ఎన్నారై భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం

- May 25, 2025 , by Maagulf
ఎన్నారై భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల: ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి తరలి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. వేసవి సెలవులు, ఇతర పర్వదినాల వేళ తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)చర్యలు తీసుకుంటుంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లేందుకు అవసరమై చర్యలు తీసుకుంటుంది. భక్తుల కోసం నిత్యం రకరకాల కార్యక్రమాలు ప్రారంభిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ ఎన్నారై(NRI) భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అలానే తిరుమలలో మరో కొత్త సేవను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. 

ఎన్నారైలు కూడా శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు.శనివారం నాడు డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నారైలూ కూడా శ్రీవారి సేవ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలానే గోమాత సేవ చేసేందుకు కొత్తగా ‘గో సేవ’ను అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్యామలరావుతో పాటుగా అదనపు ఈఓ వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టబోయే పలు అభివృద్ధి ప్రణాళికలు వివరించారు.తిరుమలలో నిర్వహించే శ్రీవారి సేవలో పాల్గొనడం కోసం భక్తులు ఆసక్తి చూపుతుంటారు. ఈక్రమంలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. అంతేకాక దీనిపై చర్చించేందుకు శనివారం టీటీడీ పరిపాలనా భవనంలో 14 దేశాలకు చెందిన ఎన్నారైలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించి వారితో మాట్లాడారు. ‘మెడిసిన్, ఐటీ, ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో సేవలందించేందుకు ఎన్నారైలు ముందుకు వస్తున్నారు. వారి సేవలను వినియోగించుకునేందుకు ప్రణాళికలు తయారు చేయాలి’ అని ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు.

అనంతరం శ్యామలరావు మాట్లాడుతూ ‘తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం టీటీడీ పట్టణ ప్రణాళిక విభాగం ఏర్పాటు చేశాం. పలు దశల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ముందుగా శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం ఆ తర్వాత రెండో దశలో అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం మూడో దశలో ఒంటిమిట్ట కోదండ రామాలయం, చివరగా తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం మాస్టర్‌ప్లాన్‌ తయారు చేసేందుకు చర్యలుచేపట్టాం’ అని ఈఓ శ్యామలరావు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com