TTD భద్రత పై ఉన్నతస్థాయి సమావేశం

- May 31, 2025 , by Maagulf
TTD భద్రత పై ఉన్నతస్థాయి సమావేశం

తిరుమల: టీటీడీ భద్రతను మరింత పటిష్టంగా, సమగ్రంగా చేసేందుకు అధికార యంత్రాంగం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది.ఈ నేపథ్యం లోతిరుమల క్షేత్రం, పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం కీలక సమావేశం జరిగింది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, తిరుమల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారి (EO)  జె. శ్యామలరావు పాల్గొన్నారు. భద్రతా పరమైన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

సమావేశం ప్రారంభంలో తిరుపతి ఎస్పీ, టీటీడీ ఇన్‌చార్జ్ సీవీఎస్‌వో హర్షవర్ధన్ రాజు, తిరుమలలో భద్రతకు సంబంధించిన అంశాలు, చేపట్టబోయే ఆడిట్ చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.అనంతరం రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ఉన్న ప్రాముఖ్యత, సున్నితత్వం దృష్ట్యా ఇక్కడ పటిష్టమైన భద్రతా వ్యవస్థ అత్యవసరమని నొక్కిచెప్పారు. తిరుమల భద్రతా విధుల్లో పాలుపంచుకుంటున్న ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డులు, సివిల్ పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ విభాగాలతో పాటు, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే స్పందించేందుకు ఒక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం కూడా ఉండాలని సూచించారు. ప్రతి భద్రతా విభాగానికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక (SOP) ఉండాలని ఆయన అన్నారు. అలిపిరి వద్ద బహుళ అంచెల వాహన స్కానింగ్ వ్యవస్థ, రక్షణ రంగ సంస్థల సహకారంతో సెన్సార్ ప్లే సిస్టమ్ ఏర్పాటు, ఆధునిక భద్రతా పరికరాల వినియోగం, టీటీడీకి పటిష్టమైన సైబర్ భద్రతా వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలపై కూడా డీజీపీ పలు సూచనలు చేశారు.

టీటీడీ ఈవో  జె.శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల భద్రత విషయంలో వివిధ ఏజెన్సీల మధ్య అధికారిక సమన్వయ యంత్రాంగం ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రతా ఆడిట్‌పై ఇంత విస్తృతంగా సమీక్ష జరపడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ ఉన్నతస్థాయి సమావేశంలో అదనపు డీజీ (శాంతిభద్రతలు)  మధుసూదన్ రెడ్డి, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్డా, ఐజీ  శ్రీకాంత్, అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ శేముషి, ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ  ఆరిఫ్ హఫీజ్, డీఎఫ్‌వో  వివేక్, వివిధ భద్రతా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు, ఇతర టీటీడీ అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com