సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టీస్ గా బి ఆర్ గ‌వాయి ప్ర‌మాణ స్వీకారం

- May 14, 2025 , by Maagulf
సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టీస్ గా బి ఆర్ గ‌వాయి ప్ర‌మాణ స్వీకారం

న్యూ ఢిల్లీ: భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (బి.ఆర్. గవాయి) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.ఈ నియామకంతో జస్టిస్ గవాయి భారతదేశానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినట్టయింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథ్యం వహించనున్న జస్టిస్ గవాయి నియామకంలో ఒక చారిత్రక విశేషం ఉంది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన తొలి బౌద్ధ మతస్థుడిగా ఆయన గుర్తింపు పొందారు. కాగా, గ‌వాయి ప‌దవీ ప్ర‌మాణ స్వీకారానికి ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్క‌డ్, ప్ర‌ధాని మోదీ, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన జ‌స్టీస్ సంజీవ్ ఖ‌న్నా ఇత‌ర ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు...ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.

2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీవిరమణ చేస్తారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్ పేరు పొందారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితోపాటు, నాగ్పుర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఆరేళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకొని రాజ్యాంగ, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్యుత్తు, విద్య, పర్యావరణానికి సంబంధించిన కేసులను విచారించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆయన కీలక ప్రకటన చేశారు. తాను ఇకపై ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టబోనని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు.

గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా, న్యాయమూర్తులుగా పనిచేసిన పలువురు పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇది విమర్శలకు తావిస్తోంది. ఈ తరుణంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా తాను పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ పదవీ చేపట్టబోనని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదే క్రమంలో న్యాయవాద వృత్తిలో పెరిగిపోతున్న అసత్య ధోరణిని ఆయన ప్రస్తావించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని సూచించారు. న్యాయ రంగానికి తన సేవలను కొనసాగిస్తానని ఖన్నా పేర్కొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన రెండు ఇన్నింగ్స్‌లు ముగిశాయని, ఇక మూడో ఇన్నింగ్స్‌లో న్యాయరంగానికి సేవలు అందించే మరో పని చేపట్టబోతున్నట్లు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com