిబిడ్డ’కు రాజ్ నటించిన ‘తాయిగె తక్క మగ’ మాతృక. పాటలతో పులకింప చేసిన రామకృష్ణ ‘పూజ’ సినిమాకు రాజ్ కుమార్ ‘ఎరడు కనసు’ మాతృక. ఇలా పలువురు తెలుగు సినిమా స్టార్స్ సైతం రాజ్ కుమార్ చిత్రాల రీమేక్స్‌లో నటించారు.
చిత్తూరు నాగయ్య గారి స్ఫూర్తితో రాజ్ కుమార్ నటగాయకునిగా సాగాలని పరితపించేవారు. రాజ్ నాటకాల్లో నటిస్తున్న సమయంలో సొంతంగా పద్యాలు, పాటలు పాడుకున్నారు. ఆ అనుభవంతోనే 1956లో రూపొందిన ‘ఓహిలేశ్వర’లో “ఓం నమశ్శివాయ…” పాటను పాడారు రాజ్ కుమార్. ఆ చిత్రానికి మన తెలుగువారైన జి.కె.వెంకటేశ్ సంగీతం సమకూర్చారు. ఆ తరువాత రాజ్ కుమార్ నటనకు, పి.బి.శ్రీనివాస్ గానానికి జోడీ కుదిరింది.వారిద్దరి కాంబో కన్నడసీమలో జైత్రయాత్ర చేసింది.అయితే నటగాయకుడు కావాలన్న రాజ్ కుమార్ అభిలాషను 1974లో రూపొందిన ‘సంపత్తిగె సవాల్’ చిత్రం తీర్చింది. ఇందులో “యారే కూగాడలి…” అనే పాట పాడి ఆకట్టుకున్నారు. ఈ చిత్రం తెలుగులో చలం హీరోగా ‘తోటరాముడు’ పేరుతో రీమేక్ అయి విజయం సాధించింది.
మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి వారిపై రాజ్ కుమార్ పాడిన భక్తిగీతాలు తెలుగువారినీ విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. నటునిగా, గాయకునిగా రాజ్ కుమార్ కు ఎనలేని ఖ్యాతి లభించింది. అభినయంలో పలు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు రాజ్ కుమార్. 1992లో రాజ్ కుమార్ నటించిన ‘జీవనచైత్ర’ చిత్రంలో “నాదమయ…” అంటూ సాగే పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా ఆయనకు అవార్డు లభించింది. ఓ పాపులర్ స్టార్ కు బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డు దక్కడం అదే మొదటి సారి. ఇప్పటి వరకూ మరో కన్నడ స్టార్ హీరో ఈ అవార్డు సాధించలేదు.
కన్నడ సినిమా అభివృద్ధికి రాజ్ కుమార్ ఎంతగానో కృషి చేశారు.మద్రాస్ నుండి కన్నడ చిత్రసీమను కర్ణాటకకు తీసుకువెళ్ళడంలో ఆయన పాత్ర మరపురానిది.బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లోనే ఆయన చిత్రాల షూటింగులన్నీ జరిగేలా పక్కాగా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఇక కన్నడ చిత్రాలకు తెలుగు, తమిళ సినిమాల ద్వారా పెద్ద పోటీ ఉండడంతో, తమ చిత్ర పరిశ్రమ ఉనికిని చాటుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కన్నడ చిత్రాలకు ‘యాభై శాతం పన్ను మినహాయింపు’ తీసుకు రావడంలోనూ రాజ్ పాత్ర ఎంతో ఉంది. పన్ను రాయితీ కారణంగానే రాజ్ కుమార్ చిత్రాలు బెంగళూరులో పరభాషా చిత్రాలకు పోటీగా నిలదొక్కుకొని ‘బంగారుద మనుష్య, శంకర్ గురు’ వంటివి సంవత్సరం పైగా ప్రదర్శితమయ్యాయి.
వెండి తెరపై రాజ్ కుమార్ నటప్రస్థానం 52 ఏళ్ళుకు పైగా నిరాటంకంగా సాగింది.కన్నడ సినిమాకు ఆయన అందించిన విశేషమైన సేవలకుగాను 1983లో పద్మభూషణ్, 1995లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి.2002లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ అంతర్జాతీయ అవార్డుతోనూ రాజ్ కుమార్ ని గౌరవించింది.నటనే జీవితంగా చివరి శ్వాస వరకు బతికిన నట సింహం రాజ్ కుమార్ 2006, ఏప్రిల్ 12న మరణించారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు