గోశాలలో ఆవుల మృతి పై స్పందించిన టీటీడీ ఛైర్మన్

- April 12, 2025 , by Maagulf
గోశాలలో ఆవుల మృతి పై స్పందించిన టీటీడీ ఛైర్మన్

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని ఎస్వీ గోశాలలో ఆవులు పెద్ద సంఖ్యలో మృతి చెందాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.ఈ ఆరోపణల పై ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ, అవి పూర్తిగా అవాస్తవాలు అని ఖండించారు. భూమన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోణంలో ఉంటూ, ప్రజలను దారితప్పించే ప్రయత్నంగా అభివర్ణించిన ఆయన, టీటీడీ ట్రస్ట్ ఎంతో భక్తి, విశ్వాసంతో పని చేస్తోందని, ఈ స్థితిలో అలాంటి అపవాదాలు బాధాకరమని వ్యాఖ్యానించారు.

బీఆర్ నాయుడు మాట్లాడుతూ, గోమాత హిందూ సంప్రదాయంలో అత్యున్నత స్థానం కలిగి ఉందని, వేద కాలం నుంచి గోవులను దేవతలుగా పూజిస్తూ వస్తున్న సంప్రదాయం ఉందని గుర్తు చేశారు. టీటీడీ గోశాలలో ఉన్న ప్రతి గోవును భక్తి శ్రద్ధలతో చూసుకుంటామని చెప్పారు. ఒక్క గోవు చనిపోతే అది సైతం బాధాకరమే కానీ, వృద్ధాప్యం, అనారోగ్యం లేదా ప్రమాదాల వలన సహజంగా జరుగుతున్న మృతులను తప్పుగా చిత్రీకరించడం అధర్మం అని అన్నారు.

ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫొటోలు తీసుకొని టీటీడీ గోశాలకు చెందినవిగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దురుద్దేశపూరితంగా ఉందని బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోసేవను రాజకీయం చేయడం చాలా ప్రమాదకరమని, ఇది టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్రగా పరిగణించాల్సి ఉందని చెప్పారు. ప్రజలను మోసగించేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడడం బాధాకరమని, ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించాలని, మోసపోవద్దని సూచించారు. గోసేవ అంటేనే గోదేవి సేవ ఇంతటి పవిత్రమైన సేవపై రాజకీయ లబ్ధి కోసం బురద చల్లే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలని బీఆర్ నాయుడు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com