దక్షిణాది గాన కోకిల-ఎస్.జానకి
- April 23, 2025
ఎస్.జానకి గళంలో జాలువారిన పాటలను వింటారు. ఆ పాట హుషారయినదా? బాధాతప్తమైనదా? అనీ ఆలోచించలేం. జానకమ్మ పాట వింటే చాలు ఆ గళమాధుర్యం మనల్ని ఉత్సాహానికి గురి చేస్తుంది. ఇలాంటి స్థితి తెలుగు సంగీతాభిమానులందరికీ అనుభవమే! మన తెలుగు పాటనే కాదు, మన జానకమ్మ గాత్రంలో చిందులు వేసిన పరభాషాగీతాలు సైతం పరమానందం పంచుతూనే ఉంటాయి. ఆ గళమాహాత్మ్యాన్ని ఎంత తలచుకుంటే అంత ఆనందం మన సొంతమవుతుంది.
మనసు బాగోలేనప్పుడు, ఏం ఎందుకు బాగోదు!? అలా అనుకున్నా, ఆందోళన చెందిన మనసుకే తెలుసు అది ఎలా ఉందో? అర్థం పర్థం లేకుండానే మనం అయోమయంలో ఉన్నప్పుడు మన మనసు కాసింత సేద తీరాలంటే ఏదో ఒక ఉత్సాహం మనల్ని పలకరించాలి. అది మధురంగా ఉంటే మరింత బాగుంటుంది. అలా ఆలోచించేవాళ్ళు మధురగాయని ఎస్.జానకి పాటలు వింటూ ఉంటారు. నేడు సుప్రసిద్ధ గాయని ఎస్.జానకి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
సంగీత ప్రపంచంలో ఎస్.జానకిగా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి గారు 1938, ఏప్రిల్ 23న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచీ అందరినీ తన మధురగాత్రంతో సమ్మోహితులను చేస్తూ వచ్చారు జానకి. ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే జానకి తొలుత పాడిన సినిమా పాట మాత్రం విషాద గీతం కావడం చిత్రం! తెలుగునాట పుట్టి, మాతృభాష తెలుగే అయినా, జానకి తొలుత తమిళ పాట పాడవలసి వచ్చింది. ఏవీయమ్ స్టూడియోస్‌లో ఆమె స్టాఫ్ సింగర్‌గా ఉన్నారు.
తెలుగు సంగీత దర్శకులు టి.చలపతిరావు స్వరకల్పనలో రూపొందిన తమిళ చిత్రం ‘విధియిన్ విలయాట్టు’లో జానకి మొట్టమొదట పాడారు. తరువాత తెలుగులో ఆమె ‘యమ్.ఎల్.ఏ’ చిత్రంలో “నీ ఆశా అడియాస… నీ దారే మణిపూస… బ్రతుకంతా అమవాసా… లంబాడోళ్ళ రామదాసా…” అనే పాట పాడారు. ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఇలా విషాద గీతాలతో ఆరంభమైన జానకి గానప్రయాణం ఏ ఆటంకమూ లేకుండా యాభై ఏళ్ళ పాటు సజావుగా సాగింది. సదా నవ్వుతూ, నవ్విస్తూనే ఐదు తరాల తారలకు పాటలు పాడి ఆకట్టుకున్నారామె.
జానకి పాట ఎంతోమంది భావి నటీమణులు నటజీవితానికి బాటలు వేసింది. ఆమె నేపథ్యగానంతో ఎందరో తారామణులు తెరపై రాజ్యమేలారు. కొందరు ఆమెను ద్వితీయశ్రేణి గాయనీ అన్నారు. అయినా, తన మధురం పంచుతూనే తానేమిటో నిరూపించుకున్నారు. ఏ భాషలో పాడినా, ఏ మాత్రం తొట్రు పడకుండా సహజత్వం ఉట్టిపడేలా జానకి గానం సాగింది. అందుకే తెలుగువారే కాదు, దక్షిణాది మొత్తం, జానకి పాటకు సలామ్ చేశారు. పలువురు సంగీత దర్శకులు జానకమ్మ పాటలతో ప్రేక్షకులను పరవశింపచేశారు. ఇళయరాజా బాణీల్లో జానకమ్మ పాడిన అనేక పాటలు జనం మదిని దోచాయి.
అన్ని భాషల్లో కలిపి దాదాపు యాభై వేల పాటలు పాడిన జానకి, ఉత్తమ గాయనిగా పలు పురస్కారాలు అందుకున్నారు. ఇంతలా తన గానంతో అలరించిన జానకమ్మ ఆ మధ్య ’96’ అనే తమిళ చిత్రంలో తెరపై కనిపించారు. ఆమె సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘మౌనపోరాటం’ సైతం జనాన్ని ఆకట్టుకుంది.
2013లో కేంద్ర ప్రభుత్వం జానకిని ‘పద్మభూషణ్’ అవార్డుతో గౌరవించాలని భావించింది. అయితే ఆ అవార్డు తనకు రావడం పట్ల ఆమె ఏ మాత్రం సంతోషించలేదు. అప్పటికే చాలా ఆలస్యమైందని భావించారు. ఏ మాత్రం మొహమాట పడకుండా ‘పద్మభూషణ్’ అవార్డును తిరస్కరించారామె. ఆమె నిర్ణయానికి అభిమానులు ఎంతగానో సంతోషించారు.
ఎందుకంటే జానకి వంటి మేటి గాయనీమణికి అన్నేళ్ళకు ‘పద్మ’ అవార్డు ప్రకటించడమే విడ్డూరమని ఫ్యాన్స్ భావించారు. ఆమె స్థాయికి తగ్గ అవార్డు ఒకే ఒక ‘భారత రత్న’ అని చాలామంది అభిప్రాయపడ్డారు. అభిమానుల అభిమానాన్ని మించిన అవార్డు లేదని భావిస్తున్న జానకమ్మ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం!
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్‌లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!









