జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం

- May 21, 2025 , by Maagulf
జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం

రాజకీయ, మతపరమైన లేదా సైద్ధాంతిక లక్ష్యాల కోసం జనాభాను లేదా ప్రభుత్వాన్ని బెదిరించడానికి హింసను సృష్టించడం ఉగ్రవాదం. ప్రస్తుతం ఇది మన దేశ భద్రతకు సవాల్ విసురుతోంది. ప్రజల ఆర్థిక, సామాజిక జీవనాన్ని దెబ్బతీస్తూ దేశాభివృద్ధికి విఘాతంగా మారుతుంది.ఉగ్రవాదుల కుట్రకు బలైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మన దేశంలో ఏటా మే 21న 'ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం'గా (Anti-Terrorism Day) నిర్వహిస్తారు. హింస వల్ల సమాజానికి వాటిల్లే నష్టం, ప్రమాదంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య. దీని కారణంగా మానవాళికి, ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారత్ 6.411 స్కోరుతో 14వ స్థానంలో నిలిచింది. మొత్తం 163 దేశాలు ఉన్న ఈ సూచీలో బుర్కినా ఫాసో (8.581), పాకిస్థాన్ (8.374), సిరియా (8.006) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉగ్రవాదం కారణంగా ప్రభావితమైన దేశాలకు ఐఈపీ ర్యాంకులు ఇస్తుంది.

మరోవైపు భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి చాప కింద నీరులా కొనసాగుతున్న సామాజిక వివక్ష వలన అంతర్గత సంఘర్షణలు పెరుగుతున్నాయి. దీంతో వామపక్ష తీవ్రవాదం పెరిగిపోయింది. అలాగే కులం పేరుతో విభజించి అవకాశాలు అందకుండా చేస్తే వారు ఉగ్రవాదం పట్ల ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలు కొన్ని వర్గాల వారికే అందించకుండా అందరికీ అవకాశం కల్పించాలి.

ప్రపంచంలో అతిపెద్ద జనాభా గల భారతదేశంలో అంతర్గత, బహిర్గత ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరం. దేశంలోని అంతర్గత కలహాలు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు ప్రధాన కారణాలు అన్వేషించి పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉన్నాయి. అలాగే బహిర్గత ఉగ్రవాదాన్ని నిలువరించాలంటే ప్రపంచ దేశాలతో స్నేహపూరిత దౌత్య సంబంధాలను పెంపొందించుకోవాలి. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com