బీహార్ రాజకీయవేత్త-సుశీల్ మోడీ
- May 30, 2025
జాతీయ రాజకీయాల్లో బీహార్ రాష్ట్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉత్తర భారతదేశంలో యూపీ తర్వాత అత్యధిక మంది ఎంపీలను పార్లమెంటుకు పంపించేది బీహార్ మాత్రమే. అందువల్లే ఈ రాష్ట్ర రాజకీయాల మీద జాతీయ పార్టీలు, మీడియా వర్గాలు ఎల్లప్పుడూ ప్రత్యేక దృష్టిని సారిస్తూనే ఉంటాయి.ఈ రాష్ట్రానికి చెందిన నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు బీహార్‌తో పాటుగా జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. వీరి సరసన భాజపా నేత సుశీల్ మోడీ కూడా నిలుస్తారు. భాజపాకు ఆ రాష్ట్రంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు పెద్ద దిక్కుగా నిలిచారు. బీహార్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత సైతం మోడీకి దక్కుతుంది. నేడు భాజపా దిగ్గజ నేత సుశీల్ మోడీ మీద ప్రత్యేక కథనం...
సుశీల్ మోడీ అలియాస్ సుశీల్ కుమార్ మోడీ 1952, జనవరి 5న బీహార్ రాజధాని పాట్నాలో బనియా కుటుంబానికి చెందిన మోతీ లాల్ మోడీ, రత్న దేవి దంపతులకు జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం పాట్నాలోని సాగింది. పాట్నా సైన్స్ కాలేజీ నుంచి బోటనిలో బీఎస్సి పూర్తి చేసిన తర్వాత పాట్నా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతూ సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో భాగంగా మధ్యలోనే ఆపేశారు.
మోడీ చిన్నతనంలోనే ఆరెస్సెస్‌లో చేరారు. విద్యార్ధి దశలోనే సంఘ్ విద్యార్ధి విభాగమైన ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేయడం మొదలుపెట్టారు. 1973లో పాట్నా యూనివర్సిటీ విద్యార్ధి సంఘం ఎన్నికల్లో సోషలిస్టు విద్యార్ధి విభాగం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వగా, సుశీల్ మోడీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాలేజీ రోజుల్లో లాలూ వర్గంలో నితీశ్ కుమార్, రఘు వంశ్ ప్రసాద్ సింగ్ బలమైన విద్యార్ధి నేతలు వంటి వారు ఉండగా, వీరందరిని సుశీల్ ధైర్యంగానే ఎదుర్కొన్నారు. లాలూతో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికి నితీశ్ కుమార్‌తో మాత్రం చాలా సన్నిహితంగా ఉండేవారు. కాలేజీలో ఏర్పడ్డ వీరి స్నేహం తర్వాతి రోజుల్లో బీహార్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుందని ఆనాడు ఇరువురు ఉహించి ఉండరు.
విద్యార్ధి రాజకీయాల్లో బిజీగా ఉన్న దశలోనే 1974లో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ప్రారంభమైన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో భాగమయ్యారు. ఆ తర్వాత ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు సైతం వెళ్లారు. 1977లో తన తోటి వారు రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికి మోడీ ఏబీవీపీతోనే కొనసాగారు. 1977-80 వరకు బీహార్ రాష్ట్ర ఏబీవీపీ కార్యదర్శిగా, 1980-87 వరకు ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలోనే బీహార్, యూపీ రాష్ట్రాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించారు. అలాగే, బాంగ్లాదేశ్ అక్రమ ముస్లిం వలసలకు వ్యతిరేకంగా, అస్సాం రాష్ట్రంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా పలు నిరసన కార్యక్రమాలను తన ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టారు.
1987లో భాజపాలో యువతరానికి పెద్దపీట వేయాలని వాజపేయ్, అద్వానీలు నిర్ణయం తీసుకోవడం మోడీకి కలిసి వచ్చింది. సంఘ్ నుంచి అప్పటికే నరేంద్ర మోడీ, గోవిందాచార్యలను తీసుకోగా, బీహార్ నుంచి సుశీల్ మోడీకి అవకాశం దక్కింది, పైగా వాజపేయితో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఆయన రాజకీయ జీవితానికి బలమైన పునాదిగా చెబుతారు. కైలాశ్ పతి మిశ్రా, సీపీ ఠాకూర్ వంటి వారు ఉన్నప్పటికి సుశీల్ మోడీ పార్టీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటూ వచ్చారు. తనతో పాటుగా పలువురు యువనేతలను పైకి తీసుకొచ్చారు.
1990 అసెంబ్లీ ఎన్నికల్లో పాట్నా సెంట్రల్ నుంచి తొలిసారి ఎమ్యెల్యేగా మోడీ ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1995, 2000ల్లో సైతం ఎన్నికయ్యారు. 1996 నుంచి 2004 వరకు బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా 8 సంవత్సరాల పాటు ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైన నాటి నుంచి అప్పటి లాలూ ప్రసాద్ సర్కార్ ఆటవిక పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు మరియు అశాంతి కార్యకలాపాల మీద పోరాడుతూ వచ్చారు. ముఖ్యంగా 1997లో దాణా కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకోచ్చి లాలూను సీఎం పదవి నుంచి దింపడంలో కీలకమైన పాత్ర పోషించారు. 1998,1999 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయమని భాజపా అగ్రనేతలు కోరినప్పటికి సున్నితంగా తిరస్కరించి బీహార్ రాజకీయాలకే పరిమితం అయ్యారు.
లాలూ తర్వాత సీఎం అయిన రబ్రీ దేవి హయాంలో సైతంలో జరిగిన అసాంఘిక కార్యకలాపాల మీద పోరాడారు. ముఖ్యంగా ఇదే సమయంలో బీహార్ నుంచి ఝార్ఖండ్ రాష్ట్ర అవతరణకు సంపూర్ణ మద్దతు తెలిపారు. 2000 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ నేతృత్వంలోని ఆర్జేడీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సంఖ్య తగ్గిన సమయంలో మోడీ, అప్పటి కేంద్రమంత్రి మరియు సమతా పార్టీ నేత నితీశ్ కుమార్, ఎల్.జె.పి అధినేత రామ్ విలాస్ పాశ్వాన్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సొరేన్లు కలిసి కూటమిగా ఏర్పడి నితీశ్ కుమార్ సీఎంగా ఏడు రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీశ్ మంత్రివర్గంలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా మోడీ పనిచేశారు. అయితే, సంఖ్యా బలాన్ని చూపించలేక పోవడంతో ఆ ప్రభుత్వం పడిపోయింది.
2004లో భాజపా అగ్రనేతల ఒత్తిడి వల్ల భాగల్‌పూర్ లోక్‌సభ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఓటమి చెందడంతో మోడీ మళ్ళీ బీహార్ రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి సారించారు. 2005 మధ్యలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో పాటుగా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించక పోవడం వల్ల రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అయితే, మళ్ళీ అదే ఏడాది చివర్లో నిర్వహించిన ఎన్నికల్లో భాజపా- జేడీయూ కూటమికి మెజారిటీ సీట్లు రావడంతో అప్పటి వరకు ఎంపీలుగా ఉన్న జేడీయూ నేత నితీశ్ కుమార్, సుశీల్ మోడీలు రాజీనామా చేసి సంకీర్ణ ప్రభుత్వానికి తమ పార్టీల తరపున సారథులుగా ఎన్నికయ్యారు. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా సుశీల్ మోడీలు బాధ్యతలు చేపట్టారు.
2005-10 వరకు బీహార్ ఆర్థిక శాఖ మంత్రిగా మోడీ అమోఘమైన పాత్రను నిర్వహించారు. లాలూ కుటుంబ పాలనలో పతనమైన బీహార్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. పైగా సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌కు పాలనా పరంగా, రాజకీయ పరంగా అన్ని సమయాల్లో మద్దతుగా నిలిచారు. నితీశ్- మోడీ ద్వయం వల్లే 2010లో సంకీర్ణ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. 2010-13 వరకు మళ్ళీ మోడీ డిప్యూటీ సీఎంతో పాటుగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండో పర్యాయం సాఫీగా సాగుతున్న సమయంలోనే 2013లో భాజపా ప్రధాని మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఎన్నికవ్వడాన్ని నిరసిస్తూ నితీశ్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు రావడం జరిగింది.
నితీశ్ కుమార్ చర్య పట్ల విస్మయానికి గురైనప్పటికి, పార్టీకే ప్రాధాన్యత ఇచ్చిన మోడీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుంచి అత్యధిక మంది ఎంపీలుగా గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు. పైగా పార్టీలో అప్పటి వరకు తనను వ్యతిరేకించిన గిరిరాజ్ సింగ్ వంటి పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లడంతో పార్టీలో స్వతంత్రంగా వ్యవహరించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ - షా ద్వయం అన్నీతానై వ్యవహరించడంతో మోడీ సైలెంట్ అయ్యారు. ఆ ఎన్నికల్లో జేడీయూ- ఆర్జేడీ కూటమి అధికారంలోకి రావడంతో తిరిగి భాజపా పగ్గాలను మోడీకే ఇచ్చారు.
ఆర్జేడీతో సఖ్యత కరువై ఇబ్బంది పడుతున్న సీఎం నితీశ్ కుమార్‌ను తిరిగి ఎన్డీయే కూటమిలోకి తీసుకురావడంలో మోడీ కీలకంగా వ్యవహరించారు. 2017లో తిరిగి జేడీయూ - భాజపా కూటమి ప్రభుత్వంలో తిరిగి డిప్యూటీ సీఎంతో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి పదవిని తిరిగి చేపట్టారు. 2017-20 వరకు అదే పదవిలో ఉన్న ఆయన పార్టీ జాతీయ నేతల ఆదేశాల మేరకు 2020, డిసెంబర్ 7న రాజ్యసభకు వెళ్లారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వంలో పలు ఆర్థిక శాఖకు సంబంధించిన కీలకమైన వ్యవహారాలను పర్యవేక్షణ చేస్తూ ఉండేవారు. మోడీ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినప్పటికి అది ఉహాగానంగానే మిగిపోయింది.
నితీశ్ - మోడీ స్నేహ బంధం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే బీహార్ సమకాలీన రాజకీయాల్లో వీరిద్దరి ప్రస్తావన లేకుండా ఏ రాజకీయ అధ్యయనం ముగియదు. కాలేజీ రోజుల్లో సోషలిస్టు భావజాలానికి ప్రతినిధిగా నితీశ్, హిందుత్వ భావజాలానికి ప్రతినిధిగా మోడీ ఉండేవారు. ఆరోజుల్లో వీరిద్దరి మధ్య సఖ్యత ఏర్పడటానికి ఇరువురి కామన్ ఫ్రెండ్స్ ఒక కారణం. నితీశ్ సోషలిస్టుగా ఉన్నప్పటికి కొన్ని ఆధునిక భావాలను కలిగి ఉండేవారు. అటువంటి భావాలే మోడీకి ఉండేవి. జెపి ఉద్యమంలో సైతం ఇరువురు కలిసి పనిచేశారు.
90వ దశకం మధ్యలో లాలూతో వచ్చిన రాజకీయ విభేదాల వల్ల సమతా పార్టీని పెట్టిన నితీశ్ తన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడే రాజకీయ భాగస్వామి కోసం వెతుకుతున్న సమయంలో భాజపా వైపు రావడానికి మోడీ కూడా ఒక విధంగా సహాయపడ్డారు. దీని వల్ల ఇరువురు లాభాన్ని పొందారు. 1998-2004 వరకు ఎన్డీయే కూటమిలో కేంద్ర మంత్రిగా ఉండగా, మోడీ బీహార్ అసెంబ్లీలో ఎనిమిది సంవత్సరాల పాటు ప్రతిపక్షనేతగా క్యాబినెట్ హోదాను పొందారు. నితీశ్ మాజీ ప్రధాని వాజపేయికి సన్నిహితం అవ్వడం వెనుక సుశీల్ మోడీ పాత్ర ఉంది. 2000లో తొలిసారి నితీశ్ సీఎం అవ్వడానికి కృషి చేశారు. 2005- 13 వరకు, 2017-2020 వరకు నితీశ్‌కు అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలిచారు.
నితీశ్ సైతం మోడీని తన ఆత్మీయుల్లో ఒకరిగా భావించేవారు. నితీశ్ తన పార్టీ నేతల కంటే ఎక్కువగా మోడీతోనే రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలను పంచుకునేవారు. నితీశ్ అంతరంగం తెలిసిన అతికొద్ది మంది రాజకీయ నేతల్లో సుశీల్ మోడీ ఒకరు. అందుకే వీరిద్దరిని రామలక్ష్మణులుగా బీహార్ రాజకీయాల్లో వ్యవహరిస్తారు. భాజపా సీనియర్ నేతల్లో వీరిద్దరి స్నేహ బంధం పట్ల తీవ్ర విముఖత ఉన్నప్పటికి ఏమి చేయలేకపోయేవారు. వీరిద్దరిని విడగొడితేనే భాజపా బీహార్లో రాజకీయంగా బలపడుతుందని మోడీ- షా ద్వయానికి వీరంటే గిట్టని వారు చెప్పడంతో సుశీల్ మోడీని రాజ్యసభకు పంపించారు. మోడీ రాజ్యసభకు వెళ్లిన నాటి నుంచి భాజపా నేతలతో నితీశ్ వేగలేక 2022లో తిరిగి ఆర్జేడీతో జట్టు కట్టారు. అయితే, ఆర్జేడీ నేతల అసాంఘిక కార్యకలాపాలు సహించలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మళ్ళీ మోడీనే నితీశ్‌ను 2024 జనవరిలో ఎన్డీయేకు దగ్గర చేశారు. మోడీ ముందు చూపుతో వ్యవహరించిన విధానం వల్లే 2024లో జేడీయూ సహకారంతో తిరిగి మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు.
బీహార్ రాజకీయాల్లో ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన సుశీల్ మోడీ నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్న సమయంలో అవినీతి రహిత పాలన అందించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. వారసత్వ రాజకీయాలకు మొదటి నుంచి వ్యతిరేకం కావడంతో తన ఇద్దరు కుమారులను రాజకీయ వాతావరణానికి దూరంగా పెంచారు. రాజకీయ వైరుధ్యాలే తప్పించి వ్యక్తిగతంగా ఏ నాయకుతోనూ విభేదాలు లేకుండా అన్ని పార్టీల నేతలతో సన్నిహితంగా మెలిగి అందరివాడయ్యారు. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్లిన తర్వాత కొంత ఇబ్బంది పడినప్పటికి త్వరలోనే సర్దుకొని అక్కడా ఇమిడిపోతున్న సమయంలో క్యాన్సర్ రూపంలో ఆయన తన 72వ ఏట 2024, మే 13న పాట్నాలో మరణించారు. రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2025లో ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!