మరాఠా రాజకీయ దిగ్గజం-విలాస్ రావ్ దేశముఖ్
- May 26, 2025
మహారాష్ట్ర రాజకీయాల్లో దివంగత విలాస్ రావ్ దేశముఖ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను కనుమరుగు అవ్వనీయకుండా చేసిన నేతల్లో వీరు ఒకరు. 90వ దశకం చివర్లో మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్‌ను ఒప్పించి కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశారు. 7 ఏళ్ళ పాటు మహారాష్ట్ర సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా సైతం పలు కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. నేడు మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం విలాస్ రావ్ దేశముఖ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం....
విలాస్ రావ్ దేశముఖ్ పూర్తి పేరు విలాస్ రావ్ దగాడోజీరావ్ దేశముఖ్. 1945, మే 26న ఒకప్పటి నైజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రం అవిభక్త ఉస్మానాబాద్ జిల్లా బభల్‌గావ్ గ్రామంలో మరాఠా రైతు కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు దగాడోజీరావ్ వెంకట్రావ్ దేశముఖ్,సుశీలాదేవి. విలాస్ రావ్ బాల్యం, ప్రాథమిక విద్యాబ్యాసం స్వగ్రామంలోనే జరిగింది. హైస్కూల్, ఇంటర్ వరకు లాతూర్లో జరిగింది. అనంతరం పూణే విద్యాపీఠ్ నుంచి బీఏ పూర్తి చేసి, ఐ.ఎల్.ఎస్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
విలాస్ రావ్ కుటుంబానికి తోలి నుంచి రాజకీయంగా ప్రాముఖ్యత ఉంది. తాత వెంకట్రావ్ దేశముఖ్ నిజాం కాలంలో మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న ప్రముఖ దేశముఖ్. తండ్రి సైతం దేశముఖ్ బాధ్యతల్లో తమ ప్రాంతాన్ని పాలించారు. ఆ తర్వాత స్వగ్రామానికి పెద్దగా చాలా ఏళ్ళు కొనసాగారు. విలాస్ రావ్ విద్యార్ధి దశలోనే కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత లాయర్ ప్రాక్టీసును వదిలి బభల్‌గావ్ గ్రామానికి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో విలాస్ రావ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. సర్పంచ్‌గా ఉంటూనే లాతూర్ తాలూకా పంచాయితీ సమితికి ఉపాధ్యక్షుడై ఎన్నికై 1975 నుంచి 1980 వరకు కొనసాగారు.
అవిభక్త ఉస్మానాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పటి జాతీయ యూత్ కాంగ్రెస్ చీఫ్ సంజయ్ గాంధీ ప్రవేశపెట్టిన పంచ సూత్రాల అమలును జిల్లాలో అమలు జరిపి సంజయ్ మన్ననలు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చీలిన తర్వాత ఇందిరా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఉస్మానాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సైతం ఎన్నికయ్యారు. 1980లో శివరాజ్ పాటిల్ లోక్ సభకు వెళ్లడంతో లాతూర్ నుంచి తొలిసారి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1980- 95 మధ్యలో వరసగా మూడుసార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.
1986-95 వరకు శంకర్ రావ్ చవాన్, శరద్ పవార్, సుధాకర్ రావ్ నాయక్ మంత్రివర్గాల్లో వ్యవసాయం, సహకార, హోమ్, పరిశ్రమలు, ప్రజాపనుల, అసెంబ్లీ వ్యవహారాలు, విద్య, గ్రామీణాభివృద్ధి, గిరిజ సంక్షేమం, రెవెన్యూ, కరువు నివారణ, స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్, రవాణా మరియు సాధారణ పరిపాలన శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా చవాన్, పవార్ మంత్రివర్గాల్లో అరడజనుకు పైగా మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 1995 ఎన్నికల్లో లాతూర్ నుంచి ఓటమి పాలయ్యారు. ఆయన రాజకీయ జీవితంలో ఇదే తోలి మరియు ఆఖరి ఓటమి. 1995-99 వరకు భాజపా- శివసేన ప్రభుత్వం అక్రమాలపై రాజీలేని పోరాటం చేశారు.
1996లో శరద్ పవార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు రంజిత్ దేశముఖ్, సుశీల్ కుమార్ షిండే మరియు ఇతరులతో కలిసి పనిచేశారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్సీపీని స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలోకి భారీగా వలసలు జరిగాయి. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించి పార్టీని మళ్ళి ఒకే తాటిపైకి తేవడంలో దేశముఖ్ కృషి చేశారు.
1999లో శివసేన- భాజపా కూటమి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో కాంగ్రెస్ శ్రేణులను సమర్థవంతంగా నడిపించి ఆ ఎన్నికల్లో జరిగిన చతుర్ముఖ పోరులో 75 స్థానాలను కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇదే సమయంలో ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ అధినేత శరద్ పవార్‌ను ఒప్పించడంలో దేశముఖ్ కీలకంగా వ్యవహరించారు. అలాగే, సంకీర్ణ ప్రభుత్వానికి సీఎంగా ఎవరు ఉండాలనే ఆలోచనలు రేకెత్తిన సమయంలో కాంగ్రెస్ మెజార్టీ ఎమ్యెల్యేలు విలాస్ రావ్ వైపే మొగ్గు చూపారు. పైగా ఎన్సీపీ అధినేత పవార్ సైతం విలాస్ రావుకే తన ఓటు వేయడంతో మహారాష్ట్ర 14వ సీఎంగా 1999లో బాధ్యతలు చేపట్టారు.
1999 నుంచి 2003 వరకు సీఎంగా ఉన్న విలాస్ రావ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించారు. శివసేన- భాజపా సర్కార్ హయాంలో అప్పులు, అభివృద్ధి లేమిని వారసత్వంగా అందుకున్న దేశముఖ్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పరిశ్రమలు, రహదారులు, పవర్ ప్లాంట్స్ నిర్మాణం ఇలా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాజధానుల్లోనే కేంద్రీకృతమైన ఐటీ రంగం మీద దృష్టి సారించారు. ఐటీ సెక్టార్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో రాజధాని ముంబై, పూణే నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వపరంగా అన్ని రకాల అనుమతులను వేగంగా ఇప్పించారు. 2003లో సీఎం పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రం మిగులు ఆదాయాన్ని కలిగి ఉంది.
2003లో ప్రారంభంలో సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే తిరుగుబాటు చేయడంతో, మధ్యే మార్గంగా దేశముఖ్ తన పదవికి రాజీనామా చేసి సాధారణ ఎమ్యెల్యేగా కొనసాగారు. 2004 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ మళ్ళి తన నాయకత్వంవైపు మొగ్గు చూపడంతో తిరిగి ఎన్నికల్లో పార్టీని గెలిపించి రెండోసారి సీఎం అయ్యారు. 2004-08 వరకు సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పైగా కేంద్రంలో యూపీఎ ప్రభుత్వం ఉండటంతో రాష్ట్రానికి దండిగా నిధులు రాబట్టారు. అయితే 2008లో జరిగిన ముంబై తాజ్ హోటల్ ఉగ్రదాడి ఆయన ఇమేజ్ దెబ్బతీసింది. ఆ దాడి సమయంలో పెద్దఎత్తున విమర్శలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
సీఎం పదవికి రాజీనామా చేసినప్పటికి విలాస్ రావ్ సేవలను కేంద్రంలో వినియోగించుకునేందుకు తలిచిన సోనియా గాంధీ 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో భారీ పరిశ్రమలు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను 2012 వరకు నిర్వహించారు. క్యాబినెట్ మంత్రిగా ప్రతి సమావేశానికి ఠంచనుగా హాజరయ్యే కొద్దీ మంది మంత్రుల్లో ఒకరిగా విలాస్ రావ్ గుర్తింపు సాధించారు.
విలాస్ రావ్ రాజకీయఎదుగుదలలో శంకర్ రావ్ చవాన్, శరద్ పవార్ పాత్రలు చాలా కీలకం. నాందేడ్ ప్రాంతానికి చవాన్ తన హయాంలో ఎందరో యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించారు. శంకర్ సోన్వానే, శివరాజ్ పాటిల్ తర్వాత లాతూర్ ప్రాంతంలో బలమైన నేతగా విలాస్ రావ్ దేశముఖ్ ఎదగడం వెనుక చవాన్ రాజకీయ తోడ్పాటు ఉంది. దేశముఖ్ రెండోసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన తర్వాత తన మంత్రివర్గంలోనే అరడజను మంత్రిత్వ శాఖలను కట్టబెట్టి పరిపాలన మీద అవగాహన ఏర్పరిచారు. చవాన్ రాజకీయ సహకారాన్ని మరువని దేశముఖ్ తను సీఎంగా ఉన్న రెండు పర్యాయాల్లో చవాన్ కుమారుడైన అశోక్ చవాన్‌కు కీలకమైన మంత్రి పదవులను కట్టబెట్టారు. 2008లో సీఎం పదవికి రాజీనామా చేసిన తన వారసుడిగా అశోక్ చవాన్ పేరునే అధిష్ఠానానికి సూచించి సీఎం కావడంలో తోడ్పడ్డారు.
శంకర్ రావ్ చవాన్ రాజకీయ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహించిన శరద్ పవార్ సైతం దేశముఖ్‌కు రాజకీయ ఆపన్న హస్తాన్ని అందించడానికి ఏనాడు సంకోచించలేదు. మరాఠ్వాడా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి దేశముఖ్ సహకారాన్ని పవార్ తీసుకునేవారు. ఒకవిధంగా దేశముఖ్ ఆ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఎదగడానికి పవార్ తోడ్పడ్డారు. 90వ దశకంలో లాతూర్ జిల్లాలో భూకంపం, కరువు పరిస్థితుల సమయంలో వీరిద్దరూ కలిసి కట్టుగా పనిచేసి సాధారణ స్థితికి తేవడంలో దోహదపడ్డారు. ఇంత చేసినప్పటికి 1995 ఎన్నికల్లో లాతూర్లో దేశముఖ్ ఓటమి చెందడం పవార్‌ను ఆశ్చర్యపరిచింది.
1999లో పవార్ ఎన్సీపీని స్థాపించిన సమయంలో దేశముఖ్‌ను రమ్మని ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించారు. 1999 ఎన్నికల తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ - ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా ఎవరుండాలి మీమాంస ఉన్న సమయంలో దేశముఖ్ వైపు పవార్ మొగ్గుచూపడం వల్లే దేశముఖ్ సీఎం అయ్యారు. సీఎంగా ఉన్నంత కాలం ఎటువంటి ట్రబుల్స్ ఫెస్ చేయకుండా ప్రభుత్వాన్ని నడిపించడంలో పవార్ సంపూర్ణ సహకారాన్ని అందించారు. కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖలకు మంత్రిగా నియమితులవ్వడంలో పవార్ పాత్ర ఉంది. ఇరువురి కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
దేశముఖ్ వ్యక్తిగత జీవితానికి వస్తే భార్య వర్షతాయి దేశముఖ్ ఆదిలాబాద్ పట్టణానికి చెందినవారు. భర్త రాజకీయంగా బిజీగా ఉన్న దశలో కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో భర్తకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేవారు. వీరికి ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు అమిత్ దేశముఖ్ లాతూర్ సిటీ ఎమ్యెల్యేగా ఉన్నారు. రెండో కుమారుడు ధీరజ్ దేశముఖ్ లాతూర్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నారు. మూడో కుమారుడు రితేష్ దేశముఖ్ బాలీవుడ్ హీరోగా కొనసాగుతున్నారు.
రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నప్పటికి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లాతూర్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో విద్య ప్రముఖ్యతను గుర్తించి తన తల్లి పేరిట లాతూర్ పట్టణంలో సుశీల దేవి విద్యాసంస్థలు స్థాపించారు. ఇవే కాకుండా ఇంటర్, పాలిటెక్నీక్ మరియు ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ మరియు పలు వృత్తి శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా, మధ్యతరగతి వారికి ఫీజుల్లో రాయితీలు ఇచ్చారు. అలాగే, ఎన్జీవో ఫౌండేషన్ ఏర్పాటు చేసి లాతూర్ జిల్లాలో మెడికల్ క్యాంప్స్, జాబ్ మేళాలు నిర్వహించారు.
మూడున్నర దశాబ్దాల పాటు మరాఠా రాజకీయాలను ప్రభావితం చేసిన విలాస్ రావ్ దేశముఖ్ సౌమ్యుడు, స్నేహశీలి. అన్ని పార్టీల నేతలతో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు నెరిపారు. కార్యకర్తలు ఆయన్ని అన్నాజీ అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి మహారాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన విలాస్ రావ్ దేశముఖ్ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా తన 67వ ఏట 2012, ఆగస్టు 14వ తేదీన కన్నుమూశారు. ఆయన మరణించిన తర్వాత నుంచి మహారాష్ట్రలో కాంగ్రెస్ బలహీన పడిపోయింది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!