ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఎక్కడంటే?

- May 16, 2025 , by Maagulf
ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఎక్కడంటే?

అమరావతి: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో ఏడు ఎయిర్‌‌పోర్టుల్ని ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు జిల్లాలవారీగా ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపగా అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లోని విమానాశ్రయాలకు సంబంధించిన పనుల్ని వేగవంతం చేస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయానికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. భూమి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు మొదలయ్యాయి. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల చొరవతో జిల్లాలోని కౌరుగుంటలో భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులతో మాట్లాడి, నిజమైన లబ్ధిదారులకు నష్టపరిహారం అందేలా చూస్తున్నారు.కూటమి ప్రభుత్వం రూ. 30 కోట్లు విడుదల చేసింది. భూసమస్యల పరిష్కారం కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. కౌరుగుంటలో విమానాశ్రయం కోసం భూమిని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. సర్వే నంబర్లు 334, 335లో 302 ఎకరాలను సేకరించాలని అనుకున్నారు. ఇప్పటి వరకు 215.20 ఎకరాలను సేకరించి, లబ్ధిదారులకు పరిహారం ఇచ్చారు. కానీ, వారసత్వ సమస్యల వల్ల 65 మంది రైతులకు సంబంధించిన 87.65 ఎకరాలకు పరిహారం ఆగిపోయింది.దీనికి సంబంధించి రూ. 11.39 కోట్ల పరిహారం అందుబాటులో ఉంది. అధికారులు ఇప్పటికే గ్రామసభలు నిర్వహించినా ఫలితం లేకపోయింది.గత ఐదేళ్లుగా గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే విమానాశ్రయ నిర్మాణాన్ని కందుకూరుకు తరలిస్తారని ప్రచారం జరగడంతో రైతులు నిరాశ చెందారు.తమ భూములు పనికిరాకుండా పోయాయి అనుకున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక, దగదర్తిలో విమానాశ్రయం దిశగా అడుగులుపడ్డాయి. ఇటీవల కేంద్రం నుంచి వచ్చిన అధికారులు జిల్లాకు వచ్చి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ముఖ్యంగా భూసేకరణ సమస్యలపై దృష్టి పెట్టారు. కౌరుగుంటలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి, వారికి పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తహసీల్దారు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. రైతుల కోసం ప్రభుత్వం మొదటి విడతగా రూ. 30 కోట్లు విడుదల చేసింది. ఈ దగదర్తి ఎయిర్‌పోర్టును మొత్తం 1379 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు 669 ఎకరాలు ఇప్పటికే సేకరించగా మరో 710 ఎకరాలు భూసేకరణ చేస్తున్నారు.ఈ మేరకు దగదర్తి ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో గ్రామ రెవెన్యూ అధికారి (VRO), పంచాయతీ కార్యదర్శి, గ్రామ సహాయ రెవెన్యూ అధికారి ఉంటారు. రైతుల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తారు. ఆ తరువాత తహసీల్దారుకు నివేదిక ఇస్తారు. తహసీల్దారు పరిశీలించి, వాస్తవికతను నిర్ధారిస్తారు. ఆ తరువాత పరిహారం అందిస్తారు. విమానాశ్రయంలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అధికారులు. ఐదు బృందాలతో విచారణ నిర్వహించి, వాస్తవ లబ్ధిదారులను నిర్ణయిస్తామంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com