అంతరిక్షంలోకి వెళుతున్న భారతీయుడు..
- June 07, 2025
అంతరిక్షంలో పరిశోధనలకు పాతికేళ్లుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను వినియోగిస్తున్నారు. దీనిని 2030లో డీకమిషన్ చేయాలని నాసా నిర్ణయించింది.ఆ తర్వాత అంతరిక్ష ప్రయోగాల కోసం మరో అధునాతన స్పేస్ స్టేషన్ నిర్మించడంలో భాగంగా అక్సియం స్టేషన్‌ను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఆక్సియం స్పేస్ స్టేషన్ విడి భాగాలను ఒక్కొక్కటి తీసుకెళ్లి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి అనుసంధానం చేస్తారు. ఇలా పూర్తిగా ఆక్సియం స్పేస్ స్టేషన్ ఏర్పాటయ్యాక దానిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వేరు చేసి, ఆపై ఐఎస్ఎస్‌ను డీకమిషనింగ్ చేస్తారు.
ఈ ప్రక్రియలో ఇప్పటి వరకూ ఆక్సియం 3 మిషన్లలో వివిధ దేశాలకు చెందిన వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపారు. తాజా ఆక్సియం 4 మిషన్‌లో భారత్ సహా పోలండ్, హంగేరి దేశాల వ్యోమగాములను పంపుతున్నారు.
ఆమె గతంలో రెండుసార్లు ఐఎస్ఎస్‌కు కమాండర్‌గా..
ఈ మూడు దేశాల నుంచి గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎవరూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. అక్సియం 4 మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్‌కి ఇది ఐదో అంతరిక్ష యానం. ఆమె గతంలో రెండుసార్లు ఐఎస్ఎస్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. ఆమె అంతరిక్షంలో 100 రోజులు గడిపారు. పది సార్లు స్పేస్ వాక్ చేశారు. ఇక ఈ మిషన్‌కు పైలట్‌గా ఇస్రోకు చెందిన శుభాంశు శుక్లా, మిషన్ స్పెషలిస్ట్‌లుగా పోలండ్‌కి చెందిన స్లావోజ్ ఉజ్నానిస్కీ విస్నివిస్కీ, హంగరీ నుంచి టిబోర్ కాప్ ఉన్నారు. భారత అంతరిక్ష ప్రయాణం మరో మైలురాయిని దాటనుంది. గత పాతికేళ్లలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 270 మందికి పైగా వ్యోమగాములు వెళ్లారు. కానీ వారిలో భారతీయులు ఒక్కరు కూడా లేరు. ఆ ఘనత శుభాంశు శుక్లా సాధించబోతున్నారు.
తొలి భారతీయుడు రాకేశ్ శర్మ
ఆనాటి సోవియెట్ యూనియన్ సహకారంతో 1984లో సోయూజ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లినా, వారు భారతీయ సంతతివారే తప్ప, భారత్‌లో పుట్టి పెరిగిన వ్యక్తులెవరూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. కానీ, ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించనున్న రెండో వ్యక్తిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలవనున్నారు. ఆక్సియం 4 మిషన్‌లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా 2025 జూన్10న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల 52 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లబోతున్నారు.
ఐదో క్రూ మెంబర్‌గా హంస
ఆక్సియం 4 స్పేస్ మిషన్‌లో ఐదో క్రూ మెంబర్‌గా జాయ్ అనే చిన్న తెల్లని హంస బొమ్మను తీసుకెళుతున్నారు. మే 25 నుంచి క్వారంటైన్‌లో ఉన్న ఆక్సియం 4 వ్యోమగాములు జూన్ 3న జరిగిన వెబినార్‌లో ఈ జాయ్ అనే హంస బొమ్మను చూపించారు. ఇది తమ ఐదో సభ్యుడని, తమ ప్రయాణంలో భూగురుత్వాకర్షణ పరిధి నుంచి దూరమైనట్లు ముందుగా తెలియచెప్పేది ఈ హంసేనని అన్నారు. ప్రయోగానికి తాము సిద్ధంగా ఉన్నామని, అన్ని రకాల శిక్షణ పూర్తి చేసుకుని, టీం బాగా కలిసిపోయిందని కమాండర్ విట్సన్ తెలిపారు. తన ఉత్సాహాన్ని వర్ణించడానికి మాటలు లేవని గ్రూప్ కెప్టెన్ శుక్లా అన్నారు. తాను అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు పరికరాలను మాత్రమే తీసుకెళ్లనని, భారతీయుల ఆశలు, కలల్ని మోసుకెళ్తానని, తమ మిషన్ విజయవంతం కావాలని భారతీయులంతా ప్రార్థించాలని కోరారు.
ఇప్పుడేం జరుగుతోంది?
ఆక్సియం 4 వ్యోమగాములు (కొన్ని రోజులుగా) క్వారంటైన్‌లో ఉన్నారు. షెడ్యూల్డ్ ప్రయోగానికి ముందు తుది సన్నాహాలు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈ బృందం అంతరిక్షంలోకి వెళుతుంది. 28 గంటల ప్రయాణం తర్వాత వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌తో అనుసంధానమవుతారు. అక్కడ 14 రోజుల పాటు 31 దేశాల శాస్త్రీయ ప్రయోజనాలకు ఉద్దేశించిన 60 పరిశోధనా కార్యకలాపాలు నిర్వహిస్తారు. వీటిలో అంతరిక్షంలో మానవులు స్థిరంగా ఎలా జీవించడం అనే అంశంపై పలు శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు చేస్తామని, వాటి ఫలితాలు అంతరిక్ష సమాజంతో పాటు, భూమ్మీద ఉన్న వారికి కూడా ప్రయోజనాలు చేకూరుస్తాయని క్రూ కమాండర్ పెగ్గీ విట్సన్ అన్నారు.
విద్యావేత్తలతో లైవ్‌లో మాట్లాడనున్న శుక్లా
శుభాంశు శుక్లా కూడా భారత పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన ఏడు ప్రయోగాలను అంతరిక్షంలోని మైక్రో గ్రావిటీలో నిర్వహించనున్నారు. అంతరిక్షం నుంచి భూమ్మీద ఉన్న విద్యార్థులు, విద్యావేత్తలతో లైవ్‌లో మాట్లాడనున్నట్లు శుక్లా తెలిపారు. ఈ మిషన్‌లో సాధించిన అనుభవం భారత్ భవిష్యత్ ప్రయోగాలైన గగనయాన్, భారత్ అంతరిక్ష కేంద్రం వంటి మిషన్లకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు శుక్లా.
తాము ఈ మిషన్‌లో ఐదో సభ్యుడిగా తీసుకెళుతున్న హంస బొమ్మను జీరో గ్రావిటీ ఇండికేటర్‌గా బృంద సభ్యులు ఎంచుకున్నారని శుక్లా తెలిపారు. హంసకు భారతీయ సంస్కృతిలో విశేష స్థానం ఉందని, ‘హంసను జ్ఞానానికి, విద్యకు, స్వచ్ఛతకు ప్రతీక అయిన సరస్వతీ దేవి వాహనం’గా చూస్తారని ఆయన అన్నారు. పాలను, నీళ్లను వేరు చేసే అరుదైన సామర్థ్యం దీనికి ఉందని చెబుతారని శుక్లా వివరించారు.
ఎవరీ శుభాంశు శుక్లా?
శుభాంశు శుక్లా 1985 అక్టోబర్ 10న లఖ్‌నవూలో పుట్టారు. 2006లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా చేరారు. ఆక్సియం స్పేస్‌లో పేర్కొన్న ప్రకారం ఆయనకు 2 వేల గంటలకు పైగా వివిధ రకాల యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉంది. భారత వైమానికదళంలో శుక్లా చేరడం అనూహ్యంగా జరిగిందని ఆయన సోదరి శుచి మిశ్రా బీబీసీకి చెప్పారు. ”శుభాంశు 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతని స్నేహితుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరే ఉద్దేశంతో దరఖాస్తు తీసుకొచ్చాడు. కానీ అతనికి వయోపరిమితి ఎక్కువకావడంతో అర్హత లేకపోయింది. ఆ దరఖాస్తు వృథా చేయడం ఇష్టంలేక, శుభాంశు దాన్ని నింపాడు, ఎంపికయ్యాడు. ఇక వెనుదిరిగి చూడలేదు” అని గుర్తుచేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!