ఆరోగ్యవంతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవాలి: వెంకయ్య నాయుడు

- April 30, 2025 , by Maagulf
ఆరోగ్యవంతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవాలి: వెంకయ్య నాయుడు
విజయవాడ:  ప్రతి కుటుంబం వారి ఆరోగ్యం గురించి పూర్తి అంచనా, అవగాహన తప్పకుండా కలిగి ఉండాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. వారికి ఉండే సమస్యలు, నివారణా మార్గాలను ముందుగానే తెలుసుకుని ఆరోగ్యవంతమైన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవాలన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యకరమైన దేశం సాకారం అవుతాయని చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలోని ఎనికెపాడు లో అమరావతి మల్టీస్పెషల్టిస్ ఆసుపత్రిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ప్రసంగించారు.ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ...మహాత్మ గాంధీ చెప్పినట్లు... "నిజమైన సంపద ఆరోగ్యమే తప్ప బంగారం, వెండి ముక్కలు కాదు." అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. శారీరక శ్రమ, పౌష్టికాహారం, చక్కని నిద్రతో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వైద్యులు, వైద్యశాలలు గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం తమ కనీస బాధ్యతగా భావించాలి. వైద్యులు గ్రామీణ ప్రాంత ప్రజలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. వారికి ముందస్తునివారణపై అవగాహన కల్పించాలి. అవసరమైన వారికి, ఆపన్నులకు తమ చేతనైనంత మేర ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు ముందుకు రావాలి." అని సూచించారు. 
 
వ్యాధులు వచ్చాక ఔషధాలు వాడడం కంటే, నివారణా చర్యలతోనే ఎక్కువ మేలు కలుగుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు.సమాజంలో విద్య, వైద్యం, రాజకీయం అనేవి ఓ మిషన్ స్ఫూర్తితో సాగేవని, ఇప్పుడు మిషన్ స్ఫూర్తి దూరమౌతూ, కమీషన్ పెరిగిందనే భావన ప్రజల్లో మొదలైందని అన్నారు. "ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి. ప్రజలు అవగాహనతో మంచి ప్రభుత్వాలకు సహకరించాలి." అని చెప్పారు. " ఉచితాలు అనుచితమైనవి. అవి సమాజాన్ని నిర్వీర్యం చేస్తాయని నిరూపితమైంది కూడా. ఉచితాలు ఇచ్చే ప్రభుత్వాలు నిధుల లేమితో ఇబ్బంది పడుతున్నాయి.ఉచితాల స్థానంలో మాలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా అభివృద్ధికి బాటలు వేసి, మెరుగైన భవిష్యత్ దిశగా సాగే వీలుంటుంది.విద్య, వైద్యం వంటివి మాత్రమే ప్రభుత్వాలు ఉచితంగా అందించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వాలు, ప్రజలు ఈ విషయంపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను." అని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com