ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్

- October 14, 2025 , by Maagulf
ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్

కర్నూలు: కర్నూలులో జరగబోయే సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ బహిరంగ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనబోయే ఈ మహాసభ రాయలసీమ రాజకీయ చిత్ర పటంలో చారిత్రాత్మకం గా నిలవనుందని కూటమి నేతలు భావిస్తున్నారు. సభ విజయవంతం కోసం రాష్ట్ర మంత్రులు, కూటమి అగ్రనేతలు కర్నూలులో మకాం వేసి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ప్రతి అంశం పైన మంత్రులు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తుండటం ఈ సభ ప్రాముఖ్యతను చాటుతోంది.

కూటమి నేతల సమన్వయ సమీక్ష
కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో సోమవారం సాయంత్రం జరిగిన కీలక సమీక్ష సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన రాయలసీమ ఇన్‌చార్జ్ వరుణ్, మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, బీసీ జనార్ధన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్, మండిపల్లి రాంప్రసాద్, వంగలపూడి అనిత పాల్గొన్నారు.

అదే సమావేశానికి కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్‌లు, జిల్లా సమన్వయకర్తలు హాజరయ్యారు. సభా ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించి, సమన్వయ కార్యక్రమాలకు రూపురేఖలు ఖరారు చేశారు.

భారీ జన సమీకరణ లక్ష్యం
ప్రధాని మోదీ బహిరంగ సభను భారీ ప్రజా హాజరుతో చరిత్రాత్మకంగా నిలిపేందుకు కూటమి నేతలు ప్రత్యేక వ్యూహం రూపొందించారు. నంద్యాల, కర్నూలు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు, బనగానపల్లె, ఆలూరు, ఎమ్మిగనూరు, మాన్త్రాలయం ప్రాంతాల నుండి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చేలా రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు లక్ష మందికి పైగా ప్రజల రాకను అంచనా వేస్తూ, రోడ్డు రవాణా, తాగునీరు, వైద్య సేవలు, భద్రత వంటి సౌకర్యాలను సమగ్రంగా ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్, నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఆర్టీసీ ద్వారా 3,500 బస్సులు సిద్ధం చేశారు.

సభా ప్రాంగణం ముస్తాబు
కర్నూలు జిల్లా నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం దివ్యరూపాన్ని సంతరించుకుంది. సభ వేదికను దేశ జాతీయ పతాక రంగులతో అలంకరించారు. ప్రజల కోసం ప్రత్యేక గ్యాలరీలు, వైద్య శిబిరాలు, తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. హెలీపాడ్, రహదారి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

మోదీ పర్యటనతో రాయలసీమలో కీలక మలుపు తప్పదని కూటమి నేతలు భావిస్తున్నట్లు, ఈ సభ రాయల సీమకు అభివృద్ధి దిశలో కొత్త మలుపు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రధాని ప్రసంగంలో రాయలసీమలోని పరిశ్రమలు, రవాణా, నీటిపారుదల, పర్యాటకం వంటి అంశాలపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని సమాచారం. 16న జరగబోయే ప్రధాని మోదీ సభ రాయలసీమ రాజకీయాలకు కొత్త చరిత్ర రాయనుందనే ఆశతో కూటమి నేతలందరూ ఒక్కటై నడుస్తున్నారు ,విజయసభ దిశగా కర్నూలు సిద్ధంగా ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com